Coronavirus: థర్డ్ వేవ్ ముప్పు పిల్లల్లో తక్కువేనంటున్న అధ్యయనాలు
Coronavirus: పిల్లలపై కరోనా థర్డ్‌వేవ్ ప్రభావం మరీ భయపడినంత స్థాయిలో ఉండకపోవచ్చని వెల్లడైంది.
Coronavirus: పిల్లలపై కరోనా థర్డ్‌వేవ్ ప్రభావం మరీ భయపడినంత స్థాయిలో ఉండకపోవచ్చని వెల్లడైంది. పిల్లల్లో గతంలో ఇన్‌ఫెక్షన్ సోకిన రేటు అధికంగా, దాదాపు పెద్దలతో సమానంగా ఉన్న కారణంగా కరోనా మూడో వేవ్ ముప్పు పిల్లల్లో తక్కువగానే ఉంటుందని తాజా అధ్యయనం తేల్చింది. డబ్ల్యూహెచ్‌ఓ, ఎయిమ్స్ కలిసి ఐదు రాష్ట్రాల్లోని 10 వేల మందిపై ఈ అధ్యయనం చేస్తున్నాయి. ఇతరుల కన్నా పిల్లలపై మూడో వేవ్ ముప్పు అధికంగా ఉంటుందన్న నేపథ్యంలో ఈ స్టడీ ప్రాథమికంగా కొన్ని వివరాలు వెల్లడించింది.
ఈ అధ్యయనంలో ఎలీసా కిట్స్‌తో శరీరంలో కోవిడ్ యాంటీబాడీల స్థాయిని గుర్తించారు. మన శరీరంలో వైరస్‌లపై పోరాడే సహజ రోగ నిరోధక స్పందన స్థాయిని సీరో పాజిటివిటీగా పేర్కొంటారు. ఈ అధ్యయనానికి ఎయిమ్స్ ఎథిక్స్ కమిటీ ఆమోదం లభించింది. డేటా అందుబాటులో ఉన్న 4వేల 509 మంది వాలంటీర్లలో 700 మంది 18 ఏళ్లలోపు వయసు ఉన్నవారు కాగా మిగతా వారు 18 ఏళ్ల వయసువారు. వారి సగటు వయసు ఢిల్లీ అర్బన్‌లో 11, ఢిల్లీ రూరల్‌లో 12, భువనేశ్వర్ లో 11, గోరఖ్‌పూర్ లో 13, అగర్తలలో 14గా ఉంది. వీరి నుంచి ఈ ఏడాది మార్చ్ 15 నుంచి జూన్ 10వ తేదీ మధ్య వివరాలు సేకరించారు.
పిల్లల్లో సీరో పాజిటివిటీ రేటు అధికంగా, దాదాపు పెద్దలతో సమానంగా ఉంది. అందువల్ల భవిష్యత్తులో ప్రస్తుతమున్న వేరియంట్ల ద్వారా వచ్చే మూడో వేవ్ రెండేళ్లపైన వయసున్న పిల్లలపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం తక్కువని ఆ స్టడీ తేల్చింది. ఎయిమ్స్ డైరెక్టర్ తదితరులు ఈ అధ్యయనంలో పాల్గొన్నారు.