BJP: ఢిల్లీలో నేడు బీజేపీ కీలక భేటీ.. 150 మంది ఎంపీ అభ్యర్థులను ప్రకటించే అవకాశం
BJP: భువనగిరి, మెదక్ స్థానాలకు అభ్యర్థుల్ని ప్రకటించే ఛాన్స్
BJP: లోక్‌సభ ఎన్నికలకు బీజేపీ సన్నద్ధమవుతోంది. టార్గెట్ 370ని రీచ్ అయ్యేలా ప్రణాళికలు రచిస్తున్న బీజేపీ.. త్వరితగతిన అభ్యర్థుల్ని ప్రకటించి ప్రచారబరిలోకి దించాలని భావిస్తోంది. ఈ నేపథ్యంలోనే ఇవాళ ఢిల్లీలో బీజేపీ కేంద్ర ఎన్నికల కమిటీ కీలక సమావేశాన్ని నిర్వహిస్తోంది. ఈ సమావేశంలో ఎంపీ అభ్యర్థుల ఎంపికపై చర్చించడంతో పాటు.. 150 మంది ఎంపీ అభ్యర్థులను ప్రకటించే అవకాశాలున్నాయి.
ఇక తెలంగాణలో లోక్‌సభ ఎన్నికలకు అభ్యర్థులపై ప్రకటన వెలువడే అవకాశాలున్నాయి. రాష్ట్రంలో 17 పార్లమెంట్ నియోజకవర్గాలు ఉండగా.. అందులో సగం స్థానాల్లో ఎంపీ అభ్యర్థుల ప్రకటన ఉండే ఛాన్స్ ఉంది. గత ఎన్నికల్లో గెలిచిన నాలుగు స్థానాల్లో.. ముగ్గురు సిట్టింగ్ ఎంపీలకు తిరిగి అవకాశం కల్పించనుంది జాతీయ నాయకత్వం. ఆదిలాబాద్ స్థానంలో అభ్యర్థిని మార్చనుంది.
దీంతో పాటు.. ఆదిలాబాద్, చేవెళ్ల, మహబూబ్‌నగర్, మల్కాజ్‌గిరి, భువనగిరి, మెదక్ స్థానాలకు అభ్యర్థుల్ని ప్రకటించే ఛాన్స్ ఉంది. అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఆలస్యంగా అభ్యర్థులను ప్రకటించడంతో నష్టం జరిగిందన్న వాదనల నేపథ్యంలో ఇవాళ్టి సమావేశంలోనే అభ్యర్థులను ఫైనల్ చేసే అవకాశాలున్నాయని బీజేపీ నేతలు అంచనా వేస్తున్నారు.