Haryana Polls: హర్యానా ఓటమి తరువాత కాంగ్రెస్‌కి మరో ఊహించని షాక్.. అది కూడా మిత్రపక్షాల నుండే
Haryana Election Result 2024 Review: హర్యానాలో ఓటమి దిగులుతో ఉన్న కాంగ్రెస్ పార్టీకి మరో ఊహించని పరిణామం ఎదురైంది. ఇండియా బ్లాక్ కూటమిలోనే కొన్ని మిత్రపక్షాలు హర్యానాలో కాంగ్రెస్ ఓటమికి ఆ పార్టీ వైఖరే కారణమని మండిపడుతున్నాయి. ముఖ్యంగా ఉద్దవ్ థాకరే నేతృత్వంలోని ఉద్దవ్ బాల్ థాకరే శివసేన పార్టీ, తృణమూల్ కాంగ్రెస్ పార్టీలు కాంగ్రెస్ పార్టీపై బాహటంగానే తమ అసంతృప్తిని వెళ్లగక్కుతున్నాయి. ఓవర్-కాన్ఫిడెన్స్, అహంకారపూరిత వైఖరే కాంగ్రెస్ ఓటమికి ప్రధాన కారణాలు అని ఆ పార్టీలు ఆరోపిస్తున్నాయి.
త్వరలోనే మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. మహారాష్ట్రలో ఉద్ధవ్ థాకరే నేతృత్వంలోని శివసేన పార్టీ కాంగ్రెస్ పార్టీతో కలిసి పోటీ చేయనుంది. ఈ నేపథ్యంలోనే హర్యానా అసెంబ్లీ ఎన్నికల ఫలితాలను విశ్లేషిస్తూ ఉద్ధవ్ థాకరే మౌత్ పీస్ అయినటువంటి సామ్నా పత్రికలో ఒక సంపాదకీయాన్ని ప్రచురించారు. ఆ సంపాదకీయ కథనంలోనే కాంగ్రెస్ పార్టీ ఓటమికి కారణాలను విశ్లేషిస్తూ.. మితిమీరిన ఆత్మ విశ్వాసం, అహంకారపూరిత వైఖరి వల్లే ఆ పార్టీ ఓడిపోయిందని పేర్కొన్నారు. అంతేకాకుండా హర్యానా ఎన్నికల ఫలితాల నుండి కాంగ్రెస్ పార్టీ గుణపాఠాలు నేర్చుకోవాలని సామ్నా కథనం హితవు పలికింది.
మధ్యప్రదేశ్, ఛత్తీస్‌ఘడ్ ఎన్నికల విషయంలోనూ అదే జరిగిందని సామ్నా కథనం స్పష్టంచేసింది. ఆ రెండు రాష్ట్రాల్లోనూ కాంగ్రెస్ పార్టీలో అంతర్గత పోరు ప్రతికూల ఫలితాలకు కారణమైందని వెల్లడించింది. హర్యానాలో కాంగ్రెస్ పార్టీ ఓవర్ కాన్ఫిడెన్స్‌తో ఆమ్ ఆద్మీ పార్టీ లాంటి తమ మిత్రపక్షాలను పక్కనపెట్టి ఒంటరిగా పోటీకి వెళ్లింది కనుకే ఓడిపోయింది. జమ్మూకశ్మీర్‌లో నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీతో జత కట్టింది కనుకే అక్కడ ఆ మాత్రమైనా గెలిచింది అని సామ్నా కథనం స్పష్టంచేసింది.
హర్యానా ఎన్నికల ఫలితాల విషయానికొస్తే.. 90 అసెంబ్లీ నియోజకవర్గాలున్న ఆ రాష్ట్రంలో బీజేపి మొత్తం 48 స్థానాల్లో విజయం సాధించింది. 2014 ఎన్నికల్లో సాధించిన సీట్ల కంటే కూడా ఒక సీటు ఎక్కువ. అంతేకాదు.. ఇది ఆ పార్టీకి ఎప్పటికంటే దక్కిన పెద్ద విజయం. మరోవైపు కాంగ్రెస్ పార్టీ 37 స్థానాలకే సరిపెట్టుకుంది. ఇండియన్ నేషనల్ లోక్ దళ్ (INDL) పార్టీకి రెండు సీట్లు రాగా స్వతంత్ర అభ్యర్థులు మూడు స్థానాల్లో విజయం సాధించారు.