16 రోజులైంది.. ఐదుసార్లు చర్చలు జరిగాయి... అయినా ఫలితం లేదు. మొదటిరోజు నుంచి ఇప్పటివరకు ప్రతిష్టంభన కొనసాగుతూనే ఉంది. ఎముకలు కొరికే చలిని కూడా లెక్కచేయకుండా ఢిల్లీలో రైతులు ఆందోళనలు కొనసాగిస్తున్నారు. కొత్త చట్టాలు రద్దు చేసి తీరాల్సిందేనని పట్టిన పట్టు వీడడం లేదు. దీంతో హస్తిన రణరంగాన్ని తలపిస్తోందిప్పుడు. ఇక అటు ఢిల్లీ సరిహద్దుల్లో అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు భారీ బందోబస్తు కొనసాగుతోంది.
వ్యవసాయ చట్టాలను రద్దు చేయడం కుదరదని తేల్చిచెప్పిన కేంద్రం చట్టాల్లో కొన్ని సవరణలు చేస్తామంటూ రైతులకు ప్రతిపాదనలు పంపింది. అయితే ఈ ప్రతిపాదనలను అన్నదాతలు తిరస్కరించారు. ఇవన్నీ పాత వివరణలేనని, ఇవేవీ తమకు ఆమోదయోగ్యం కావని స్పష్టంచేశారు. మద్దతు ధరకు చట్టబద్ధత ఎందుకు కల్పించలేదని కేంద్రాన్ని ప్రశ్నించారు. ఇక అటు తమ ఉద్యమాన్ని దేశవ్యాప్తం చేయాలని రైతు సంఘాలు నిర్ణయించాయి. ఈ నెల 12న ఢిల్లీ-జైపూర్ సరిహద్దులో ఉద్యమం చేస్తామని రైతులు వెల్లడించారు. 14న తాడోపేడో తేల్చుకునేందుకు సిద్ధమయ్యారు. ఆరోజు దేశవ్యాప్తంగా అన్ని జిల్లా కేంద్రాల్లో నిరవధిక ధర్నాలు చేపట్టనున్నట్లు ప్రకటించారు.
కొత్త వ్యవసాయ చట్టాలను వెనక్కి తీసుకునే ప్రసక్తే లేదని కేంద్రం అంటోంది. రైతుసంఘాలతో చర్చలు జరపడానికి తాము సిద్ధంగా ఉన్నామని చట్టాలనే రద్దు చేయాలనడం సరికాదని కేంద్రమంత్రి నరేంద్రసింగ్ తోమర్ అన్నారు. సవరణలు చేయడానికి సిద్ధంగా ఉన్నామని రైతుల నుంచి సలహాలు, సూచనలు ఆహ్వానిస్తామని చెప్పారు. కొత్త వ్యవసాయ చట్టాల వల్ల రైతులకు ఎలాంటి నష్టం ఉండదని చెప్పారు.