టికెట్ ఇవ్వలేదనే కోపంతో ముఖ్యమంత్రి అని కూడా చూడలేదు.. వీడియో వైరల్

Update: 2024-09-06 11:45 GMT

Haryana Assembly Election 2024: హర్యానాలో అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో అక్కడి ప్రధాన పార్టీలు తమ అభ్యర్థుల జాబితాను విడుదల చేస్తున్నాయి. ఈ క్రమంలోనే తాజాగా బీజేపి కూడా తమ అభ్యర్థుల జాబితాను వెల్లడించింది. అందులో ఓబిసి మోర్చ నేత, మాజీ మంత్రి కరణ్ దేవ్ కంబోజ్ పేరు కనిపించలేదు. బీజేపి మరోసారి తనకు పోటీ చేసే అవకాశం ఇవ్వలేదని అర్థం చేసుకున్న కరణ్ దేవ్ కంబోజ్.. తమ ముఖ్యమంత్రి నాయబ్ సింగ్ షైనీపై బహిరంగంగానే తన అసంతృప్తిని వెళ్లగక్కారు.

తాజాగా పార్టీ నేతలతో జరిగిన ఒక సమావేశంలో సీఎం నాయబ్ సింగ్, కరణ్ దేవ్ కంబోజ్ కలిసి పాల్గొన్నారు. అప్పటికే ముందుగా వచ్చి కూర్చున్న సీఎం నాయబ్ సింగ్ లేచి కరణ్ దేవ్‌ని రిసీవ్ చేసుకునేందుకు ప్రయత్నించారు. మరోవైపు కరణ్ దేవ్ కూడా రెండు చేతులు జోడించి అందరికీ అభివాదం చేస్తూ వచ్చారు. తీరా ముఖ్యమంత్రి నాయబ్ సింగ్ షైనీ వద్దకు రాగానే.. ఆయనకు నమస్కరం పెట్టి అభివాదం చేయడం ఇష్టం లేనట్లుగా తన రెండు చేతులను అలాగే వెనక్కి లాక్కున్నారు. కరణ్ దేవ్ అసంతృప్తిని గ్రహించిన సీఎం నాయబ్ సింగ్.. స్వయంగా తానే చొరవ తీసుకుని చేతులు కలపబోయారు. కానీ ముఖ్యమంత్రికి షేక్ హ్యాండ్ ఇవ్వడం అస్సలే ఇష్టం లేని కరణ్ దేవ్.. ఆయన్ని అస్సలేమాత్రం పట్టించుకోకుండా ముఖ్యమంత్రి ముందు నుండే దాటుకుంటూ ముందుకెళ్లిపోయారు. ఆ తరువాత ముఖ్యమంత్రికి పక్కనే ఉన్న కుర్చిలో కూర్చున్నారు. సమావేశంలో ఉన్నంతసేపు కూడా కరణ్ దేవ్ ముఖ్యమంత్రి వైపు చూడ్డానికి ఇష్టపడలేదు. ఈ ఊహించని పరిణామానికి షాక్ అవడం సీఎం నాయబ్ సింగ్ వంతయ్యింది.

బీజేపిపై, సీఎం నాయబ్ సింగ్‌పై ఉన్న కోపాన్ని ఆయన కేవలం చేష్టలకే పరిమితం చేయలేదు. మాటల్లోనూ కరణ్ తన ఆగ్రహాన్ని వెళ్లగక్కారు. ఓబిసీ మోర్చ పదవికి రాజీనామా చేసిన కరణ్ దేవ్.. బీజేపిపై, ముఖ్యమంత్రిపై అసహనం వ్యక్తంచేశారు. నిన్నగాక మొన్న వచ్చి పార్టీలో చేరిన వాళ్లను అక్కున చేర్చుకుని టికెట్లు ఇస్తున్న ముఖ్యమంత్రి.. ఏళ్ల తరబడి పార్టీకి సేవ చేస్తోన్న వారిని మాత్రం పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. ప్రస్తుతం ముఖ్యమంత్రికి, కరణ్ దేవ్‌కి మధ్య జరిగిన సంఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. టికెట్ ఇవ్వలేదనే కారణంతో ముఖ్యమంత్రిని కూడా దేకకుండానే వెళ్లిపోయిన ఎమ్మల్యే అంటూ నెటిజెన్స్ కామెంట్స్ చేసుకుంటున్నారు.

Tags:    

Similar News