నేటి నుంచి వందే మెట్రో పరుగులు.. తొలి సర్వీసును ప్రారంభించనున్న ప్రధాని
గుజరాత్‌లోని అహ్మదాబాద్-భుజ్ మధ్య తొలిరైలు
దేశంలో ఓ వైపు వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైళ్లు పరుగులు పెడుతుండగా.... అమృత్ భారత్ రైలూ అందుబాటులోకి వచ్చింది. ఇక వందే భారత్ స్లీపర్ రైళ్లు త్వరలో పట్టాలెక్కనున్నాయి. మెట్రో నగరాల మధ్య రైలు ప్రయాణాన్ని మరింత సౌకర్యవంతంగా మార్చేందుకు ఇకపై వందే మెట్రో రైళ్లు కూడా అందుబాటులోకి రానున్నాయి. దేశంలోనే తొలి వందే మెట్రో సర్వీస్ నేడు ప్రధాని చేతుల మీదుగా ప్రారంభం కానుంది. గుజరాత్‌లోని అహ్మదాబాద్- భుజ్ మధ్య ఈ రైలు పరుగులు పెట్టనుంది. గుజరాత్ పర్యటనలో ప్రధాని వందే మెట్రో సేవలను ప్రారంభించనున్నారు.
పూర్తి అన్‌రిజర్వ్‌డ్ ఎయిర్ కండీషన్‌తో కూడిన వందే మెట్రో రైలు గరిష్టంగా 110 కిలోమీటర్ల వేగంతో వెళ్లనుంది. ఇందులో 11 వందల 50 మంది కూర్చుని, 2 వేల 58 మంది నిల్చుని ప్రయాణం చేయొచ్చు. అహ్మదాబాద్- భుజ్ మధ్య 9 స్టాపుల్లో ఈ రైలు ఆగనుంది. 360 కిలోమీటర్ల దూరాన్ని 5 గంటల 45 నిమిషాల్లోనే చేరుకుంటుందని అధికారులు చెబుతున్నారు.
ప్రతి రోజూ ఉదయం భుజ్‌లో 5 గంటల 5 నిమిషాలకు ప్రారంభమై అహ్మదాబాద్ జంక్షన్‌కు 10 గంటల 50 నిమిషాలకు వందే మెట్రో చేరుకుంటుంది. పూర్తి అన్ రిజర్వ్‌డ్ కావడంతో ప్రయాణానికి ముందే టికెట్ కొనుక్కునే అవకాశాలున్నాయి. కనీస టికెట్ ధరను 30 రూపాయలుగా నిర్ణయించారు. వందే భారత్ తరహాలోనే పూర్తి ఏసీ కోచ్‌లు, కవచ్ వంటి భద్రతా సౌకర్యాలతో దీన్ని రూపొందించారు.