Vijay Speech: రాజకీయ నాయకుడిగా విజయ్ తొలి ప్రసంగం.. బీజేపి, ఉదయనిధి స్టాలిన్ పార్టీల గురించి క్లారిటీ

Update: 2024-10-27 17:14 GMT

Actor Vijay's First Political Speech: తమిళ స్టార్ హీరో విజయ్ ఇవాళ తమిళ రాజకీయాల్లో ఒక హాట్ టాపిక్ అయ్యారు. అందుకు కారణం ఆయన స్థాపించిన తమిళగ వెట్రి కరగం పార్టీకి సంబంధించిన ఇవాళే భారీ ఎత్తున ఒక బహిరంగ సభ జరిగింది. విల్లుపురం జిల్లా విక్రమండిలో జరిగిన భారీ బహిరంగ సభకు పార్టీ కార్యకర్తలు, విజయ్ అభిమానులు భారీ సంఖ్యలో తరలి వచ్చారు. ఆ పార్టీకి ఇదే మొట్టమొదటి బహిరంగ సభ కావడంతో ఆ వేదికపై నుండి విజయ్ ఏం మాట్లాడతారా అనే ఆసక్తి సర్వత్రా నెలకుంది. విజయ్ కూడా అనేక అంశాలను ప్రస్తావిస్తూ తన ప్రసంగాన్ని కొనసాగించారు.

దాదాపు 50 నిమిషాల పాటు కొనసాగిన విజయ్ ప్రసంగంలో పార్టీ వైఖరిని, తన వైఖరిని విజయ్ తేటతెల్లం చేశారు. సిద్ధాంతాల పరంగా బీజేపిని వ్యతిరేకిస్తున్నట్లు విజయ్ స్పష్టంచేశారు. లౌకికవాదం, సమానత్వం, సామాజిక న్యాయమే తమ పార్టీ సిద్ధాంతాలు అని తేల్చిచెప్పారు. ఇవి పాటించని వారితో తాము విభేదిస్తామన్నారు.

ఈ సందర్భంగా ప్రస్తుతం అధికారంలో ఉన్న డీఎంకే పార్టీపైనా విజయ్ తన అభిప్రాయాన్ని చెప్పారు. ద్రవిడియన్ మోడల్ ప్రభుత్వాన్ని నడిపిస్తామని చెప్పి అధికారంలోకొచ్చిన వాళ్లు కూడా అవినీతికి పాల్పడుతూ ద్వంద వైఖరిని అవలంభిస్తున్నారన్నారు. అంతేకాకుండా ప్రస్తుతం అవినీతిపరులే రాష్ట్రాన్ని పాలిస్తున్నారని వ్యాఖ్యానించారు. అందుకే తమ పార్టీ అవినీతిపై పోరాటం చేస్తుందని చెప్పుకొచ్చారు. ప్రస్తుతం ఎంకే స్టాలిన్ తమిళనాడు ముఖ్యమంత్రిగా ఉండగా ఆయన వారసుడు ఉదయనిధి స్టాలిన్ ఆ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా ఉన్నారు.

2026 తమిళనాడు ఎన్నికల్లో మ పార్టీ పూర్తి మెజార్టీ సాధించి అధికారం చేపడుతుందని విజయ్ ధీమా వ్యక్తంచేశారు. అదే సమయంలో అవసరమైతే తమతో కలిసొచ్చే వాళ్లతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తాం అని అన్నారు.

రాజకీయ అనుభవం లేదంటున్నారు..

నాకు రాజకీయ అనుభవం లేదంటున్నారు. అవమానిస్తున్నారు. కానీ ఒకప్పుడు సినిమాల్లోకి వచ్చినప్పుడు కూడా ఇలానే అవమానించారు. అయినా కష్టపడి పనిచేస్తూ ఇక్కడి వరకొచ్చాను. అలానే రాజకీయాల్లోనూ కష్టపడి పనిచేస్తానన్నారు. ఆమాటకొస్తే.. తమిళనాట ఎంజేఆర్, తెలుగునాట ఎన్టీఆర్ కూడా తొలుత అవమానాలు ఎదుర్కున్నా ఆ తరువాత వాళ్లు చరిత్ర సృష్టించారు అని విజయ్ గుర్తుచేసుకున్నారు. తనను ఎవరెన్ని కామెంట్స్ చేసి అవమానించినా, తాను మాత్రం మీ అందరిపై నమ్మకంతోనే పీక్ స్టేజ్‌లో ఉన్న కెరీర్‌ని వదిలేసుకుని మరీ మీ ముందుకొచ్చానని విజయ్ స్పష్టంచేశారు. రాజకీయ అనుభవం లేకపోయినా మీ కోసం పోరాడగలనన్న ఆత్మ విశ్వాసం మెండుగా ఉందని అన్నారు. 

Tags:    

Similar News