PM Modi's Visit: ప్రధాని మోదీ వస్తున్నారని స్కూల్స్, కాలేజీలకు సెలవు ఇచ్చేశారు

Update: 2024-09-16 08:17 GMT

Holiday for Schools and Colleges: ప్రధాన మంత్రులు వివిధ సందర్భాల్లో, వివిధ కారణాలతో రాష్ట్రాల్లో పర్యటించడం అనేది తరచుగా జరిగే వ్యవహారమే. కానీ కేవలం ప్రధాని వస్తున్నారనే కారణంతో ఒక రాష్ట్ర ప్రభుత్వం ఒక ప్రాంతంలోని విద్యా సంస్థలకు సెలవు ఇవ్వడం అనేది మాత్రం ఎప్పుడూ చూసుండరు. కానీ తాజాగా ప్రధాని మోదీ ఒడిషా పర్యటన విషయంలో అదే జరిగింది.

రేపు సెప్టెంబర్ 17న ప్రధాని మోదీ ఒడిషా రాజధాని భువనేశ్వర్‌లో పర్యటించనున్నారు. ఒడిషా సర్కారు కొత్తగా సుభద్ర యోజన అనే సంక్షేమ పథకాన్ని ప్రవేశపెడుతోంది. మోదీ చేతుల మీదుగా ఈ కార్యక్రమం జరగనుంది. ఇందుకోసమే ప్రధాని మోదీ రేపు భువనేశ్వర్ వస్తుండటాన్ని దృష్టిలో పెట్టుకుని భువనేశ్వర్ మునిసిపల్ కార్పొరేషన్ పరిధిలోని అన్ని విద్యాసంస్థలకు సెప్టెంబర్ 17న సెలవు ప్రకటిస్తున్నట్లు ఒడిషా ముఖ్యమంత్రి కార్యాలయం నుండి ఒక ప్రకటన వెలువడింది. అంతేకాదు.. ప్రభుత్వ కార్యాలయాలు కూడా ఫస్ట్ హాఫ్ మూసే ఉంటాయి. అంటే అధికారులు, ప్రభుత్వ సిబ్బంది రేపు మధ్యాహ్నం నుండి సాయంత్రం వరకు మాత్రమే పనిచేస్తే సరిపోతుంది.

ఇంతకీ ఈ సుభద్ర యోజన పథకం ఏంటి?

ప్రధాన మంత్రి కార్యాలయం వెల్లడించిన వివరాల ప్రకారం ఒడిషా సర్కారు 21 ఏళ్ల నుండి 60 ఏళ్ల వయస్సున్న అర్హులైన మహిళల ఖాతాల్లో ప్రతీ ఏడాది రెండు విడతల కింద రూ. 10 వేల నగదు అందించనుంది. అలా 2024-2029 మధ్య కాలంలో ఈ ఐదేళ్లపాటు మొత్తం రూ. 50 వేలు వారి ఖాతాల్లో జమ చేయనుంది. దాదాపు కోటి మందికి పైగా మహిళలు ఈ సుభద్ర యోజన పథకానికి అర్హులుగా ఉన్నారని ఒడిషా ప్రభుత్వం చెబుతోంది.

రేపు ప్రధాని నరేంద్ర బర్త్ డే సందర్భంగా సుభద్ర యోజన పథకం ప్రారంభోత్సవంలో భాగంగా ఆయన చేతుల మీదుగానే సుమారు 10 లక్షల మందికిపైగా మహిళల ఖాతాల్లో డబ్బు జమ చేసేవిధంగా ఒడిషా సర్కారు ప్రణాళికలు సిద్ధం చేసింది.

Tags:    

Similar News