బీహార్ సీఎంను కలిసిన మాజీ డిజిపి గుప్తేశ్వర్ పాండే
ఇటీవల పదవీ విరమణ చేసిన బీహార్ మాజీ డిజిపి గుప్తేశ్వర్ పాండే శనివారం మధ్యాహ్నం బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్‌ను కలిశారు. భేటీ అనంతరం బయటకు వచ్చి మీడియాతో..
ఇటీవల పదవీ విరమణ చేసిన బీహార్ మాజీ డిజిపి గుప్తేశ్వర్ పాండే శనివారం మధ్యాహ్నం బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్‌ను కలిశారు. భేటీ అనంతరం బయటకు వచ్చి మీడియాతో మాట్లాడిన గుప్తేశ్వర్.. తాను సీఎంతో రాజకీయాలు మాట్లాడలేదని.. మర్యాదపూర్వకంగానే కలిశానని అన్నారు.. డిజిపిగా విధులను నిర్వర్తించడానికి సంపూర్ణ స్వేచ్ఛ ఇచ్చినందున సీఎంకు కృతజ్ఞతలు తెలిపానన్నారు. అయితే గుప్తేశ్వర్ పాండే పైకి ఇలా చెబుతున్నప్పటికీ ఆయన జేడీయూలో చేరే అంశంపైనే చర్చించడానికి సీఎంను కలిశారన్న ప్రచారం జరుగుతోంది. తన సొంత జిల్లా అయిన బక్సర్ లో ఏదో ఒక నియోజకవర్గం నుంచి అసెంబ్లీకి పోటీ చెయ్యాలని ఆయన భావిస్తున్నారు. ఇందులో భాగంగా అసెంబ్లీ టిక్కెట్ గురించి చర్చ జరిగి ఉంటుందని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు.
కాగా గత వారం, మాజీ డిజిపి గుప్తేశ్వర్ పాండే పోలీస్ సేవల నుండి స్వచ్ఛంద పదవీ విరమణ ప్రకటించారు, దాంతో రాబోయే బీహార్ అసెంబ్లీ ఎన్నికలలో పోటీ చేయడానికె డీజీపీ విధుల నుంచి తప్పుకున్నారని వార్తలు వచ్చాయి. ఆ తరువాత ఈ వార్తలను ఖండించిన పాండే.. త్వరలో తాను రాజకీయాల్లో చేరుతానని.. కచ్చితంగా పోటీ చేస్తానని ప్రకటించారు. దాంతో అప్పటినుంచి ఆయన ఏ పార్టీలో చేరుతారా అనే చర్చ ఊపందుకుంది. తాజాగా జేడీయూ అధినేత, బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ తో భేటీ అవ్వడం చర్చనీయాంశంగా మారింది. కాగా బీహార్ అసెంబ్లీ ఎన్నికలు అక్టోబర్ 28 నుండి నవంబర్ 3 మరియు నవంబర్ 7 న మూడు దశల్లో జరుగుతాయని ఎన్నికల కమిషన్ తెలిపింది. ఓట్ల లెక్కింపు నవంబర్ 10 న జరుగుతుందని శుక్రవారం వెల్లడించింది.