US India Dosti: భారత్ కు చేరిన అమెరికా సాయం
Covid19 Relief Supplies:అమెరికా నుంచి అత్యవసర కొవిడ్ ఉపకరణాల విమానం ఈ ఉదయం భారత్ కు చేరింది.
Covid19 Relief Supplies: దేశంలో కరోనావైరస్ మహమ్మారి విలయతాండవం చేస్తోంది. దేశవ్యాప్తంగా రోజురోజుకూ కేసులు, మరణాల సంఖ్య రికార్డు స్థాయిలో పెరుగుతోంది. గతంలో ఎన్నడూ లేని విధంగా వారం నుంచి నిత్యం లక్షలాది కేసులు, వేలాది సంఖ్యలో మరణాలు సంభవిస్తున్నాయి. ఈ నేపథ్యంలో అగ్రరాజ్యం అమెరికా దాదాపు 100 మిలియన్ డాలర్ల సాయం చేస్తున్నట్లు వైట్ హౌస్ ప్రకటించింది. భారీగా మందులు, వైద్య పరికరాలను భారత్‌కు పంపించింది. అమెరికా నుంచి బయలుదేరిన తొలి విమానం నేడు ఢిల్లీకి చేరింది.
అమెరికా నుంచి అత్యవసర కొవిడ్ ఉపకరణాల విమానం ఈ ఉదయం భారత్ కు చేరింది. కరోనా రెండో వేవ్ ఇండియాను తీవ్ర ఇబ్బందులు పెడుతూ, ఆరోగ్య వ్యవస్థపై ప్రభావం చూపుతూ, రోజుకు దాదాపు 4 లక్షలకు కేసులు పెరుగుతున్న వేళ, అమెరికా నుంచి తొలి షిప్ మెంట్ అందింది. ఇందులో భాగంగా 400 ఆక్సిజన్ సిలిండర్లు, 10 లక్షల ర్యాపిడ్ కరోనా వైరస్ టెస్ట్ కిట్లు, ఇతర ఆసుపత్రి ఉపకరణాలను మోసుకుని వచ్చిన సూపర్ గెలాక్సీ మిలిటరీ ట్రాన్స్ పోర్టర్స్ విమానం, ఢిల్లీలోని అంతర్జాతీయ విమానాశ్రయంలో ఈ ఉదయం ల్యాండ్ అయింది.
ఇందుకు సంబంధించిన చిత్రాలను భారత్ లోని యూఎస్ ఎంబసీ, తన అధికారిక ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేసింది. తాము పంపనున్న ఎన్నో విమానాల్లో ఇది మొదటిదని, ఇరు దేశాల మధ్యా ఉన్న 70 సంవత్సరాల అనుబంధం మరింత బలోపేతమైందని వ్యాఖ్యానించింది. కొవిడ్-19పై ఇండియా చేస్తున్న పోరాటానికి అమెరికా తనవంతు సహకారాన్ని అందిస్తుందని, మరిన్ని ప్రత్యేక విమానాల్లో కరోనాను నియంత్రించే షిప్ మెంట్స్ రానున్నాయని వెల్లడించింది.
కాగా, ఈ వారం ప్రారంభంలో అమెరికాకు మద్దతుగా నిలుస్తామని అధ్యక్షుడు జో బైడెన్ వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. కరోనా ప్రారంభదశలో తమ దేశంలోని ఆసుపత్రుల్లో మౌలిక వసతులు తక్కువగా ఉన్న సమయంలో ఇండియా ఆదుకుందని గుర్తు చేసుకున్న ఆయన, ఇప్పుడు వారికి తాము సహాయం చేస్తామని స్పష్టం చేశారు. కోవిడ్ తో పోరాడేందుకు అవసరమైన అత్యవసర పరికరాలు, ఇతర సాయంలో అవసరమైన తొలివిడత షిప్ మెంట్ భారత్ కు చేరింది. భారత్-అమెరికాలు కోవిడ్ పై ఉమ్మడిగా పోరాడతాయి అని పేర్కొంది. దీనికి #USIndiaDosti అనే హ్యాష్ ట్యాగ్ ఇచ్చింది.