China Opens 5G Station: టిబెట్‌ బోర్డర్ లో 5జీ సిగ్నల్‌ స్టేషన్‌

China Opens 5G Station: భారత్‌ సరిహద్దుల సమీపంలోని టిబెట్‌ వద్ద చైనా సరికొత్త 5జీ కమ్యూనికేషన్‌ సిగ్నల్‌ స్టేషన్‌ను ఏర్పాటు

Update: 2021-04-13 08:11 GMT

China Opens 5G Station:(File Image)

China Opens 5G Station: నిరంతం భారత్‌పై అక్కసు వెళ్లగక్కుతూ విస్తరణవాద కాంక్షతో రగిలిపోతున్న చైనా.. భారత్‌ సరిహద్దుల సమీపంలోని టిబెట్‌ వద్ద చైనా సరికొత్త 5జీ కమ్యూనికేషన్‌ సిగ్నల్‌ స్టేషన్‌ను ఏర్పాటు చేసింది. గన్‌బాల రాడార్‌ స్టేషన్‌లో భాగంగా దీనిని కూడా ప్రారంభించింది. ప్రపంచంలో అత్యంత ఎత్తులో (5,374 మీటర్లు) నిర్వహిస్తున్న రాడార్‌ స్టేషన్‌ ఇదే. ఈ విషయాన్ని చైనా మిలటరీ వెబ్‌సైట్‌ పేర్కొంది.

టిబెట్‌లోని నగార్జే కౌంటీలో ఇది ఉంది. ఇది భారత్‌, భూటాన్‌ బోర్డర్‌కు సమీపంలో ఉంటుంది. గతేడాది పలు సంస్థలతో కలిసి ఇక్కడ 5జీ స్టేషన్‌ను ఏర్పాటు చేసే కార్యక్రమం చేపట్టింది. సరిహద్దులోని రక్షణ దళాలకు కమ్యూనికేషన్‌లో సమస్యలను తొలగించేందుకు దీనిని ఉపయోగించనున్నారు. ఈ సేవలతో దట్టమైన పర్వతాల్లో ఉన్నా సైనికులకు స్పష్టమైన సిగ్నళ్లను చైనా అందించగలుగుతుంది.

భారత్‌తో వివాదం కొనసాగుతున్న సమయంలో సరిహద్దుల వెంబడి భారీస్థాయిలో ఆప్టికల్‌ ఫైబర్‌ కేబుల్‌ నెట్‌వర్క్‌ను ఏర్పాటు చేసే పనిలో శరవేగంగా పావులు కదపడం చైనా మొదలుపెట్టింది. ఉద్రిక్తతలు అధికంగా ఉన్న పాంగాంగ్‌ సరస్సులోని దక్షిణ భాగం వరకు కేబుళ్లను వేసేందుకు అప్పట్లో భారీ ఎత్తున తవ్వకాలు ప్రారంభించింది. ఈ విషయాన్ని భారత సైనిక అధికారులు ధ్రువీకరించారు. ''వేగవంతమైన సమాచారం కోసం భారత సరిహద్దుల్లో చైనా గగనతల రక్షణ వ్యవస్థలను గతంలో మోహరించింది. వాటిని ఇప్పటికీ కొనసాగిస్తోంది.

భారత దళాలు వీటిపై ఓ కన్నేసి పెట్టాయని ఆంగ్ల వార్త సంస్థ ఏఎన్‌ఐ పేర్కొంది. హెచ్‌క్యూ,హెచ్‌క్యూ22 వంటి గగనతల రక్షణ వ్యవస్థలను ఏర్పాటు చేసింది. ఇప్పటికే హెచ్‌క్యూ9 కూడా ఇక్కడ ఉంచినట్లు వార్తలొచ్చాయి. ఇది ఎస్‌-300 చైనా తయారు చేసిన నకలు. దీని రేంజి 250 కిలోమీటర్లు. వీటిపై ఎప్పటికప్పుడు నిఘా ఉంచినట్లు మన సైనిక వర్గాలు వెల్లడించాయి. దీంతోపాటు హోటాంగ్‌, కష్గర్‌లోని చైనా వాయుసేన స్థావరాల్లో విమానాల రాకపోకలను గమనిస్తున్నాయి.

చైనా ఆప్టికల్‌ ఫైబర్‌ నెట్‌వర్క్‌ వేయడం ఆందోళన కలిగిస్తోంది'' అని అప్పట్లో ఓ భారత అధికారి చెప్పారు. ఈ కేబుళ్ల ద్వారా సరిహద్దుల్లోని దళాలకు వెనుకనున్న సైనిక స్థావరాల నుంచి సురక్షితమైన సమాచారం అందుతుంది. అంతేకాదు ఎప్పటికప్పుడు దృశ్యాలను, డాక్యుమెంట్లను పంపించుకోవచ్చు. ''రేడియోలో మాట్లాడితే దొరికిపోవచ్చు. సంకేతాలను అడ్డుకోవచ్చు. ఆప్టికల్‌ ఫైబర్‌తో అలాంటి పరిస్థితి ఉండదు. సమాచారం సురక్షితంగా ఉంటుంది'' అని ఆ అధికారి చెప్పారు.

Tags:    

Similar News