Connection of Rivers: గోదావరి-కావేరి నదుల అనుసంధానం ఇచ్చంపల్లి నుంచే

ఇచ్చంపల్లి నుంచే గోదావరి -కావేరి నదుల అనుపంధానం చేసేందుకు జాతీయ జల అభివృద్ధి సంస్థ (ఎన్.డబ్ల్యు.డి.ఎ) మొగ్గు

Update: 2021-02-20 03:47 GMT

ప్రతీకాత్మక చిత్రం 

Connection of Rivers: నదుల అనుసంధానంపై కేంద్రం వడివడిగా అడుగులు వేస్తోంది. గోదావరి-కావేరి నదుల అనుసంధానం ప్రతిపాదనలను రాష్ట్రానికి పంపింది. ఈ ప్రతిపాదనల ప్రకారం ఇచ్చంపల్లి నుంచే గోదావరి -కావేరి నదుల అనుపంధానం చేసేందుకు జాతీయ జల అభివృద్ధి సంస్థ (ఎన్.డబ్ల్యు.డి.ఎ) మొగ్గుచూపుతున్నట్లు సమాచారం. గోదావరి జలాలను జానంపేట నుంచి నాగార్జునసాగర్‌ వరకు, అక్కడి నుంచి పెన్నా ద్వారా కావేరికి మళ్లించడంపై ఈ సంస్థ అధ్యయనం జరిపింది. నదుల అనుసంధానంపై ఏర్పాటైన టాస్క్‌ఫోర్స్‌ కమిటీ ఈ నెల 25న చర్చించనుంది.

కేంద్రజల్‌శక్తి మంత్రిత్వశాఖ సలహాదారు, నదుల అనుసంధాన కమిటీ ఛైర్మన్‌ వెదిరే శ్రీరాం అధ్యక్షతన జరిగే ఈ సమావేశంలో కేంద్రజలసంఘం ఛైర్మన్‌, ఎన్‌.డబ్యు.డి.ఎ. డైరెక్టర్‌ జనరల్‌తో సహా 11 మంది సభ్యులు, పది మంది ప్రత్యేక ఆహ్వానితులు పాల్గొననున్నారు. దేశంలోని పలు అనుసంధానాలపై ఈ కమిటీ చర్చించనున్నా, ఎజెండాలో గోదావరి-కావేరికి ప్రత్యేక ప్రాధాన్యం ఇవ్వనుంది. ఇచ్చంపల్లి వద్ద 175 టీఎంసీల నీటి మిగులు ఉంటుందని, ఛత్తీస్‌గఢ్‌కి కేటాయించి వాడుకోలేని నీరు సైతం ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఇదే అనువైన ప్రాంతంగా భావిస్తున్నట్లు తెలిసింది. దీనివల్ల తెలంగాణలో ఎక్కువ ఆయకట్టుకు ప్రయోజనం కలిగే అవకాశం ఉంది.

తాజా అధ్యయనం ప్రకారం నీటి లభ్యత తగ్గడానికి కారణం ఇంద్రావతి నది గోదావరిలో కలవడానికి ఎగువన, దిగువన తెలంగాణ ప్రభుత్వం ఎత్తిపోతల పథకాలను చేపట్టడమేనంది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లు గోదావరి నీటిని పక్కబేసిన్‌లో వినియోగించుకోవడానికి సైతం పలు ఎత్తిపోతల పథకాలను చేపట్టాయని నివేదికలో వెల్లడించింది.

Tags:    

Similar News