రూ. 80 లక్షల నిలువు దోపిడి కేసును ఇజ్రాయెల్ టెక్నాలజీతో సాల్వ్ చేసిన పోలీసులు

Israeli facial recognition technology helped Delhi Police to solve Rs 80 lakh robbery case mystery in Delhi
Rs 80 lakhs robbery case mystery solved: మార్చి 17న ఢిల్లీలోని ఎర్రకోట ఎదురుగా ఉన్న చాందినీ చౌక్‌లో సినీ ఫక్కీలో ఒక ఘరానా దోపిడి జరిగింది. ఒక వ్యాపారి వద్ద పని చేసే ఉద్యోగి రూ. 80 లక్షలు తీసుకుని ఇంటికి వెళ్తుండగా చాందినీ చౌక్‌లో ఇద్దరు యువకులు ఉన్నట్లుండి ఆ వ్యక్తికి అడ్డం వచ్చారు. తమ వద్ద ఉన్న తుపాకీని గాల్లోకి పేల్చి ఆ క్యాష్ బ్యాగ్ ఇవ్వాల్సిందిగా బెదిరించారు. దాంతో ఆ వ్యక్తి తన వద్ద ఉన్న ఆ క్యాష్ బ్యాగ్ ఇచ్చేశారు. బ్యాగ్ తీసుకున్న అనంతరం బాధితుడిని మిస్‌లీడ్ చేసేందుకు చెరో వైపు పారిపోయారు.
ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న చాందిని చౌక్ పోలీసులు దర్యాప్తు మొదలుపెట్టారు. చాందినిచౌక్, రెడ్ ఫోర్ట్, జమా మసీద్, దర్యాగంజ్, లాహోరి గేట్ ప్రాంతాల్లో ఇన్‌స్టాల్ చేసి ఉన్న దాదాపు 500 సీసీటీవీ కెమెరాలను పరిశీలించారు. చోరీ జరిగిన సమయంలో బాధితుడిని నీలి రంగు షర్ట్ వేసుకుని, క్యాప్ ధరించిన ఒక వ్యక్తి అనుసరించడం కనిపించింది. దోపిడీ అనంతరం ఆ యువకుడు ఫతేపురి మసీద్ వైపు పరుగెత్తాడు. మరో యువకుడు స్కూటీపై ఎర్రకోట వైపు పారిపోవడం సీసీ కెమెరాల్లో రికార్డ్ అయిన దృశ్యాల్లో గమనించినట్లు నార్త్ జోన్ డీసీపీ రాజా బంతియా చెప్పారు.
వారు పారిపోయిన ప్రాంతాల్లో పోలీసులు జల్లెడ పట్టినప్పటికీ లాభం లేకపోయింది. స్కూటీ వెతికినా ఫలితం కనిపించలేదు. అప్పుడే ఇజ్రాయెల్ నుండి ఇంపోర్ట్ చేసుకున్న ఫేషియల్ రికగ్నిషన్ టెక్నాలజీని రంగంలోకి దింపారు. సీసీ కెమెరాల్లోని దృశ్యాల్లో ఉన్న వ్యక్తిని స్క్రీన్‌షాట్ తీసి అందులో అప్‌లోడ్ చేశారు. దాంతో ఆ వ్యక్తిని ఒక పాత కేసులో నిందితుడిగా ఉన్న 21 ఏళ్ల యువకుడు మొహమ్మద్ అలీతో మ్యాచ్ చేసి చూపించింది.
దర్యగంజ్‌లో నివాసం ఉండే అలీని అరెస్ట్ చేసి విచారించగా తన నేరాన్ని అంగీకరించాడు. అలీ చెప్పిన వివరాల ప్రకారమే దర్యాగంజ్‌లోనే సమీర్ అనే రెండో నిందితుడిని కూడా ఢిల్లీ పోలీసులు పట్టుకున్నారు. సమీర్ ఇంట్లో తనిఖీ చేయగా రూ.79.5 లక్షల క్యాష్ బ్యాగ్, సెమీఆటోమేటిక్ పిస్తల్, మూడు బుల్లెట్స్ లభించాయి. వాటిని స్వాధీనం చేసుకున్న పోలీసులు ఇద్దరినీ రిమాండ్‌కు తరలించారు.
కుచ్చ ఘాసిరామ్ ప్రాంతంలో అజ్మల్ భాయ్ గణేష్ అనే వ్యక్తి రోజూ నగదు తీసుకెళ్లడం అలీ గమనించాడు. అలీ, సమీర్ ఇద్దరూ కలిసి స్కెచ్ వేసి రెక్కీ నిర్వహించారు. అనుకున్న ప్లాన్ ప్రకారమే సోమవారం గణేష్‌ను టార్గెట్ చేసి రూ. 80 లక్షలు దోచుకున్నారు. కానీ ఆ తరువాత రెండు రోజులకే ఇలా ఇజ్రాయెల్ ఫేషియల్ రికగ్నిషన్ టెక్నాలజీకి పోలీసులకు దొరికిపోయారు.
ఢిల్లీ పోలీసులు పాత నేరస్తుల డేటా అంతా ఈ ఫేషియల్ రికగ్నిషన్ టెక్నాలజీలో నిక్షిప్తం చేసి పెట్టారు. ఆ డేటా ప్రకారం కొత్తగా ఎవరి జాడ అయినా పట్టుకోవాలనుకుంటే... అందులో వారి ఫోటోను అప్‌లోడ్ చేయాల్సి ఉంటుంది. ఒకవేళ పాత రికార్డ్స్‌లో ఉన్న డేటాతో ఆ ఫోటో సరిపోలినట్లయితే... వారి చిరునామా, జాతకాన్ని అది ప్రింట్ తీసి పోలీసుల చేతిలో పెడుతుంది.