Char Dham Yatra: చార్‌ధామ్ యాత్ర రద్దు

Char Dham Yatra: భక్తుల ఆరోగ్యం దృష్ట్యా ఛార్ ధామ్ యాత్రను రద్దు చేస్తున్నట్లు ఉత్తరాఖండ్ ప్రభుత్వం ప్రకటించింది.

Update: 2021-04-29 10:47 GMT

ఉత్తరాఖండ్ చార్ ధామ్ యాత్ర (ఫైల్ ఇమేజ్)

Char Dham Yatra: కరోనావైరస్ మహమ్మారి అల్లకల్లోలం సృష్టిస్తోంది. దేశంలో నిత్యం లక్షలాది కేసులు, వేలాది సంఖ్యలో మరణాలు సంభవిస్తుండటంతో అంతటా ఆందోళన నెలకొంది. గత 24 గంటల్లో దేశవ్యాప్తంగా 3,60,960 కరోనా కేసులు నమోదు కాగా.. ఈ మహమ్మారి కారణంగా 3,293 మంది బాధితులు ప్రాణాలు కోల్పోయారు. తాజాగా ఈ సంఖ్య భారీగా పెరిగింది. ఈ నేపథ్యంలో ఉత్తరాఖండ్ ప్రభుత్వం కూడా కీలక నిర్ణయం తీసుకుంది. భక్తుల ఆరోగ్యం దృష్ట్యా ఛార్ ధామ్ యాత్రను రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. బద్రీనాథ్, కేదార్‌నాథ్, యమునోత్రి, గంగోత్రి ఆలయాల్లో కేవలం అర్చకులు మాత్రమే పూజలు, ఇతర కార్యక్రమాలు చేస్తారు. మే 14 నుంచి యాత్ర ప్రారంభం కావాల్సి ఉంది. కరోనా కేసులు పెరుగుతుండడంతో యాత్రను నిలిపివేస్తున్నట్లు ఉత్తరాఖండ్ ప్రభుత్వం ప్రకటించింది.

ఉత్తరాఖండ్‌లో గడిచిన 24 గంటల్లో 6054 మందికి కరోనా పాజిటివ్ నిర్ధారణ అయింది. 3595 మంది కోలుకోగా.. 108 మంది మరణించారు. తాజా లెక్కలతో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 1,68,616 కి చేరింది. వీరిలో 1,20,816 మంది కోలుకున్నారు. కరోనా బారినపడి ఇప్పటి వరకు 2,417 మంది మరణించారు. ప్రస్తుతం ఉత్తరాఖండ్లో 45,383 యాక్టివ్ కేసులున్నాయి.క‌రోనా సెకండ్ వేవ్ వేళ హరిద్వార్‌లో ఇటీవలి కుంభమేళాపై విమర్శలు వెల్లువెత్తినా.. చార్ ధామ్ యాత్రనూ నిర్వహించి తీరుతామని ఇటీవల ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి తీరత్ సింగ్ రావత్ ప్రకటించారు. అయితే, కరోనా తీవ్రత దృష్ట్యా తన నిర్ణయాన్ని మార్చుకున్నారు.

Tags:    

Similar News