మరో ప్రయోగానికి సిద్ధమవుతున్న ఇస్రో.. ఈనెల 26న PSLV ప్రయోగం
*ఉ.11:56 గంటలకు నింగిలోకి PSLV-C 54.. కక్ష్యలోకి ఓపెన్ శాట్‌తో పాటు పలు విదేశీ ఉపగ్రహాలు
ISRO: అంతరిక్ష ప్రయోగాలలో వరుస విజయపరంపరను కొనసాగిస్తున్న ఇస్రో మరో ప్రయోగానికి సిద్ధమవుతోంది. అత్యున్నత వాహకనౌక PSLV ద్వారా ఈనెల 26న ప్రయోగానికి ఏర్పాట్లు చేస్తోంది. తిరుపతి జిల్లా శ్రీహరికోట అంతరిక్ష ప్రయోగ కేంద్రం సతీష్ ధావన్ స్పేస్ సెంటర్‌లో ఇందుకు సంబంధించిన ఏర్పాట్లు వేగంగా జరుగుతున్నాయి.
ఇస్రో మరో రాకెట్ ప్రయోగానికి సన్నద్ధమవుతోంది. శ్రీహరికోటలోని షార్ నుంచి ఈ నెల 26న PSLV-C 54 రాకెట్ ప్రయోగం జరగనుంది. ఇప్పటికే రాకెట్ మూడు దశల అనుసంధాన పనులు పూర్తిచేసి నాలుగో దశలో ఉపగ్రహాన్ని అమర్చే ప్రక్రియలో శాస్త్రవేత్తలు ఉన్నారు. ఈ రాకెట్ ద్వారా ఓపెన్ శాట్ ఉపగ్రహంతో పాటు ఇస్రో, భూటాన్ సంయుక్తంగా రూపకల్పన చేసిన ఉపగ్రహం, మరో నాలుగు వాణిజ్య ఉపగ్రహాలను అంతరిక్షంలోకి పంపనున్నారు.
నిన్న ప్రైవేట్ రాకెట్ ప్రయోగానికి కోసం షార్‌కు వచ్చిన ఇస్రో చైర్మన్ డాక్టర్ ఎస్. సోమనాథ్ రాకెట్ అనుసంధాన పనులను పరిశీలించారు. ప్రయోగ ఏర్పాట్లపై శాస్త్రవేత్తలతో చర్చించారు. 26న ఉదయం 11గంటల 56నిమిషాలకు షార్‌లోని మొదటి ప్రయోగ వేదిక నుంచి PSLV రాకెట్ నింగిలోకి ఎగరనుంది.