Savitri Jindal: భారత్‌లో అత్యంత ధనికురాలైన హర్యానా ఎమ్మెల్యే సపోర్ట్ ఎవరికి?

Update: 2024-10-09 11:36 GMT

Savitri Jindal: దేశంలో అత్యంత ధనికురాలిగా హర్యానాకు చెందిన సావిత్రి జిందాల్ కి పేరుంది. ఆమె హర్యానా ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి గెలిచారు. హర్యానా ఎన్నికల్లో గెలిచిన ముగ్గురు స్వతంత్ర అభ్యర్థుల్లో సావిత్రి జిందాల్ కూడా ఒకరు. ప్రముఖ వ్యాపారవేత్త, బీజేపి నాయకుడైన నవీన్ జిందాల్ ఈమె కుమారుడే. ఎన్నికల్లో విజయం సాధించిన అనంతరం కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్, త్రిపుర మాజీ సీఎం బిప్లవ్ దేవ్ లతో సావిత్రి జిందాల్ సమావేశమయ్యారు. ఢిల్లీలో జరిగిన ఈ సమావేశానికి నవీన్ జిందాల్ కూడా హాజరయ్యారు. ఈ సమావేశం అనంతరం ఆమె బీజేపికే తాను మద్దతు ప్రకటిస్తున్నట్లు తెలిపారు.

సావిత్రి జిందాల్‌కి ఎన్ని ఓట్లు వచ్చాయంటే..

హర్యానాలోని ఇండస్ట్రియల్ ఏరియాల్లో ఒకటైన హిసార్ నుండి సావిత్రి జిందాల్ పోటీ చేసి గెలిచారు. ఆమె తన సమీప ప్రత్యర్థి అయిన కాంగ్రెస్ నేత రామ్ నివాస్ రానాపై 18,941 ఓట్ల తేడాతో విజయం సాధించారు. జిందాల్ కి 49231 ఓట్లు రాగా రామ్ నివాస్ రానాకు 30,290 ఓట్లు లభించాయి. ఇప్పటివరకు అక్కడ ఎమ్మెల్యేగా ఉన్న బీజేపి నేత కమల్ గుప్తా 17385 ఓట్లతో మూడో స్థానానికే పరిమితమయ్యారు.

మరోవైపు స్వతంత్ర అభ్యర్థులుగా గెలిచిన మిగతా ఇద్దరు ఎమ్మెల్యేలు కూడా బీజేపికే తమ మద్దతు ప్రకటించారు. దీంతో ఇప్పటికే 48 స్థానాలు గెలుచుకున్న బీజేపికి ఈ ముగ్గురు స్వతంత్ర ఎమ్మెల్యేల చేరికతో మొత్తం బలం 51 కి చేరినట్లయింది. హర్యానాలో మొత్తం 90 అసెంబ్లీ స్థానాలున్నాయి. ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి అవసరమైన ఎమ్మెల్యేల సంఖ్య 46 గా ఉంది. సొంతంగానే ఆ మేజిక్ ఫిగర్ దాటిన బీజేపికి స్వతంత్రుల రాకతో ఆ బలం మరింత పెరిగింది. 

Tags:    

Similar News