విషాద వలయంలో అమర్‌నాథ్ యాత్రికులు.. 15కు చేరిన మృతుల సంఖ్య..
Amarnath Yatra: అమర్‌నాథ్ యాత్ర కన్నీటి యాత్రగా మారింది.
Amarnath Yatra: అమర్‌నాథ్ యాత్ర కన్నీటి యాత్రగా మారింది. భంభం భోలే అంటూ వెళ్లిన భక్తులు భయంతో బిక్కుబిక్కుమంటున్నారు. ఆ దేవున్ని వరాలు అడుగుదామని వెళ్లిన భక్తులను వరదలు ముంచెత్తాయి. ఊహించని వరదలు అమర్‌నాథ్ యాత్రికులను ఊపిరాడకుండా చేస్తున్నాయి. వేసుకున్న గుడారాలను, తెచ్చుకున్న సామాగ్రిని తుడ్చిపెట్టేశాయి. వెంట వచ్చినవారు గల్లంతయ్యారు. ప్రాణాలతో ఉన్నారో బురదల్లో చిక్కుకున్నారో తెలియక యాత్రికులు టెన్షన్ పడుతున్నారు.
అమర్‌నాథ్‌యాత్రలో తలెత్తిన ఈ ప్రకృతి విపత్తుకు 15 మంది యాత్రికులు చనిపోయినట్లు అధికారులు వెల్లడించారు. మరో 40 మందికి పైగా గల్లంతయ్యారు. దీంతో ఇంకా మృతులసంఖ్య పెరిగే అవకాశం లేకపోలేదు. బురదను తొలగిస్తున్నా కొద్దీ మృతదేహాలు బయటపడుతూనే ఉన్నాయి. దీంతో యాత్ర కోసం వెళ్లిన వారు ఎలా ఉన్నారో అని కుటుంబ సభ్యులు, బంధువులు ఆందోళన చెందుతున్నారు.
అమర్‌నాథ్ యాత్ర ప్రాంతాలను మేఘాలు దట్టంగా కమ్మేశాయి. భీకర వర్షాలు విజృంభించాయి. కొండలను చీల్చే వరదలు ముంచెత్తాయి. ఆ వరదలు బురదను వెంటేసుకొచ్చాయి. దీంతో అక్కడి వీధులు, రోడ్లు అన్ని బురదమయంగా మారాయి. వాహనలైయితే బురదల్లో సగం వరకు చిక్కుకపోయాయి. అడుగుతీసి అడుగు వేసే పరిస్థితి లేదు. దీంతో ఎక్కడి వారు అక్కడే చిక్కుకపోయారు. రెస్క్యూటీ వారిని సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు అహర్నిషలు శ్రమిస్తూనే ఉన్నారు. మరోపక్క వరదలు ఏమాత్రం ఉధృతి తగ్గించకుండా కంటిన్యూ అవుతున్నాయి.
కరోనా కారణంగా అమర్‌నాథ్ యాత్ర రెండేళ్లుగా వాయిదా పడుతూ వచ్చింది. ఈ ఏడాది కేసులు తగ్గడంతో అధికారులు యాత్రకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. జూన్ 30 నుంచి ఆగస్టు 11 వరకు యాత్ర కొనసాగుతుందని ప్రకటించారు. దీంతో అమర్‌నాథ్ యాత్రికులు, భక్తులు చకచక రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. ఆ అమర్‌నాథుడిని దర్శించుకునేందుకు ఏకంగా 3లక్షల మంది రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. ఆ ప్రకృతి అందాలను వీక్షిస్తూ సహసయాత్రకు కదిలివెళ్లారు. కానీ ఆ దేవదేవుడిని దర్శించుకోకముందే ప్రకృతి ప్రకోపానికి బలి కావాల్సి వచ్చింది.