గోదావరి బోర్డు మీటింగ్‌లో కీలక అంశాలపై చర్చ
*ఇరురాష్ట్రాల అభ్యంతరాలపై ప్రధాన చర్చ
Hyderabad: తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు గోదావరిలో ఉన్న నీటి లభ్యతపై అధ్యయనం చేయించాలని GRMB నిర్ణయించింది. ఇందుకు CWCకి ప్రతిపాదనలు పంపించనుంది. గోదావరి బోర్డు చైర్మన్ సిన్హా అధ్యక్షతన హైదరాబాద్ జలసౌధలో జరిగిన గోదావరి బోర్డు సమావేశంలో ఈ మేరకు పలు నిర్ణయాలు తీసుకుంది. తెలంగాణ రాష్ట్ర నీటిపారుదల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రజత్‌కుమార్, ENC మురళీధర్, ఏపీ రాష్ట్ర జలవనరుల శాఖ ENC సి.నారాయణ రెడ్డి, ఇతర అధికారులు ఈ సమావేశంలో పాల్గొని తమ రాష్ట్రాల తరఫున వాదనలు వినిపించారు. CWC డైరెక్టర్ నిత్యానంద రాయ్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పాల్గొన్నారు.
తెలంగాణకు చెందిన గూడెం, మొడికుంటవాగు ఎత్తిపోతల పథకాల DPRలపై రెండు రాష్ట్రాల అభిప్రాయాలు నమోదు చేసింది. తెలంగాణ కొత్త ప్రాజెక్టులపై తమ అభ్యంతరాలను కేంద్ర జలసంఘం కనీసం పట్టించుకోవడం లేదని ఏపీ ఆరోపించింది. అనుమతుల అంశాన్ని ఏళ్ల తరబడి నాన్చడం వల్ల ప్రాజెక్టు వ్యయం భారీగా పెరుగుతోందని, సమయం వృధా అవుతోందని తెలంగాణ పేర్కొంది. మొదటి దశలో అంతర్ రాష్ట్ర సరిహద్దులోని ఐదు పాయింట్ల వద్ద టెలిమెట్రీ ఏర్పాటు చేయాలని గోదావరి బోర్డు సమావేశం నిర్ణయించింది.
మొడికుంటవాగు - గూడెం ఎత్తిపోతల DPRలపై చర్చించామని తెలంగాణ నీటిపారుదల శాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ రజత్ కుమార్ వెల్లడించారు. పాలమూరు- రంగారెడ్డి మీద NGT తీర్పుపై స్పెషల్ లీవ్ పిటిషన్ వేయాలని నిర్ణయించామన్నారు.
మరోవైపు గోదావరిలో రాష్ట్రాల వాటా ఎంతో తేల్చాలని అడిగామన్నారు ఏపీ ఈఎన్సీ నారాయణరెడ్డి. సీడబ్ల్యూసీతో శాస్త్రీయ అధ్యయనం చేయాలని బోర్డు నిర్ణయించిందన్నారు. తెలంగాణ ప్రాజెక్టులపై ఎన్నిసార్లు అభ్యంతరం చెప్పినప్పటికీ సాధారణ న్యాయం కూడా జరగడం లేదన్నారు. నీటి లభ్యత ఉండగా గూడెంలో అదనపు ఎత్తిపోతలు ఎందుకని ప్రశ్నించారు ఏపీ ఈఎన్సీ నారాయణరెడ్డి.