మరో ప్రయోగానికి సిద్ధమైన ఇస్రో.. PSLV - C 54 ప్రయోగానికి సిద్ధం

* విజయవంతంగా ముగిసిన రిహార్సల్స్ ప్రక్రియ.. రేపు ఉదయం 11.56 గం.లకు నింగిలోకి PSLV - C 54 రాకెట్

Update: 2022-11-25 01:05 GMT

మరో ప్రయోగానికి సిద్ధమైన ఇస్రో.. PSLV - C 54 ప్రయోగానికి సిద్ధం 

ISRO: అగ్రరాజ్యాలకు ధీటుగా అంతరిక్ష ప్రయోగాలను చేపడుతున్న భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో, మరో ప్రయోగానికి సిద్ధమైంది. వరుస విజయాలు అందుకుంటున్న ఉత్సాహంలో సరికొత్త ప్రయోగానికి శ్రీకారం చుట్టింది. శ్రీహరికోట అంతరిక్ష ప్రయోగ కేంద్రం షార్‌ లోని మొదటి ప్రయోగ వేదిక నుంచి ఈ ప్రయోగాన్ని రేపు చేపట్టనుంది. అచ్చొచ్చిన పోలార్ సాటిలైట్ లాంచ్ వెహికిల్.. PSLV ద్వారా సీ - 54 అనే రాకెట్‌ను రేపు ఉదయం 11 గంటలా 56 నిమిషాలకు ప్రయోగించనున్నారు. దీనికి సంబంధించిన అనుసంధాన ప్రక్రియను రెండు రోజుల క్రితం చేపట్టిన శాస్త్రవేత్తలు తాజాగా రిహార్సల్స్ ను విజయవంతంగా పూర్తి చేశారు. రాకెట్‌‌ను మొబైల్‌ సర్వీసు టవర్‌ నుంచి ముందుకు తీసుకెళ్లి మళ్లి వెనక్కి తెచ్చే ప్రక్రియను చేపట్టారు.

PSLV సీ - 54 వాహకనౌకలో నాలుగు దశలను సిద్దం చేసిన సైంటిస్టులు శిఖరభాగాన పేలోడ్‌లో ఓషన్‌శాట్‌ - 3 తో పాటు మరో ఎనిమిది నానో ఉపగ్రహాలను అమర్చారు. 960 కిలోల బరువుతున్న ఓషన్‌‌శాట్‌ -3 సహా భూటాన్ శాట్, ఆనంద్ శాట్, ధ్రువస్పేస్‌కు చెందిన థైబోల్ట్-1, థైబోల్ట్-2 శాటిలైట్లు, అమెరికాలోని స్పేస్‌ ఫ్లైట్‌ సంస్థకు చెందిన నాలుగు ఆస్ట్రో కాస్ట్ శాటిలైట్లను ఇస్రో నింగిలోకి పంపనున్నది. ఓషన్‌శాట్‌ భూ పరిశీలన ఉపగ్రహం కాగా ఇప్పటికే ఓషన్‌శాట్ సిరీస్‌లో ఓషన్‌శాట్-1, ఓషన్‌శాట్-2 ఉపగ్రహాలను ఇస్రో నింగిలోకి పంపింది. ప్రస్తుతం ఈ సిరీస్‌లో మూడో ఉపగ్రహాన్ని ప్రయోగించనున్నారు. సముద్రం, వాతావరణాన్ని అధ్యయనం చేస్తూ తుఫానుల అంచనా వేయడానికి ఓషన్‌శాట్‌ సిరీస్‌ శాటిలైట్స్‌ ఉపయోగపడుతున్నాయి.

ఐదేళ్లపాటు సేవలు అందించే విధంగా ఈ ఉపగ్రహాన్ని రూపొందించారు. రిహార్సల్స్‌ విజయవంతం కావడంతో ప్రీ కౌంట్‌డౌన్, తర్వాత కౌంట్‌డౌన్‌ ప్రారంభించనున్నారు. కౌంట్‌డౌన్‌ సమయంలో రాకెట్‌లోని నాలుగుదశలలో ఇంధనాన్ని నింపే ప్రక్రియను చేపట్టనున్నారు. నాలుగో దశలో ఉపగ్రహాన్ని అమర్చి దానిచుట్టూ ఉష్ణకవచం హీట్‌షీల్డ్‌ అమర్చే ప్రక్రియ పూర్తి చేసి ప్రయోగానికి సిద్ధం చేశారు. ఈ రాకెట్‌ ద్వారా నిర్థేశిత కక్ష్యలోకి ఉపగ్రహాలను ప్రవేశపెట్టేందుకు సమాయత్తమవుతున్నారు. 

Tags:    

Similar News