Arvind Kejriwal's Resignation: కేజ్రీవాల్ రాజీనామా ప్రకటన.. తరువాతి ప్లాన్ ఏంటి, కొత్త సీఎం ఎవరు?

Update: 2024-09-15 08:36 GMT

Arvind Kejriwal's Resignation News: ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ సంచలన ప్రకటన చేశారు. మరో రెండు రోజుల తరువాత తాను తన ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయబోతున్నట్లు కేజ్రీవాల్ ప్రకటించారు. ప్రజలు తనకు మళ్లీ ఎన్నికల్లో గెలిచే అవకాశం ఇచ్చే వరకు ఆ సీటులో కూర్చోబోనని అరవింద్ కేజ్రీవాల్ స్పష్టంచేశారు. అప్పటివరకు తాను వీధివీధి తిరుగుతూ ప్రజలను కలుస్తానని అన్నారు. తమ ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు, కార్యక్రమాలే తమకు ప్రజల నుండి మద్దతును తీసుకొస్తాయని అరవింద్ కేజ్రీవాల్ ధీమా వ్యక్తంచేశారు.

వచ్చే నవంబర్‌లో మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలతో పాటే ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు కూడా నిర్వహించాలని అరవింద్ కేజ్రీవాల్ కేంద్రాన్ని డిమాండ్ చేశారు. అప్పటివరకు తమ పార్టీ నుండే ఎవరో ఒకరు ముఖ్యమంత్రి స్థానంలో కొనసాగుతారని తెలిపారు. ఆదివారం జరిగిన ఒక సభలో పార్టీ కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడుతూ అరవింద్ కేజ్రీవాల్ ఈ వ్యాఖ్యలు చేశారు.

ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ స్కామ్ కేసులో తీహాడ్ జైలు నుండి విడుదలై వచ్చిన రెండు రోజుల వ్యవధిలోనే అరవింద్ కేజ్రీవాల్ చేసిన ఈ ప్రకటన ప్రస్తుతం రాజకీయ వర్గాల్లో ఆసక్తిని రేకెత్తిస్తోంది.

తరువాతి ప్లాన్ ఏంటి, నెక్ట్స్ సీఎం ఎవరు?

ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ రాబోయే రెండు, మూడు రోజులపాటు పార్టీ నేతలు, ఎమ్మెల్యేలతో సమావేశం కానున్నారు. ఈ సమావేశాల్లోనే ఢిల్లీకి తదుపరి తాత్కాలిక సీఎం ఎవరు అనేది నిర్ణయించనున్నారు. పార్టీ నిర్ణయించిన వ్యక్తి ముఖ్యమంత్రి బాధ్యతలు చేపట్టనుండగా, అదే సమయంలో అరవింద్ కేజ్రీవాల్, మాజీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా ఇద్దరూ కలిసి భారీ స్థాయిలో ఎలక్షన్ క్యాంపెయిన్స్ ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది. పూర్తిస్థాయిలో ఎన్నికల ప్రచారంలో పాల్గొంటూ బీజేపిని ఎండగట్టడమే పనిగా పెట్టుకునే ఉద్దేశంలో అరవింద్ కేజ్రీవాల్ ఉన్నట్లుగా రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. 

Tags:    

Similar News