కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికల్లో త్రిపాఠి నామినేషన్ తిరస్కరణ
*రాజ్యసభ ప్రతిపక్ష పదవి కోసం రేసులో చిదంబరం, దిగ్విజయ్ సింగ్
Congress President Poll: కాంగ్రెస్ అధ్యక్ష పదవికి జరుగుతున్న ఎన్నికల్లో మరో ట్విస్ట్ నెలకొంది. జార్ఖండ్ మాజీ మంత్రి కెఎన్ త్రిపాఠి నామినేషన్ తిరస్కరణకు గురైంది. దీంతో మల్లిఖార్జున ఖర్గే, శశి థరూర్ మధ్య ద్విముఖ పోరు ఉండనుంది. ఏఐసీసీ సెంట్రల్ ఎలక్షన్ అథారిటీ ఛైర్మన్ మధుసూదన్ మిస్త్రీ మీడియాతో మాట్లాడుతూ త్రిపాఠి నామినేషన్ తిరస్కరణకు గురైనట్టు ప్రకటించారు. త్రిపాఠి ప్రతిపాదకులలో ఒకరి సంతకం మ్యాచ్ కాకపోవడంతో ఆయన నామినేషన్ తిరస్కరణకు గురైందని చెప్పారు. మరోవైపు కాంగ్రెస్ అధ్యక్ష బరిలో నిలిచిన ఖర్గే.. రాజ్యసభలో ప్రతిపక్ష నేత పదవికి రాజీనామ చేశారు.
ఈ మేరకు తన రాజీనామా లేఖను కాంగ్రెస్ తాత్కాలిక జాతీయ అధ్యక్షురాలు సోనియాకు పంపించారు. కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడిగా ఉంటూ రాజ్యసభలో ప్రతిపక్ష నేత పదవి నిర్వహించడం కరెక్ట్ కాదని ఖర్గేకు సోనియా గాంధీ చెప్పినట్లు సమాచారం. జోడు పదవులు వద్దని ఖర్గేకు సోనియాగాంధీ సూచించినట్లు ప్రచారం జరుగుతోంది. అందుకే కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడిగా ఎన్నికయ్యే అవకాశమున్న ఖర్గే.. రాజ్యసభలో ప్రతిపక్ష నేత పదవికి రాజీనామా చేసినట్లు తెలుస్తోంది. ఖర్గే రాజీనామాతో ఖాళీ అయిన రాజ్యసభ ప్రతిపక్ష పదవి కోసం పి.చిదంబరం, దిగ్విజయ్ సింగ్ పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి.