ఒకవైపు కరోనా... మరోవైపు భూకంపం.. అసలు ఏమైంది మన దేశ రాజధానికి?

Update: 2020-06-06 01:56 GMT

కాళ్లకింద నేల కదులుతోంది. భూమి పొరల్లో ఏదో జరుగుతోంది. అప్పుడెప్పుడో ఇండోనేషియా, అంతకుముందు నేపాల్, ఆ తర్వాత మెక్సికో ఇప్పుడు దేశ రాజధాని ఢిల్లీలో భూకంపం. ఇలా సంభవిస్తున్న భూకంపాలు, కంటిమీద కనుకు లేకుండా చేస్తున్నాయి. రోదసీలోని ఉపగ్రహాలను సైతం భూమి మీద నుంచి కంట్రోల్ చేస్తున్న ఆధునిక మనిషి, భూమిలోపలి పొరల్లో జరుగుతున్న అలజడిని పసిగట్టలేకపోతున్నాడు. ఇంకా చెప్పాలంటే హస్తినలో ఇప్పటికే కరోనా కలకలం రేపుతుంటే తాజాగా భూకంపం వెన్నులో వణుకుపుట్టిస్తోంది. ఇంతకీ హస్తినకు ఏమైంది.? రాజధాని వీధుల్లో ఈ అలజడి ఏంటి?

దేశ రాజధానిని వణికిస్తున్న భూకంపాలు భవిష్యత్‌ భారతానికి వెన్నులో వణుకుపుట్టిస్తోంది. ఇదంతా దేనికి సంకేతమో అనే ఆందోళనలో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. ఢిల్లీ నడిబొడ్డు నుంచి కేవలం 19 కిలోమీటర్ల దూరంలోనే భూకంప కేంద్రం నమోదు అవడం, నెలన్నర సమయంలో వరసగా 10 భూకంపాలు నమోదు కావడం కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది.

ఒకవైపు కరోనా... మరోవైపు భూకంపం. ఇప్పటికే అల్లాడుతోంది... ఇప్పుడు భయపడుతోంది. ఏదైనా ప్రాణభయమే... భవిష‌్యత్‌ భయానకమే. అసలు ఏమైంది మన దేశ రాజధానికి? కోలుకుంటున్న సమయంలోనే కోలుకోలేని దెబ్బా ఇది?

దేశ రాజధానిని భూకంపాల భయం వెంటాడుతోంది. భవిష్యత్‌లో ఎక్కువ తీవ్రతగల భూకంపం సంభవించే అవకాశం ఉందని జియాలజిస్టుల హెచ్చరికలు రాజధాని ప్రజలకు కంటి మీద కునుకు లేకుండా చేస్తోది. మొన్నీ మధ్య సంభవించిన భూకంప కేంద్రం ఎక్కడ ఉండవచ్చు అతి తీవ్రత గల భూకంపం ఎప్పుడు సంభవిస్తుందో ఆ సమయాన్ని కచ్చితంగా చెప్పలేకున్నా ప్రమాదం మాత్రం పొంచి ఉందన్న సంకేతాలు మాత్రం ఉన్నాయ్‌.

జియాలజిస్టుల లెక్క ప్రకారం దేశరాజధాని సెసిమిక్ జోన్-4లో ఉంది. దీని ప్రభావం భవిష్యత్‌‌లో చూపెట్టడం ఖాయం. రానున్న రోజుల్లో రిక్టర్‌ స్కేల్‌పై 5 నుంచి 6 తీవ్రతతో కొన్ని కొన్నిసార్లు రిక్టర్‌ స్కేల్‌పై 7 నుంచి 8 తీవ్రతతో భూకం రావచ్చని ప్రముఖ జియాలజిస్టు డాక్టర్‌ కాల్చంద్‌ స్పెయిన్‌ చెబుతున్నారు. దేశ రాజధానిలో ఉన్న పలు ప్రైవేట్ భవనాలు లేదా నిర్మాణంలో ఉన్న భవనాలు భూకంపాలను తట్టుకునేలా బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్స్ ప్రమాణాలను పాటించడం లేదని శాస్త్రవేత్తలు ఆందోళన చెందుతున్నారు.

