Coronavirus: భారత్ లో మరిన్ని కరోనా టెస్టులు నిర్వహించాలంటున్న విశ్లేషకులు

Update: 2020-04-28 09:51 GMT

భారత్‌లో లాక్‌డౌన్‌ మంచి ఫలితాలిస్తుంది. ముందస్తు లాక్‌డౌన్‌తో వైరస్‌ వ్యాప్తిని అడ్డుకోగలిగింది ప్రభుత్వం. అయినా ప్రభుత్వం ప్రజలు అప్రమత్తంగానే ఉండాలంటున్నారు నిపుణులు. సాధారణ పరిస్థితులు వచ్చే వరకు ఏ మాత్రం ఏమరపాటు చూపినా తీవ్ర నష్టాలు చవిచూడాల్సి వస్తోందని హెచ్చరిస్తున్నారు.

భారత్‌లో కరోనా నిర్ధారిత పరీక్షలు తక్కువగా జరుగుతున్నాయి. సిబ్బందితో పాటు కిట్ల కొరత అధిక జనాభానే ఇందుకు కారణమవుతున్నాయి. ఏప్రిల్ 27 వరకు మన దేశంలో ఆరు లక్షల కరోనా టెస్టులు చేయగా ప్రతీ పది లక్షల మందిలో 482 మందికి మాత్రమే పరీక్షలు నిర్వహించగలిగారు. సింగపూర్, వియత్నాం, సౌత్ కొరియాలో ప్రతీ పది లక్షల మందిలో వేలమందికి పరీక్షలు చేయగలిగారు. ఇండియాలో కూడా ఇలా భారీ స్థాయిన టెస్టులు జరపాలంటున్నారు విశ్లేషకులు. వీలైనంత ఎక్కువ టెస్టులు చేయాలని సూచిస్తున్నారు.

టెస్టులు, జాగ్రత్తల విషయంలో నిర్లక్ష‌‌్యం వహించటంతో అమెరికా, ఫ్రాన్స్‌ దేశాల్లో అధిక కరోనా మరణాలు సంభవించినట్లు చెబుతున్నారు విశ్లేషకులు. యూరప్‌లో ఇరుగుపొరుగు దేశాలైన జర్మనీ, ఫ్రాన్స్‌లలో ఏప్రిల్‌ 27 నాటికి నమోదైన కొవిడ్‌ 19 కేసులు దాదాపు సమానంగా ఉన్నాయి. అయితే ఫ్రాన్స్‌లో 22 వేల 5వందలకు పైగా బాధితులు చనిపోతే జర్మనీలో ఆ సంఖ్య ఆరు వేలు కూడా దాటలేదు. దీనికి జర్మనీలో తీసుకున్న ముందస్తు చర్యలే కారణం. ఏప్రిల్‌ 27 వరకు జర్మనీ 20,72,669 కరోనా పరీక్షలు నిర్వహించగా ఫ్రాన్స్‌లో జరిగిన పరీక్షలు 4,63,662 మాత్రమే నిర్వహించటమే అందుకు కారణమంటున్నారు నిపుణులు. అమెరికాలో అత్యధికంగా 54 లక్షల 70వేలకు పైగా టెస్టులు చేసినా ఆలస్యంగా టెస్టులు మొదలుపెట్టడంతో మరణాలు పెరిగాయంటున్నారు.

ఇక ఏప్రిల్‌ 27 నాటికి ప్రపంచంలో ప్రతి 10 లక్షల జనాభాలో 386 మందికి కరోనా సోకగా, భారత్‌లో కేవలం 20 మందికి సోకిందని అమెరికాలోని జాన్‌హాప్కిన్స్‌ యూనివర్శిటీ తెలిపింది. ప్రపంచంలో ప్రతి 10 లక్షల జనాభాలో ఈ వ్యాధి వల్ల మరణిస్తున్నవారు సగటున 26.6 మంది ఉండగా భారత్‌లో మరణాల రేటు కేవలం 0.6 గా నమోదైంది. అయితే భారత్‌లో పరీక్షలు తక్కువగా జరుగుతుండటంతో వాస్తవ పరిస్థితిని అంచనా వేయలేకపోతున్నారని విమర్శకులు అంటున్నారు.

అయితే భారత్‌లో ప్రస్తుతం పూల్‌ టెస్టులు చేస్తున్నారు. జర్మనీ కూడా పూల్‌ పద్ధతిలో మంచి ఫలితాలనే సాధించింది. దీంతో ఇండియాలో టెస్టులను పెంచేందుకు మే నెల నుంచి 10 లక్షల ఆర్‌టీ-పీసీఆర్‌ కిట్లను, మరో 10 లక్షల ర్యాపిడ్‌ యాంటీబాడీ కిట్లను స్వదేశంలోనే తయారు చేయాలని భావిస్తోంది. దేశంలో ఇప్పటివరకు వాడిన చైనా కిట్లు సరైన ఫలితాలివ్వకపోవటంతో ఐరోపా,దక్షిణ కొరియాకు చెందిన కంపెనీల నుంచి 10 లక్షల ఆర్‌టీ-పీసీఆర్‌ టెస్టింగ్‌ కిట్లను కొనుగోలు చేస్తోంది.

ఇక సొంత పరిజ్ఞానంతో టెస్టింగ్‌ కిట్లను తయారుచేస్తున్న మైల్యాబ్‌, మెడ్‌ సోర్స్‌ ఓజోన్‌, మోల్‌ బయో, కిల్‌ పెస్ట్‌ ఇండియా వంటి స్వదేశీ కంపెనీలకూ కిట్ల కోసం ఆర్డరు చేసింది. మొత్తం మీద 33 లక్షల ఆర్‌టీ పీసీఆర్‌ టెస్టింగ్‌ కిట్లు చేతికి అందనున్నాయని, మరో 33 లక్షల ర్యాపిడ్‌ యాంటీబాడీ టెస్ట్‌ కిట్లకు ఆర్డరు చేశామని భారత వైద్య పరిశోధన మండలి ప్రతినిధి వెల్లడించారు. ప్రస్తుతం దేశంలో నెలకు 6 వేల వెంటిలేటర్లు తయారవుతున్నాయి. ఈ నెల 17 వరకు దేశంలో 1,919 ఆస్పత్రులను కొవిడ్‌ చికిత్సకు కేటాయించారు. లక్షా 73 వేలకు పైగా ఐసోలేషన్‌ పడకలు, 21 వేల 806 ఐసీయూ పడకలను అందుబాటులో ఉంచారు. అయితే కరోనాకు వేక్సిన్ కనుగోనే వరకు దేశంలో టెస్టులతో పాటు చికిత్స సౌకర్యాలను పెంచాలని సూచిస్తున్నారు విశ్లేషకులు.

Tags:    

Similar News