Cyclone Biparjoy: తీరాన్ని తాకిన బిపోర్‌జాయ్‌ తుపాను

Cyclone Biparjoy: గుజరాత్‌లో భీకర గాలులు.. కుంభవృష్టి

Update: 2023-06-16 01:42 GMT

Cyclone Biparjoy: తీరాన్ని తాకిన బిపోర్‌జాయ్‌ తుపాను

Cyclone Biparjoy: బిపోర్‌జాయ్‌ అతితీవ్ర తుపాను గుజరాత్‌ కచ్‌ ప్రాంతంలోని కోట్‌ లఖ్‌పత్‌ సమీపంలో అర్థరాత్రి తీరాన్ని తాకింది. ఇది పూర్తిగా తీరాన్ని దాటేందుకు దాదాపు 6 గంటల సమయం పడుతుందని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. తుపాను ప్రభావంతో గుజరాత్‌ తీరంలో భీకర గాలులు వీస్తున్నాయి. కచ్‌, సౌరాష్ట్ర ప్రాంతాల్లో కుండపోతగా వర్షం కురుస్తోంది. కచ్‌ సమీపంలోని జఖౌ వద్ద నిన్న సాయంత్రానికే పెనుతుపాను తీరం దాటుతుందని వాతావరణ శాఖ తొలుత అంచనా వేసింది. తుపాను వేగం తగ్గటం వల్ల తీరాన్ని తాకడానికే ఆలస్యమైంది. పలుచోట్ల గంటకు 100 కి.మీ. వేగంతో గాలులు వీస్తున్నాయి. తీరం పూర్తిగా దాటే సమయానికి ఇది 120-130 కి.మీ. వరకు చేరే అవకాశముందని అధికారులు తెలిపారు. దాదాపు 20 తీరప్రాంత గ్రామాలకు చెందిన లక్షమంది ప్రజలను ఇప్పటికే సురక్షిత ప్రాంతాలకు తరలించినట్లు చెప్పారు. కేవలం 48 గంటల్లోనే ఈ తుపాను తీవ్రరూపం దాల్చింది. అరేబియాలో పది రోజులకు పైగా కొనసాగిన తొలి తుపానుగా ఇది నిలిచిపోనుంది.

తుపాను తీరం దాటిన ప్రాంత పరిసరాల్లో 144 సెక్షన్‌ విధించారు. ద్వారకలోని సుప్రసిద్ధ ప్రాచీన ఆలయం సహా పాఠశాలలు, ప్రభుత్వ కార్యాలయాలను తాత్కాలికంగా మూసివేశారు. 18 NDRF, 12 SDRF బృందాలతో పాటు రహదారులు-భవనాల శాఖకు చెందిన 115 బృందాలు, విద్యుత్తు శాఖకు చెందిన 397 బృందాలు సహాయక చర్యలకు సిద్ధంగా ఉన్నాయి. 76 రైళ్లను రైల్వేశాఖ రద్దు చేసింది.

బిపోర్‌జాయ్‌ తుపాను తీవ్రత దృష్ట్యా పాకిస్థాన్‌ తీర ప్రాంతాల్లో అప్రమత్తత ప్రకటించారు. దాదాపు 82 వేల మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. పాక్‌లో దాదాపు 325 కి.మీ. తీర ప్రాంతంపై తుపాను ప్రభావం పడుతుందని వాతావరణ విభాగం అంచనా వేసింది. ముఖ్యంగా విద్యుత్తు సరఫరా వ్యవస్థ దెబ్బతింటుందని భావిస్తూ ప్రజల్ని ఆ మేరకు అప్రమత్తం చేశారు.

తుపాను ప్రభావంతో కచ్‌, జామ్‌నగర్‌, రాజ్‌కోట్‌, పోర్‌బందర్‌, దేవ్‌భూమి ద్వారక, అమ్రేలీ సహా పలు ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఇవాళ సాయంత్రం వరకు ఇవి కొనసాగనున్నాయి. సౌరాష్ట్ర, కచ్‌ తీరాలతోపాటు, దమణ్‌ ప్రాంతంలో సముద్రం అల్లకల్లోలంగా మారింది. పలుచోట్ల విద్యుత్తు స్తంభాలు, వృక్షాలు కూలిపోయాయి. విద్యుత్తు సరఫరా నిలిచిపోయింది. అరేబియాలో మూడేళ్ల క్రితం వచ్చిన తౌవ్‌క్తే తర్వాత ఇదే శక్తిమంతమైన తుపానుగా భావిస్తున్నారు.

Tags:    

Similar News