దేశ రాజధాని హిమాలయ పర్వత ప్రాంతానికి దగ్గరలోనే ఉండటం వల్ల 2015లో నేపాల్‌లో సంభవించిన విధంగా 7 కంటే ఎక్కువ తీవ్రత గల భూకంపాలు సంభవించేందుకు అవకాశం ఉందని భూగర్భ శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. హిమాలయ పర్వత ప్రాంతంలో సంభవించే భూకంపాల వల్ల తీవ్ర ప్రభావం ఉన్నప్పుడు, నేరుగా భూకంప కేంద్రం ఢిల్లీ చుట్టుపక్కలనే కేంద్రీకృతం అవుతుంది. దక్షిణ ఢిల్లీ, సెంట్రల్ ఢిల్లీ కంటే యమునానది పరివాహక ప్రాంతంలో ఉన్న ఏరియాలలో భూకంప ప్రభావం ఎక్కువగా ఉండవచ్చని ఇండియన్ మెటర్లాజికల్ డిపార్టుమెంట్ హెచ్చరించారు. ఢిల్లీలో చేపట్టే భవన నిర్మాణానికి కొత్త నిబంధనలు రూపొందించాలని, తీవ్రత ఎక్కువగల భూకంపాలు సంభవిస్తే ప్రజల ప్రాణాలను రక్షించడానికి కొత్త సేప్టీ నిబంధనలు పాటించాలని సూచించారు. ఈ మధ్య కాలంలో ఢిల్లీ, దాని పరిసర ప్రాంతాలలో భూమి పొరలలో తీవ్రమైన మార్పులు సంభవిస్తున్నాయని, ఇది జాగ్రత్తగా ఉండమనే హెచ్చరికగా వారు చెబుతున్నారు.

ఇంతకీ భూకంపాలు నేర్పుతున్న పాఠమేంటి విసురుతున్న సవాళ్లేంటి? ప్రపంచాన్ని జయిస్తున్న మనిషి ప్రకృతి ఎదుట ఓడిపోతున్నాడు. భూకంపాలను కనీసం పసిగట్టలేకపోతున్నాడు. అసలు భూకంపాలు ఎందుకొస్తాయి? నేలతల్లి కడుపుకోతకు మానవ తప్పిదాలేంటి? అమెరికా ఖండంతో పోలిస్తే మన భారతదేశం ఎంతవరకు సేఫ్‌.? ఒకసారి చూద్దాం.

నేలతల్లికి ఏదో అవుతోందని, చాలాకాలం నుంచి పర్యావరణవేత్తలు అనుమానిస్తున్నారు. ప్రకృతిని వికృతి చేస్తున్న అభివృద్ది నమూనాలను పరిశీలించుకోకపోతే, వరదలు, అధిక ఉష్ణోగ్రతలు, కరవులు కాటకాలే కాదు, మహా భూకంపాలు విరుచుకుపడతాయని హెచ్చరిస్తున్నారు. భూకంప క్రియాశీల ప్రక్రియలోకి భూమి చేరుకుందన్న అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. అసలు భూకంపాలు ఎందుకొస్తాయి పశుపక్ష్యాదులు పసిగడుతున్నా, మనమెందుకు అంచనా వేయలేకపోతున్నాం. దీనికి మాత్రం కచ్చితమైన సమాధానం ఎవరూ చెప్పడం లేదు.

ప్రకృతి వైపరిత్యాలతో పోలిస్తే, భూకంపాల అజలడే వేరు. మిగతావన్నీ, ఏదో మేరకు సూచనలందిస్తాయి. అప్రమత్తం కావడానికి కనీసం ఎంతోకొంత టైమ్‌నిస్తాయి. భూకంపాలు అలాకాదు. సడన్‌గా విరుచుకుపడతాయి. లిప్తపాటులో సర్వనాశనం చేస్తాయి. శిథిలాలను మిగులుస్తాయి. సజీవ సమాధి చేస్తాయి. లిప్తపాటులో సర్వనాశనం చేసే భూకంపాలు ప్రపంచాన్ని ఇప్పటికే ఓ కుదుపు కుదిపేశాయ్‌ కూడా.

