ఇండియాలోనే పెట్రోల్ చీప్ అట.. రష్యాకు రూపాయల్లో చెల్లింపులకు అంగీకారం?
Fuel Price in India: ప్రపంచమంతా చమురు ధరలు భారీగా పెరిగాయి.
Fuel Price in India: ప్రపంచమంతా చమురు ధరలు భారీగా పెరిగాయి. అమెరికా సహా కెనడా, ఫ్రాన్స్, జర్మనీ, యూకే, స్పెయిన్ వంటి దేశాల్లో 50శాతం పైగా చమురు ధరలు పెరిగాయి. కానీ మన దేశంలో మాత్రం అందుకు విరుద్ధంగా కేవలం 5శాతం మాత్రమే పెరిగాయి. ఐదు రాష్ట్రాల ఎన్నికలు ఉన్నాయని.. ఫలితాలు వస్తే.. ఇక బాదుడు మొదలవుతుందని అందరూ అంచనా వేశారు. అయితే అందుకు విరుద్ధంగా పెట్రోలు ధరలు స్థిరంగా ఉన్నాయి. పెట్రోలు ధరలు పెరగడకపోవడంపై పలువురు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఎన్నికల తరువాత కూడా దేశంలో అసలు పెట్రోలు ధరలు ఎందుకు పెరగడం లేదంటూ పలువురు ఆరా తీస్తున్నారు.
ఉక్రెయిన్‌పై రష్యా సైనిక చర్య చేపడుతున్నట్టు ప్రకటించిన నాటి నుంచి అంతర్జాతీయ చమురు ధరలు భారీగా పెరిగాయి. ప్రపంచంలోనే చమురు సరఫరాదారుల్లో రష్యా రెండో స్థానంలో ఉంది. యుద్ధం నేపథ్యంలో సరఫరా నిలిచిపోయింది. దీంతో 102 డాలర్లు ఉన్న బ్యారెల్ ధర ప్రస్తుతం 112 డాలర్లకు చేరింది. మరోవైపు ప్రపంచ దేశాలు రష్యాపై ఆంక్షలు విధించడంతో క్రూడాయిల్ సరఫరాపై నీలినీడలు కమ్ముకున్నాయి. అమెరికాతో సహా పలు దేశాల్లో 50శాతం పైగా చమురు ధరలు పెరిగాయి. ఈ నేపథ్యంలో భారత్‌లోనూ పెట్రోలు ధరలు భారీగా పెరిగే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేశారు.
ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో చమురు ధరలు స్థిరంగా ఉన్నాయని అందరూ భావించారు. ఫలితాలు వెలువడిన వెంటనే ధరలు విపరీతంగా పెరుగుతున్నాయని అనుకున్నారు. కానీ దేశంలో పెట్రోలు ధరలు మాత్రం ఇప్పటికీ స్థిరంగా ఉన్నాయి. అంతర్జాతీయంగా చమురు ధరలు మండుతున్నా మన దేశంలో పెరగకపోవడంపై జోరుగా చర్చ జరుగుతోంది. అయితే గత నాలుగైదేళ్లుగా అంతర్జాతీయంగా చమురు ధరలు భారీగా పతనమైనా మన దేశంలో మాత్రం పెరుగుతూ వచ్చాయి. ఆ సమయంలో కేంద్ర ప్రభుత్వానికి భారీగా ఆదాయం వచ్చింది.
కరోనా తరువాత పరిస్థితులు మారుతూ వచ్చాయి. నిత్యావసరాల ధరలు విపరీతంగా పెరిగాయి. ప్రజలు ఆర్థిక ఇబ్బందులతో కొట్టుమిట్టాడుతున్నారు. ఈ నేపథ్యంలో పెట్రో ధరలు పెరిగితే ప్రజలపై విపరీతమైన భారం పడనున్నది. ద్రవోల్బణం పెరగనున్నది. ఫలితంగా నిత్యావసరాల ధరలపై పెను ప్రభావం చూపే అవకాశముంది. ఈ నేపథ్యంలో పెట్రో ధరలు పెరగకపోవచ్చని ఆర్థికవేత్తలు అంచనా వేస్తున్నారు. ఇక పెట్రోలుపై దిగుమతిపై అన్ని రకాల మార్గలను పరిశీలిస్తున్నట్టు కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి హర్దీప్ సింగ్ తెలిపారు. మరోవైపు చమురు కొరత రాకుండా.. రష్యాతో మైత్రిని కొనసాగించేందుకు భారత్ మొగ్గుచూపుతోంది. ఆంక్షల నేపథ్యంలో రూపాయి ఆధారిత చెల్లింపులకు రష్యా సిద్ధమైనట్టు సమాచారం. అదే జరిగితే పెట్రోలు ధరలు పెరగవని నిపుణులు చెబుతున్నారు.