Maharashtra: నేడు మహారాష్ట్రలో లాక్‌డౌన్‌పై నిర్ణయం!

Maharashtra: మహారాష్ట్రలో కరోనా విలయతాండవం * లాక్‌డౌన్‌ విధించాలని మంత్రుల విజ్ఞప్తి

Update: 2021-04-21 02:16 GMT

మహారాష్ట్ర ముఖ్యమంత్రి (ఫైల్ ఇమేజ్)

Maharashtra: దేశవ్యాప్తంగా కరోనా ఉగ్రరూపం దాలుస్తోంది. ఇప్పటికే రోజుకి 2.5 లక్షలకు పైగా కేసులు నమోదవుతున్నాయి. ఇక మహారాష్ట్ర పరిస్థితి రోజురోజుకి దయనీయంగా మారుతోంది. దీంతో అక్కడ పూర్తిస్థాయి లాక్‌డౌన్‌ విధించాలన్న డిమాండ్‌ బలంగా వినిపిస్తోంది. దీనిపై ముఖ్యమంత్రి ఉద్ధవ్‌ థాకరే బుధవారం రాత్రి 8 గంటలకు తన నిర్ణయం ప్రకటిస్తారని ఆరోగ్యశాఖ మంత్రి రాజేశ్‌ తోపే తెలిపారు.

ఇప్పటికే సీఎంతో భేటీ అయిన మంత్రులు.. పూర్తిస్థాయి లాక్‌డౌన్‌ విధించాలని విజ్ఞప్తి చేసినట్లు రాజేశ్‌ తెలిపారు. దీనిపై తుది నిర్ణయం ఆయనే తీసుకుంటారని పేర్కొన్నారు. అలాగే రాష్ట్రంలో వ్యాక్సినేషన్‌ కార్యక్రమం వేగవంతంగా కొనసాగుతుందని ముఖ్యమంత్రి హామీ ఇచ్చినట్లు తెలిపారు. అవసరమైతే కేంద్రం అనుమతితో విదేశాల నుంచి నేరుగా టీకాల్ని కొనుగోలు చేసేందుకు కూడా సిద్ధమవుతున్నట్లు వెల్లడించారు.

దీనిపై మరికొంత మంది మంత్రులు మాట్లాడుతూ.. రాష్ట్రంలో ఆక్సిజన్‌ నిల్వలు పూర్తిగా నిండుకోనున్నాయని తెలిపారు. పరిస్థితిని అదుపులోకి తేవాలంటే లాక్‌డౌన్‌ విధించాల్సిందేనని అభిప్రాయపడ్డారు. ఇప్పటికే మహారాష్ట్రలో వారాంతపు లాక్‌డౌన్‌, రాత్రిపూట కర్ఫ్యూ కొనసాగుతున్న విషయం తెలిసిందే. అయినా కరోనా ఏమాత్రం నియంత్రణలోకి రావడం లేదు. దీంతో పూర్తిస్థాయి లాక్‌డౌన్‌ తప్పనిసరి అన్న వాదన బలంగా వినిపిస్తోంది. మహారాష్ట్రలో గడిచిన 24 గంటల్లో 58,924 కేసులు వెలుగులోకి వచ్చాయి. మరో 351 మంది మరణించారు.

Tags:    

Similar News