ఢిల్లీలో నరేంద్రుడికి మళ్లీ ఛాన్సిచ్చారు. మహారాష్ట్రంలో దేవేంద్రుడిని వన్స్‌మోర్ అన్నారు. దేవేంద్ర జాలానికి, నరేంద్రజాలం తోడైన ఫలితమే మరాఠా గడ్డలో అపూర్వ విజయమా....?మహారాష్ట్రలో మళ్లీ కమలమే ఎలా వికసించింది...ఫడణవిస్‌ను జనం సెకండ్ టైమ్ ఎందుకు ఛాన్సివ్వాలని డిసైడయ్యారు...కమలం-సేన కూటమికి ఇంకోసారి పట్టంకట్టడానికి కారణాలేంటి? బీజేపీ-శివసేన విజయానికి ఐదు కారణాలున్నాయి.?
బీజేపీ సర్కారును కరవు కాటేస్తుందని కాంగ్రెస్ ప్రచారం చేసింది. నీటి కటకట కాషాయ ప్రభుత్వాన్ని వేటాడటం ఖాయమని తిట్టిపోశాయి. ముంబై స్టాక్ మార్కెట్ సాక్షిగా ఆర్థికమాంద్యం ఉసురు కమలానికి తగులుతుందని ప్రతిపక్షాలు శాపనార్థాలు పెట్టాయి. కానీ ఇవేమీ బీజేపీని మళ్లీ గెలిపించి తీరాల్సిందేనని, ఆల్రెడీ డిసైడైన ఓటర్ల మైండ్‌సెట్‌ను ఏమాత్రం మార్చలేకపోయాయని, ఎగ్జిట్‌పోల్స్ అంచనాలను బట్టి అర్థమవుతోంది.
1. వన్ అండ్ ఓన్లీ దేవేంద్ర ఫడణవిస్
యువకుడు, అంతగా అనుభవం లేదు, పాలనేం చేస్తాడులే అని కాంగ్రెస్ సహా చాలామంది ఐదేళ్ల క్రితం, చాలా తక్కువ అంచనా వేశారు ఫడణవిస్‌ను. శివసేన పోరు పడలేక మధ్యలోనే పారిపోతాడని లెక్కకట్టారు. కానీ వారి అంచనాలన్నీ తలకిందులు చేశాడు దేవేంద్రుడు. కొన్ని రాష్ట్రాల్లో ప్రాంతీయ పార్టీల అధినేతల మాదిరి, జనంలో బలమైన ముద్ర వేశాడు. కాంగ్రెస్ హయాంలో అవినీతిని చూసిచూసి విసిగిపోయిన జనాలకు, ఒక్క అవినీతి మరకా అంటని దేవేంద్రుడు దేవుడిలా అనిపించాడు. సమస్య ఏదైనా ఓర్పుగా, నేర్పుగా పరిష్కరించిన యంగ్ ఎకనమిస్ట్‌ను అద్భుతంగా భావించారు. పడగొడతాం, చెడగొడతాం అంటూ విర్రవీగిన శివసేనను, పాము చావకుండా, కర్రవిరగకుండా దారిలోకి తెచ్చిన ఫడణవిస్ చాణక్యాన్ని మెచ్చుకున్నారు. అందుకే మళ్లీ దేవేంద్రుడే కావాలని ఓట్లేశారని తెలుస్తోంది.
2. మరాఠా రిజర్వేషన్లు
అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీకి మ్యాజిక్‌లా పని చేసింది మరాఠా రిజర్వేషన్లు. అత్యంత సాహసోపేత నిర్ణయం తీసుకున్నారు సీఎం ఫడణవిస్. జనాభాలో దాదాపు 30 శాతం వున్న మరాఠాలకు రిజర్వేషన్లు కల్పిస్తూ చారిత్రాత్మక నిర్ఱయం తీసుకున్నారు. దీంతో మరాఠా ఓట్లలో అత్యధికం బీజేపీకే పడ్డాయి. మరాఠా కాంగ్రెస్ పార్టీగా చెప్పుకునే, ఎన్సీపీని సైతం పక్కనపెట్టి బీజేపీకి సై అన్నారు మరాఠాలు. ఢిల్లీ హైకమాండ్‌ను సైతం ఒప్పించి, మరాఠాలకు రిజర్వేషన్ ఇప్పించి, మెప్పించారు. ఆ డేరింగ్ డాషింగ్ డెసిషన్, ఎన్నికల ఫలితాల రూపంలో ఫడణవీస్‌కు వీరమాల వేసిందని రాజకీయ పండితుల విశ్లేషణ. అంతేకాదు, పేదలు, దళితుల ఓట్లు తమ ఓటు బ్యాంకేనని భావించిన కాంగ్రెస్ అంచనాలను కుళ్లబొడిచాయి బీజేపీ, శివసేన. ఒకవైపు జాతీయవాదం, హిందూత్వకు సోషల్ ఇంజినీరింగ్‌ను యాడ్ చేసి, మరోసారి మరాఠా పీఠంపై కూర్చుంది కమలం.
