CoronaVirus: కరోనా కేసుల్లో అమెరికాను దాటిన ఇండియా
CoronaVirus: మనం ఇదివరకు ఊహించనిది ఇప్పుడు జరుగుతోంది. ప్రపంచంలోనే ఎక్కువగా నష్టపోతున్న దేశంగా ఇండియా మారుతోంది.
CoronaVirus: మనం ఇదివరకు ఊహించనిది ఇప్పుడు జరుగుతోంది. ప్రపంచంలోనే ఎక్కువగా నష్టపోతున్న దేశంగా ఇండియా మారుతోంది. అవును.. దేశంలో కరోనా సెకండ్ వేవ్ పట్టపగ్గాల్లేకుండా చెలరేగుతుంది. మరీ ముఖ్యంగా ఏప్రిల్ నెలలో కట్టలు తెంచుకున్న మహమ్మారి వైరస్.. ఏకంగా రోజువారీ కేసుల్లో అమెరికానే బీట్ చేసింది.
మూడు లక్షల రోజువారీ కేసులతో భారత్ ప్రపంచ రికార్డ్ నమోదు చేసింది. చెప్పాలంటే.. 3లక్షల 7వేల 581కేసులతో ఇప్పటివరకు అమెరికా ముందుంది. ఇప్పుడు 3లక్షల 14వేల 835 కేసులతో భారత్ దీనిని బీట్ చేసింది. ఇక మరే దేశంలోనూ ఒక్కరోజులో ఇంత మందికి కరోనా సోకలేదు. నిజానికి.. వైరస్ వ్యాప్తి వేగం కూడా భారత్‌లోనే అధికంగా ఉంది.
అగ్రరాజ్యం అమెరికాలో.. లక్ష నుంచి రెండు లక్షల కేసులకు చేరడానికి 33 రోజులు, 2లక్షల నుంచి 3లక్షల కేసులకు చేరడానికి 36 రోజుల సమయం పట్టింది. కానీ భారత్‌లో పది రోజుల్లోనే లక్ష నుంచి 2 లక్షల కేసుల స్థాయికి.. ఏడు రోజుల్లోనే 2లక్షల నుంచి మూడు లక్షల స్థాయికి ఎగబాకింది. గడిచిన 22 రోజుల్లోనే 37లక్షల 78వేల 630 మంది వైరస్ బారిన పడ్డారు. 22వేల 99మంది కన్నుమూశారు.
రోజువారీ కరోనా బాధితుల సంఖ్య భారత్‌లో అధికంగా ఉన్నప్పటికీ కరోనా వైరస్ కారణంగా మృతి చెందుతున్న వారి సంఖ్య తక్కువగానే ఉంటోంది. అయితే ప్రస్తుతం మరణాలపరంగా బ్రెజిల్ ముందుంది. అక్కడ రోజూ 3వేల మందికిపైగా కన్నుమూస్తున్నారు. కాగా.. ప్రతి పది లక్షల జానాభాకు అమెరికాలో వేయి 754, బ్రెజిల్‌లో వేయి 785 సంభవిస్తుంటే భారత్‌లో 133కి పరిమితమయ్యాయి. అయితే భారత్‌లో కోవిడ్ మరణాలను సరిగా లెక్కించడం లేదని విమర్శలు వస్తున్నాయి.
రోజురోజుకూ పెరుగుతున్న కేసులతో అటు ఆసుపత్రుల్లో, ఇటు శ్మశానాల దగ్గర రద్దీ పెరిగింది. గతంలో ఎన్నడూలేని విధంగా ఈసారి ఆక్సిజన్ అవసరం పెరిగిపోడంతో బాధితులు రోగం కంటే ఎక్కువగా వైద్య సదుపాయాలు అందక అల్లాడిపోతున్నారు.