వాస్తవానికి భూమిపొరల్లో అనుక్షణం ఎన్నో మార్పులు జరుగుతుంటాయ్‌. వాటి పర్యవసాసనంగా ప్రకంపనలు సంభవిస్తూనే ఉంటాయి. వీటిల్లో వచ్చే కదలికలు, ఆ కదలికలు తెచ్చే రాపిడితో ఆకస్మికంగా శక్తి విడుదలై, తరంగాల రూపంలో ప్రయాణించి, భూ ఉపరితలానికి చేరుతుంది. అలా చేరినప్పుడు మాత్రమే భూ ప్రకంపనలు మన అనుభవంలోకి వస్తాయి. ఆ ప్రకంపనల తీవ్రత ఏమేరకు పెరిగితే, నష్ట తీవ్రత కూడా అదే రేంజ్‌లో ఉంటుంది.

గతంలో సంభవించిన భూకంపాల విస్తరణ ఆధారంగా ప్రపంచవ్యాప్తంగా భూంకపాలను రెండు భౌగోళిక మేఖలలుగా విభజించారు. మొదటి దాన్ని పసిఫిక్‌ ప్రాంత మేఖలగా, రెండోదాన్ని మధ్యధరా మేఖలగా వ్యవహరిస్తారు. మొదటి దాంట్లో భూకంపాలే కాదు, అగ్నిపర్వతాలూ ఉంటాయి. అందువల్ల దీన్ని అగ్నివలయంగా పిలుస్తారు. ఈ వలయం ముఖ‌్యంగా పసిఫిక్ సముద్రం, ఉత్తర-దక్షిణ ఆఫ్రికా పశ్చిమతీరం, అలూషియన్ దీవులు, ఆసియా తూర్పు దీవుల్లో విస్తరించింది. హిమాలయ ప్రాంతంలో ఎక్కువగా, అధిక తీవ్రతతో భూంకంపాలు సంభవిస్తున్నాయి. దీనికితోడు భారత భూభాగం ఏడాదికి 49 మి.మీ. చొప్పున ఉత్తరం వైపు జరుగుతూ హిమాలయాల్లోకి చొచ్చుకుపోతోంది. ఇది సహజసిద్దంగా ఏర్పడే ఫలకాల నిరూపకారక క్రియ. దీనికారణంగా, భూపటలంలోని ఫలకాలు ఢీకొని భూకంపాలు ఏర్పడుతున్నాయి. ఉత్తర భారతంతో పోలిస్తే, దక్షిణభారతానికి భూకంపాల తాకిడి తక్కువేనని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.

సుదూర గ్రహాలకు సైతం రోదసీ నౌకలను పంపుతూ, వాటిని ఇక్కడి నుంచే నియంత్రించగల శక్తిని సంతరించుకున్న మానవుడు, భూకంపాల ముందు నిస్సహాయంగా మోకరిల్లుతున్నాడు. కాళ్లకింది నేల ఏక్షణం కదులుతుందో చెప్పలేకపోతున్నాడు. గతంతో పోలిస్తే, పరిశోధనల్లో ఎంతోకొంత పురోగతి కనిపిస్తున్నా, నిర్దిష్టంగా, ఎప్పుడు, ఎక్కడ వస్తుందో చెప్పలేని పరిస్థితి. అందుకు అపార ప్రాణ, ఆస్తినష్టాలే నిదర్శనం. మనకు చాలా విచిత్రంగా, చోద్యంగా అనిపిస్తుంది కానీ, కాలుష్యం, అందువల్ల పెరుగుతున్న భూతాపం వంటివి, భూమి లోలోపలి పొరలపై సైతం తీవ్ర ప్రభావాన్ని చూపపుతున్నాయని శాస్త్రవేత్తలు నిర్ధారణకొచ్చారు. అదే సమయంలో, భూకంపాలపై పౌరులను చైతన్యవంతం చేసే, కార్యక్రమాలను చేపట్టాలి. ఏ భూకంపమైనా, దానంతటదే ప్రాణాలు తీయలేదు. కూలిపోయే, కట్టడాలే కారణమవుతాయి. ఏ నిర్మాణమైనా భూకంపతీవ్రతను తట్టుకునే తరహాలో ఉండేందుకు అనువైన చర్యలు తీసుకోవాలి.

Tags:    

Similar News