Higher Examinations to be Conducted: ఉన్నత పరీక్షలు నిర్వహించాల్సిందే.. అభ్యర్థుల సామర్ధ్యం, ప్రమాణాలు వెల్లడి

Higher Examinations to be Conducted: కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో పలు పరీక్షలు వాయిదా పడుతున్న సంగతి తెలిసిందే.

Update: 2020-07-14 03:15 GMT
Higher Exams

Higher Examinations to be Conducted: కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో పలు పరీక్షలు వాయిదా పడుతున్న సంగతి తెలిసిందే. అయితే దీనికి భిన్నంగా ఉన్నత విద్యకు సంబంధించి పరీక్షలు నిర్వహించడం తప్పనిసరి అంటూ కేంద్ర మానవ వనరులశాఖ స్పష్టం చేసింది. వీటి వల్లే అభ్యర్థి సామర్ధ్యం, ప్రమాణాలు వెల్లడవుతాయని పేర్కొంది.అయితే వీటిని నిర్వహించే సమయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలంటూ పలు సలహాలు, సూచనలు అందజేసింది.

డిగ్రీ సహా ఉన్నత విద్యాకోర్సులకు సంబంధించి పరీక్షలు, మూల్యాంకనం, ఫలితాల వెల్లడి తప్పనిసరని కేంద్ర మానవ వనరుల శాఖతోపాటు యూజీసీ స్పష్టం చేస్తోంది. కరోనా నేపథ్యంలో పరీక్షలు ఇప్పటికిప్పుడు నిర్వహించకున్నా ఫైనలియర్‌ విద్యార్థుల పరీక్షలను నిర్వహించాల్సిన అవసరముందని పేర్కొంటున్నాయి. డిగ్రీ తదితర ఉన్నతవిద్యాకోర్సుల ఫైనలియర్‌ విద్యార్థులకు సెప్టెంబర్‌ ఆఖరులోగా పరీక్షల నిర్వహణ, మూల్యాంకనం చేపట్టి ఫలితాలు వెల్లడించాలని యూజీసీ ఇటీవల ఆదేశాలిచ్చిన సంగతి తెలిసిందే. అయితే కోవిడ్‌ దృష్ట్యా పరీక్షలపై పునరాలోచించాలని తమిళనాడు వంటి రాష్ట్రాలు కేంద్రానికి లేఖలు రాశాయి. ఢిల్లీ ప్రభుత్వం ఏకంగా యూనివర్సిటీల పరిధిలోని పరీక్షలను రద్దు చేసింది. ఈ నేపథ్యంలో యూజీసీ తాజా సూచనలు చేసింది.

పరీక్షలు తప్పనిసరి ఎందుకంటే..?

► డిగ్రీ తదితర ఉన్నతవిద్య కోర్సుల పరీక్షలను నిర్వహించి మూల్యాంకనం చేయడం ద్వారా అభ్యర్థుల ప్రమాణాలు,సామర్థ్యాల ఫలితాలు వెల్లడించాల్సిన అవసరం ఉంది.

► పరీక్షలు నిర్వహించకపోవడం వల్ల విద్యార్థులు చాలా నష్టపోతారు. జాతీయ, అంతర్జాతీయస్థాయిలో మెరిట్‌ విద్యార్థులకు నష్టం వాటిల్లే ప్రమాదం ఉంది.

► పరీక్షల నిర్వహణతో మెరిట్‌ అభ్యర్థులకు జారీచేసే సర్టిఫికెట్ల ఆధారంగా ప్రయోజనాలు చేకూరతాయి. పరీక్షలు లేకుంటే వీటిని కోల్పోతారు.

► పరీక్షల వల్ల మెరుగైన ఉద్యోగావకాశాలు, పైస్థాయి విద్యాభ్యాసానికి వెళ్లేవారికి మెరుగైన స్కాలర్‌షిప్‌లు లభించే అవకాశాలుంటాయి.

