Delhi Mayor Election: ఢిల్లీ మేయర్ ఎన్నికకు ముహూర్తం ఖరారు
Delhi Mayor Election: ఈనెల 22న ఢిల్లీ మేయర్ ఎన్నికను నిర్వహించాలి
Delhi Mayor Election: ఢిల్లీ మేయర్ ఎన్నికను ఈనెల 22న నిర్వహించాలని లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనాను సీఎం అరవింద్ కేజ్రీవాల్ కోరారు. నామినేటెడ్ సభ్యులకు ఓటు హక్కు ఉండదని సుప్రీంకోర్టు స్పష్టం చేస్తూ శుక్రవారం కీలక తీర్పునిచ్చింది. దీంతో ఢిల్లీ మేయర్ ఎన్నికను ఈనెల 22న నిర్వహించాలంటూ ఎల్జీ సక్సేనాకు సీఎం కేజ్రీవాల్ సిఫార్సు చేశారు. ఢిల్లీ మేయర్ ఎన్నికపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును ప్రజాస్వామ్య విజయంగా కేజ్రీవాల్ అభివర్ణించారు. రెండున్నర నెలల తర్వాత ఢిల్లీకి మేయర్ రానున్నారని కేజ్రీవాల్ ట్విట్టర్ ద్వారా తెలిపారు.
ఢిల్లీలో ఎల్జీ, బీజేపీ నిత్యం చట్టవిరుద్దమైన, రాజ్యాంగ విరుద్దమైన ఉత్తర్వులు జారీ చేస్తున్నాయన్న విషయం కోర్టులో రుజువైందని కేజ్రీవాల్ అభిప్రాయం వ్యక్తం చేశారు. ఢిల్లీ ప్రభుత్వం తన అభిప్రాయాలను సుప్రీంకోర్టు ముందు సమర్పించకుండా నిరోధించడానికి లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనా చాలా ప్రయత్నించారని సీఎం అరవింద్ కేజ్రీవాల్ ఆరోపించారు. న్యాయ నిర్వహణలో ఆయన జోక్యం చేసుకోవడంపై మండిపడ్డారు. తన న్యాయవాదిని కేసులో ఇరువైపులా వాదించేలా చేశారని విమర్శించారు.