జీఎస్టీ కౌన్సిల్ లో కుదరని ఏకాభిప్రాయం..12న మరోసారి భేటీ

Update: 2020-10-05 17:52 GMT

రాష్ట్రాలకు పరిహారం చెల్లింపుల అంశమే ప్రధాన అజెండాగా 42వ జీఎస్టీ కౌన్సిల్‌ సమావేశం జరిగిన విషయం తెలిసిందే. అయితే ఈ సమావేశం ఎలాంటి నిర్ణయమూ తీసుకోకుండానే ముగిసింది. కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాల ముందు పరిహారం చెల్లింపునకు సంబంధించి రెండు ఐచ్ఛికాలను ఉంచింది. అయితే ఆ ఐచ్చికాలలో ఒక ఐచ్చికాన్ని 21 రాష్ట్రాలు ఎంచుకున్నాయి. మరికొన్ని రాష్ట్రాలు మాత్రం ఎలాంటి ఐచ్ఛికాన్ని ఎంచుకోకుండా అలాగే ఉండిపోయాయి. దీంతో జీఎస్టీ పాలక మండలి మరోసారి విస్తృతంగా చర్చించేందుకు భేటీ కావాలని నిర్ణయించింది. ఇందులో భాగంగానే అక్టోబర్‌ 12వ తేదీన మరోసారి కౌన్సిల్‌ భేటీ జరగనుంది. ఇక ఈ వీడియో కాన్ఫరెన్స్ జరిగిన అనంతరం కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ సమావేశంలో చర్చించన అంశాల గురించి అలాగే తీసుకున్న నిర్ణయాలను వివరించారు.

రాష్ట్రాల ఆదాయం తగ్గినప్పుడు పూడ్చేందుకు విధిస్తున్న పరిహార సెస్సు గడువును పొడిగించేందుకు అంగీకారం కుదిరిందన్నారు. అలాగే గతంలో తక్కువ మొత్తంలో ఐజీఎస్టీ పొందిన రాష్ట్రాలకు రూ.24వేల కోట్లను వచ్చే వారాంతానికి విడుదల చేస్తామని చెప్పారు. జీఎస్టీ పరిహార సెస్సు కింద ఈ ఏడాది వసూలైన రూ.20వేల కోట్లను తక్షణమే రాష్ట్రాలకు విడుదల చేస్తున్నట్లు మంత్రి వెల్లడించారు. జీఎస్టీ అమలైన సమయం నుంచి ఐదేళ్ల వరకు అంటే 2022 జూన్‌ వరకు ఈ సెస్సును వసూలు చేయాలని ముందు నిర్ణయించారు. ఆ తరువాత కూడా ఈ సెస్సును వసూలు చేసేందుకు భేటీలో ఏకాభిప్రాయం కుదిరిందని ఆమె స్పష్టం చేసారు. అనంతరం అజయ్‌ భూషణ్‌ పాండే మాట్లాడుతూ 2021 జనవరి 1 నుంచి రూ.5 కోట్ల కంటే తక్కువ టర్నోవర్‌ కలిగిన వ్యాపారులు ఇకపై నెలవారీ రిటర్నులు చెల్లించాల్సిన అవసరం లేదన్నారు. చిన్న వ్యాపారులకు ఇది ఊరట కలిగించే అంశమన్నారు.

Tags:    

Similar News