3. దేవేంద్రజాలానికి తోడైన నరేంద్రజాలం
పార్లమెంట్ ఎన్నికల్లో అపూర్వ విజయంతో ఊపుమీదున్న నరేంద్ర మోడీ మాయాజాలం, మహారాష్ట్రలోనూ పాకిందని ఎగ్జిట్ ఫలితాలు చెబుతున్నాయి. ఆర్థిక రాజధాని మరింతగా దూసుకుపోవాలంటే, ఢిల్లీలో చెక్కుచెదరని నరేంద్ర మోడీ వున్నప్పుడు, ఇక్కడా దేవేంద్ర ఫడణవిస్ వుండాలని జనం ఫిక్సయినట్టున్నారు. తాగునీటి కటకట, కరవు పరిష్కారమవ్వాలన్న, మరాఠా రిజర్వేషన్లకు ఎలాంటి ఇబ్బందిలేకుండా సాగాలంటే, మళ్లీ బీజేపీనే రావాలని అనుకున్నారు. దీనికితోడు పీఎం కిసాన్ యోజన కూడా ఓట్ల వర్షం కురిపించిందని విశ్లేషకుల అభిప్రాయం.
4. అమిత్ షా పోల్ మేనేజ్‌మెంట్
అమిత్ షా ఇక్కడ కూడా తన పోల్‌మేనేజ్‌మెంట్‌ను పక్కాగా అమలయ్యేట్టు చూసుకున్నారు. ఎన్నికల సమయంలో అన్ని అంశాలు పక్కకుపోయేలా సావర్కర్ ఇష్యూను తెరపైకి తెచ్చారు. సావర్కర్ వ్యతిరేకులు, సావర్కర్ అనుకూలురు అన్నట్టుగా ఓటర్లలో విభజన తెచ్చారు. దీంతో హిందూత్వ ఓట్లను సమీకరించడంలో సక్సెస్ అయ్యారు. అంతర్జాతీయ వేదికల మీద పాకిస్తాన్‌ను ఒంటరిని చేశామని చెప్పుకున్న అమిత్ షా, కాంగ్రెస్ మాత్రం పాకిస్తాన్ లైన్‌లో మాట్లాడుతోందని చెప్పడం ద్వారా, ఓటర్లలో స్పష్టమైన విభజన గీత గీశారు. అంతేకాదు, మరాఠా కాంగ్రెస్ నేతలు, ఎన్సీపీ నేతల కుంభకోణాలను వెలికితీయించి, సరిగ్గా ఎన్నికల టైంలో వ్యూహాత్మకంగా చర్చకు పెట్టారు. అటు మొన్నటి వరకు గర్జించిన శివసేనను కూడా దారిలోకి తేవడంలో సూత్రధారి అమిత్ షానే.
5. కాంగ్రెస్-ఎన్సీపీ మీద నమ్మకం కోల్పోయిన జనం
పార్లమెంట్ ఎన్నికల్లో ఘోరాతి ఘోరంగా ఓడిన కాంగ్రెస్‌ను, మహారాష్ట్ర ప్రజలు కూడా తిరస్కరించినట్టు తీర్పిచ్చారని ఎగ్జిట్‌పోల్స్ చెబుతున్నాయి. రాహుల్ గాంధీ అధ్యక్ష పీఠం దిగినా, సోనియా అధిరోహించినా, కాంగ్రెస్‌పై ఏమాత్రం సానుభూతి చూపలేదని తెలుస్తోంది. ఎన్సీపీతో మళ్లీ పొత్తు పెట్టుకున్నా కాంగ్రెస్‌ను చేరదీయలేదు.