Haryana Elections 2024: హర్యానా ఓట్ల లెక్కింపులో సీన్ రివర్స్.. సంబరాలు ఆపేసిన కాంగ్రెస్
Haryana Elections Results 2024: హర్యానాలో సీన్ రివర్స్ అయింది. హర్యానాలో మెజార్టీ ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు కాంగ్రెస్ విజయం సాధిస్తుందని జోస్యం చెప్పాయి. ఓట్ల లెక్కింపు ప్రారంభ దశలో ఓట్ల లెక్కింపు సరళి కూడా కాంగ్రెస్‌కి అనుకూలంగానే కనిపించింది. దీంతో హర్యానాలోని కాంగ్రెస్ పార్టీ నేతలు, ఢిల్లీలోని కాంగ్రెస్ అగ్రనేతలు స్వీట్స్ పంచుకుంటూ సంబరాలు చేసుకున్నారు. కానీ 11 గంటల తరువాత నుండి జరుగుతున్న ఓట్ల లెక్కింపు రౌండ్లలో ఫలితం తారుమారవడం కనిపించింది.
హర్యానాలో అధికారం చేపట్టడానికి అవసరమైన మేజిక్ ఫిగర్ 46 గా ఉంది. మెజార్టీ ఎగ్జిట్ పోల్స్ అంచనాల ప్రకారం కాంగ్రెస్ పార్టీ 55 స్థానాలు గెలుచుకుంటే బీజేపి 26 స్థానాలకు పరిమితం అవుతుందని చెప్పాయి. ఓట్ల లెక్కింపు ఆరంభంలో ఫలితాల సరళి కూడా కాంగ్రెస్ పార్టీకి సానుకూలంగా కనిపించినప్పటికీ.. 11-12 గంటల మధ్య పూర్తయిన రౌండ్లలో బీజేపి ఆ మేజిక్ ఫిగర్‌ని దాటి మొత్తం 49 స్థానాల్లో ఆధిక్యం కనబర్చింది. కాంగ్రెస్ పార్టీ 35 స్థానాల్లోనే ఆధిక్యంలో ఉంది. ఈ ఊహించని పరిణామం కాంగ్రెస్ పార్టీని విస్మయానికి గురిచేసింది.
ఓట్ల లెక్కింపులో ఫలితాలు తారుమారవుతుండటంపై కాంగ్రెస్ పార్టీ నేత, హర్యానా మాజీ సీఎం భూపిందర్ సింగ్ హుడా స్పందించారు. ప్రస్తుతానికి ఫలితాల సరళి ఇలానే ఉన్నప్పటికీ రాబోయే రౌండ్లలో కాంగ్రెస్ పార్టీనే పుంజుకుంటుందని హుడా ధీమా వ్యక్తంచేశారు. తనకు అన్ని ప్రాంతాల నుండి రిపోర్ట్స్ వస్తున్నాయని, తామే గెలిచి అధికారం చేపడతామని హుడా ఆశాభావం వ్యక్తంచేశారు.
అయితే, భూపిందర్ సింగ్ హుడా చెప్పిన మాటల సంగతెలా ఉన్నప్పటికీ, కాంగ్రెస్ పార్టీ మాత్రం సంబరాలు చేసుకోవడం మధ్యలోనే ఆపేసింది. దీంతో హర్యానాలో కాంగ్రెస్ పార్టీ గెలుపుపై వారికి ఎంత ధీమా ఉందో వారి వైఖరే చెబుతోంది అంటూ బీజేపి నేతలు కామెంట్స్ చేస్తున్నారు. హర్యానా ఓట్ల లెక్కింపు తాజా సరళిపై సోషల్ మీడియాలో నెటిజెన్స్ స్పందిస్తూ.. మారిన ఫలితాల సరళి కాంగ్రెస్ పార్టీ ఆశలపై నీళ్లు చల్లిందని అభిప్రాయపడుతున్నారు. ఎగ్జిట్ పోల్స్ అంచనాలు తప్పయ్యాయి అనే కామెంట్స్ కూడా కనిపించాయి.