ISRO: GSLV మార్క్- 3 ప్రయోగానికి ఏర్పాట్లు
ISRO: ఈనెల 23న GSLV మార్క్- 3 రాకెట్ ప్రయోగం
ISRO: భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో ప్రతిష్టాత్మకంగా చేపడుతోన్న GSLV మార్క్ - 3 ప్రయోగానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈనెల 22న GSLV మార్క్- 3ను రోదసిలోకి పంపాలని ముందుగా నిర్ణయించిన ఇస్రో కొద్ది మార్పులు చేసింది. ఒక్కరోజు ఆలస్యంగా ఈనెల 23న GSLV మార్క్ - 3 రాకెట్‌ను ప్రయోగించనున్నట్లు ఇస్రో ప్రకటించింది. ఇందుకోసం ప్రయోగ సన్నాహకాలను వేగవంతం చేసింది.
తిరుపతి జిల్లాలోని సతీశ్ ధావన్ స్పేస్ సెంటర్ నుంచి ఈ నెల 22న తలపెట్టిన GSLV మార్క్- 3 వాహకనౌక ప్రయోగం ఒకరోజు వాయిదా వేశారు. వాహకనౌక అనుసంధాన కార్యక్రమాలు రెండో ప్రయోగవేదిక సమీపంలోని వ్యాబ్‌లో జరుగుతున్నాయి. ఇప్పటికే అన్ని పనులు పూర్తయ్యాయి. ఎల్-110లో సాంకేతిక లోపం ఉన్నట్లు శాస్త్రవేత్తలు గుర్తించినట్లు సమాచారం. దీన్ని సరిచేసేందుకు కొంత సమయం అవసరం కావడంతో ప్రయోగ తేదీని ఒక రోజు పొడిగించారు. ఈ నెల 23న ప్రయోగం చేసేలా శాస్త్రవేత్తలు నిర్ణయించారు. ఈ మేరకు ఇస్రో శాస్త్రవేత్తలు ఏర్పాట్లు చేస్తున్నారు.
GSLV మార్క్ - 3 వాహకనౌక ద్వారా వన్ వెబ్‌కు చెందిన, ఒక్కోటి 142 కిలోల బరువున్న 36 ఉపగ్రహాలను నిర్ణీత కక్ష్యలో ప్రవేశపెట్టనున్నారు. శ్రీహరికోట నుంచి మొదటిసారిగా అత్యంత భారీ పేలోడ్స్ ను మోసుకెళ్లనుండటంతో శాస్త్రవేత్తలు అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న GSLV మార్క్- 3 ప్రయోగం నేపథ్యంలో రాకెట్ కేంద్రం షార్‌లో హడావిడి మొదలైంది. అన్ని విభాగాల యంత్రాంగం అప్రమత్తమైంది. షార్ సమీపంలో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్ల మధ్య ప్రయోగ సన్నాహకాలు నిర్విరామంగా కొనసాగుతూ ఉన్నాయి.