కేంద్రం ప్రవేశపెట్టిన నూతన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా దేశ రాజధానిలో రైతులు చేపట్టిన ఆందోళనలు కొనసాగుతున్నాయి. తాజాగా కేంద్రప్రభుత్వం చేసిన ప్రతిపాదనలను రైతు సంఘాల ప్రతినిధులు తిరస్కరించారు. కొత్త చట్టాలను రద్దు చేయడం తప్ప వేరే ప్రత్యామ్నాయం వద్దని రైతు సంఘాల ప్రతినిధులు తేల్చిచెప్పారు. కేంద్రం ప్రతిపాదనలు తిరస్కరించిన రైతు సంఘాలు భవిష్యత్ కార్యాచరణ ప్రకటించాయి. ఈ నెల 12న దేశ వ్యాప్తంగా టోల్‌ప్లాజాల దగ్గర ఆందోళనకు పిలుపునిచ్చారు. 12న ఆగ్రా-ఢిల్లీ జాతీయ రహదారిని దిగ్బంధిస్తామని.. 14న ఢిల్లీలో భారీ ప్రదర్శన ఉంటుందని చెప్పారు. జియో ఉత్పత్తులను, ఆదానీ, అంబానీల పెట్రోలియం ఉత్పత్తులు, ఇతర ఉత్పత్తులను బహిష్కరిస్తామన్నారు. బీజేపీ ఎంపీలు, కేంద్రమంత్రులు, ఎమ్మెల్యేలను ఘెరావ్ చేస్తామని చెప్పారు.