తప్పుదారిపట్టించే యత్నం: ఆర్ జీ కార్ ఆసుపత్రి మాజీ ప్రిన్సిపల్ పై సీబీఐ రిపోర్ట్
Kolkata Doctor Rape And Murder Case: ఆర్ జీ కార్ ఆసుపత్రి మాజీ ప్రిన్సిపల్ సందీప్ ఘోష్ ట్రైనీ డాక్టర్ పై రేప్, హత్య కేసులో సీబీఐ అధికారులను తప్పుదారిపట్టించేందుకు ప్రయత్నించారని పాలిగ్రాఫ్ పరీక్ష ఫోరెన్సిక్ నివేదిక తెలిపింది.
Kolkata Doctor Rape And Murder Case: ఆర్ జీ కార్ ఆసుపత్రి మాజీ ప్రిన్సిపల్ సందీప్ ఘోష్ ట్రైనీ డాక్టర్ పై రేప్, హత్య కేసులో సీబీఐ అధికారులను తప్పుదారిపట్టించేందుకు ప్రయత్నించారని పాలిగ్రాఫ్ పరీక్ష ఫోరెన్సిక్ నివేదిక తెలిపింది. దర్యాప్తులో భాగంగా ఆయనకు వాయిస్ అనలిస్ట్ ఎల్ విఎ, పాలిగ్రాఫ్ పరీక్షలు నిర్వహించినట్టుగా సీబీఐ రిమాండ్ నోట్ లో తెలిపింది.
ఫోరెన్సిక్ రిపోర్ట్ లో ఏముందంటే?
ఈ కేసులో సందీప్ ఘోష్ కొన్ని ముఖ్యమైన విషయాలపై దర్యాప్తు అధికారులను తప్పుదారిపట్టించేలా వ్యవహరించారని ఫోరెన్సిక్ నివేదిక తెలిపింది. ఆసుపత్రి సెమినార్ హల్ లోట్రైనీ డాక్టర్ మృతదేహం గుర్తించిన ఆగస్టు 9న ఉదయం 10:03 గంటల నుంచి ఆయన సీనియర్ పోలీస్ అధికారి అభిజిత్ మోండల్ తో టచ్ లో ఉన్నారని ఈ నివేదిక బయటపెట్టింది. మృతురాలిపై అత్యాచారం జరిగిన విషయాన్ని తగ్గించే ప్రయత్నం చేశారని సీబీఐ తెలిపింది. ట్రైనీ డాక్టర్ మరణించిన విషయం ఘోష్ కు ఆగస్టు 9న ఉదయం 09:58 గంటలకే సమాచారం వచ్చినా.... ఆయన ఆసుపత్రికి వెంటనే వెళ్లలేదని దర్యాప్తు అధికారులు గుర్తించారని ఇండియా టుడే కథనం తెలిపింది.
కోర్టుకు నివేదికను సమర్పించనున్న దర్యాప్తు అధికారులు
ఈ కేసుకు సంబంధించి దర్యాప్తు పురోగతి నివేదికను సెప్టెంబర్ 17న కోర్టుకు సీబీఐ అధికారులు అందించే అవకాశం ఉంది. ఈ కేసు దర్యాప్తునకు మూడు వారాల గడువును కోర్టు ఇచ్చింది. ఈ ఆసుపత్రిలో ఆర్దిక నేరాలకు సంబంధించిన కేసులో సందీప్ ఘోష్ కు సీబీఐ పాలిగ్రాఫ్ పరీక్షలు నిర్వహించారు. ట్రైనీ డాక్టర్ పై రేప్, హత్య కేసులో సంజయ్ రాయ్ అనే సివిల్ వాలంటీర్ ఆగస్టు 10న పోలీసులు అరెస్ట్ చేశారు.
కొనసాగుతున్న నిరసనలు
ట్రైనీ డాక్టర్ రేప్, హత్య కేసును నిరసిస్తూ బెంగాల్ వ్యాప్తంగా నిరసనలు కొనసాగుతున్నాయి. అలీపూర్ దువార్ లో దివ్యాంగులు సోమవారం ర్యాలీ చేశారు. నిందితులను శిక్షించాలని డిమాండ్ చేశారు. ఈ ఘటన వెనుక ఎంత పెద్దవారున్నా వదిలిపెట్టవద్దని కోరారు. ఇదే డిమాండ్ తో జూనియర్ డాక్టర్లు విధులు బహిష్కరించి ఆందోళన చేస్తున్నారు. విదుల్లో చేరాలని సీఎం మమత బెనర్జీ కోరారు. జూనియర్ డాక్టర్లను చర్చలకు పిలిచారు. కానీ,వారు ముందుకు రాలేదు. చర్చలను ప్రత్యక్ష ప్రసారం చేయాలని జూనియర్ డాక్టర్లు కోరుతున్నారు.