► ఈ నేపథ్యంలో ఆన్‌లైన్, ఆఫ్‌లైన్, లేదా రెండు మోడ్‌లలో కలిపి అయినా పరీక్షలు పూర్తిచేసి మూల్యాంకనం చేయడం తప్పనిసరి.

జాగ్రత్తలు తప్పనిసరి..

► పరీక్షల నిర్వహణలో తీసుకోవలసిన జాగ్రత్తలపై యూజీసీ ఇప్పటికే ఉన్నత విద్యాసంస్థలకు పలు సూచనలు చేసింది. వీటిని తప్పక పాటిస్తూ పరీక్షలు పూర్తి చేయాలని స్పష్టం చేస్తోంది.

► పరీక్షలు జరిగే భవన ప్రాంగణం మొత్తం శానిటైజేషన్‌ చేసి, థర్మల్‌ స్క్రీనింగ్‌ చేయాలి. భౌతిక దూరాన్ని పాటించేలా చూడడంతో పాటు మాస్కులు, గ్లౌజ్‌లు సిద్ధం చేసుకోవాలి.

► చుట్టు పక్కల ప్రాంతాల్లో కోవిడ్‌ కేసులు నమోదయ్యాయా? తదితర అంశాలను పరిశీలించాలి.

► పరీక్షల సమయంలో విద్యార్థుల రాకపోకలకు ఇబ్బంది లేకుండా హాల్‌టికెట్లు, ఐడీ కార్డులనే పాస్‌లుగా పరిగణించేలా ఏర్పాట్లు చేయాలి.

► ఇన్విజిలేటర్లకు, ఇతర సిబ్బందికి పాస్‌లు ఇచ్చేలా సంబంధిత అధికారులతో మాట్లాడాలి.

► గోడలు, తలుపులు, గేట్లతో సహా పరీక్ష కేంద్రాన్ని క్రిమిసంహారక మందుతో పిచికారీ చేయాలి. సిబ్బందికి మాస్కులు, గ్లౌజ్‌లు రోజూ అందించాలి. పరీక్ష కేంద్రాలు, గదుల ప్రవేశద్వారాల వద్ద శానిటైజర్‌ బాటిళ్లను ఉంచాలి.

► చేతులు శుభ్రం చేసుకొనేందుకు ద్రవ హ్యాండ్‌వాష్‌లను ఉంచాలి.

► ప్రతి సెషన్‌కు ముందు, తరువాత పరీక్ష కేంద్రంలోని కుర్చీలు, బల్లలన్నిటినీ శానిటైజ్‌ చేయించాలి.

► వాష్‌ రూమ్‌లన్నీ శుభ్రం చేసి క్రిమిసంహారక మందు స్ప్రే చేయాలి.

► డోర్‌ హ్యాండిల్స్, స్టెయిర్‌కేస్‌ రెయిలింగ్, లిఫ్ట్‌ బటన్లను శానిటైజర్‌తో శుభ్రం చేయాలి.

► పరీక్షలు నిర్వహించే సిబ్బంది, హాజరయ్యే విద్యార్థులు తమ ఆరోగ్య స్థితి గురించి సెల్ఫ్‌ డిక్లరేషన్‌ అందించాలి. ఇందుకు నిరాకరిస్తే పరీక్షలకు అనుమతించరాదు.

► సిబ్బంది, విద్యార్థులు ఆరోగ్యసేతు యాప్‌ను కలిగి ఉండాలి. పరీక్షకు వచ్చేవారికి మాస్కులు, గ్లౌజ్‌లు ప్రతిరోజూ కొత్తవి అందించాలి.

► విద్యార్థులు, సిబ్బంది వెళ్లేటప్పుడు ఒక్కొక్కరి మధ్య 2 మీటర్ల మేర భౌతికదూరం పాటించేలా చూడాలి. 

Tags:    

Similar News