Cyclone Biparjoy: ఇవాళ తీరాన్ని దాటనున్న బిపోర్‌జాయ్ తుపాను
Cyclone Biparjoy: గుజరాత్‌లో భారీ వర్షాలతో పాటు బలమైన గాలులు
Cyclone Biparjoy: బిపోర్ జాయ్ తుపాను ఇవాళ తీరాన్ని దాటనుంది. తీరాన్ని దాటే సమయంలో గుజరాత్‌లో భారీ వర్షాలతోపాటు అతి బలమైన గాలులు వీస్తాయని భారత వాతావరణశాఖ హెచ్చరించింది. అరేబియా సముద్రంలో ఏర్పడిన ఈ తుపాను =గుజరాత్‌లోని కచ్, దక్షిణ పాకిస్థాన్‌వైపు దిశను మార్చుకుంటోందని, జఖౌవద్ద తీరాన్ని దాటనుందని వెల్లడించింది. తుపాను గమనం మందగించిందని, దాదాపుగా ఆగిపోయిందని, దీనిని బట్టి అది దిశను మార్చుకుంటోందని అర్థమని వివరించింది. సౌరాష్ట్ర, కచ్‌లను తాకడంతోపాటు మాండవి, కరాచీల మధ్య జఖౌ సమీపంలో తీరాన్ని దాటనుందని పేర్కొంది. ప్రస్తుతం తుపాను కచ్‌కు 290 కిలోమీటర్ల దూరంలో ఉంది.
తుపాను స్వల్పంగా బలహీనపడినా గుజరాత్‌కు ముప్పు పొంచే ఉందని ఐఎండీ వెల్లడించింది. తుపాను స్వల్పంగా బలహీనపడినా... తీరాన్ని దాటే సమయంలో 145 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని అంచనా వేసింది. సౌరాష్ట్ర, కచ్‌లలో కెరటాలు 2 నుంచి 3 మీటర్ల ఎత్తువరకూ ఎగిసిపడతాయి. రాజస్థాన్, పశ్చిమ మధ్యప్రదేశ్‌లోనూ వర్షాలు పడతాయని ఆయన వివరించారు.
తుపాను ముప్పుతో గుజరాత్ తీర ప్రాంతాల్లోని సుమారు 50వేల మంది ప్రజలను అధికారులు సురక్షిత ప్రాంతాలకు తరలించారు. తీర ప్రాంత జిల్లాల్లో సహాయక చర్యలకు 18 ఎన్‌డీఆర్‌ఎఫ్, ఎస్‌డీఆర్‌ఎఫ్, రోడ్లు, భవనాలు, విద్యుత్తు బృందాలు సిద్ధంగా ఉన్నాయి. బిపోర్ జాయ్ తుపాను ప్రభావంతో గుజరాత్‌తోపాటు మరో 8 రాష్ట్రాల్లో వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణశాఖ అంచనా వేసింది. దీంతో కేరళ, తమిళనాడు, కర్ణాటక, మహారాష్ట్ర, రాజస్థాన్, మధ్యప్రదేశ్, గోవా రాష్ట్రాలతోపాటు దమణ్ దీవ్, లక్షద్వీప్, దాద్రానగర్ హవేలీ కేంద్ర పాలిత ప్రాంతాలు అప్రమత్తమయ్యాయి.
తుపాను నేపథ్యంలో పాకిస్థాన్‌లోని తీర ప్రాంత పట్టణాలు, అరేబియా దీవుల్లో ఉన్న 71వేల మందిని అధికారులు ఖాళీ చేయించారు. బలమైన గాలులు, వర్షాలు, కెరటాల తాకిడితో భారీ నష్టం సంభవించవచ్చనే ఆందోళనతో ముందు జాగ్రత్తగా ప్రజలను తరలించారు. పాక్‌లో 170 కిలోమీటర్ల వేగంతో గాలులు వీయవచ్చని అంచనా వేశారు. కరాచీ, హైదరాబాద్ తదితర నగరాలతోపాటు చుట్టుపక్కల ప్రాంతాలకు ముప్పు ఉండవచ్చని అధికారులు తెలిపారు.