నూతన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతుల ఆందోళనలు కొనసాగుతున్నాయి. మీరు మీ ఆందోళనలను బురారీ ప్రాంతానికి మార్చండి ప్రభుత్వం వెంటనే మీతో చర్చలు జరుపుతుందన్న కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఆఫర్‌ను పంజాబ్‌కు చెందిన 30 రైతు సంఘాలు తిరస్కరించాయి. వరుసగా నాలుగో రోజు కూడా కేంద్రం తీసుకొచ్చిన కొత్త వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతులు ఆందోళన నిర్వహిస్తున్నారు. సింఘు, టిక్రీ ప్రాంతాల్లో రైతులు నిరసన తెలుపుతున్నారు.
ఇటు రైతుల ఆందోళనతో ఢిల్లీకి వచ్చే చాలా దారులు మూసుకుపోవడంతో కేంద్ర హోంమంత్రి అమిత్ షా రైతుల ఆందోళనలను బురారీ ప్రాంతానికి మార్చాలన్నారు. అలా చేస్తే మరుసటి రోజే మీతో చర్చలు జరుపుతామని షా స్పష్టం చేశారు. డిసెంబర్ 3న ప్రభుత్వంతో చర్చల కోసం ఇప్పటికే కొన్ని సంఘాల నేతలను ఆహ్వానించినట్లు కూడా అమిత్ షా తెలిపారు. దీనిపై ఇవాళ ఉదయం నుంచి సమాలోచనలను జరిపిన రైతు సంఘాల నేతలు చివరికి ఆ ఆఫర్‌కు నో చెప్పారు. దీంతో రైతుల ఆందోలనలు యధావిధిగా కొనసాగుతున్నాయి.