బిపిన్ రావత్ దంపతుల చితికి నిప్పంటించిన పెద్ద కుమార్తె కృతిక
*సైనిక వీరుడికి కన్నీటి వీడ్కోలు పలికిన ప్రజలు *భారత్ మాతాకీ జై నినాదాలతో హోరెత్తిన ఢిల్లీ *నేడు హరిద్వార్‌కు చితాభస్మం
Bipin Rawat: తమిళనాడులో హెలికాప్టర్ ప్రమాదంలో వీరమరణం పొందిన చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ జనరల్ బిపిన్ రావత్, ఆయన భార్య మధులికకు పూర్తి సైనిక అధికార లాంఛనాలతో తుది వీడ్కోలు పలికారు. రావత్ దంపతుల పార్థివ దేహాలకు ఢిల్లీలోని కంటోన్మెంట్ బ్రార్ స్క్వేర్ శ్మశానవాటికలో వారి కుమార్తెలు కృతికా, తరిణి దహన సంస్కారాలు నిర్వహించారు. రావత్ దంపతుల పార్థివదేహాలను పక్కపక్కనే ఉంచి చితి పేర్చారు.
మత గురువు సంస్కృత శ్లోకాలు పఠిస్తుండగా, కుమార్తెలిద్దరూ తల్లిదండ్రుల చితికి నిప్పంటించారు. ఈ సందర్భంగా ఉద్విగ్నభరితమైన వాతావరణం నెలకొంది. ప్రజలు భావోద్వేగానికి గురై కన్నీటి సంద్రంలో మునిగిపోయారు. భారత్ మాతా కీ జై, జనరల్ రావత్ అమర్ రహే, ఉత్తరాఖండ్ కా హీరా అమర్ రహే అంటూ బిగ్గరగా నినాదాలు చేశారు.
వందలాది మంది బిపిన్ రావత్ దంపతుల అంతిమ యాత్రలో పాల్గొన్నారు. యాత్రలో త్రివిధ దళాల నుంచి 800 మంది సీనియర్ సైనికులు పాల్గొన్నారు. జవాన్ల కవాతు మధ్య 10 కిలోమీటర్ల మేర అంతిమ యాత్ర కొనసాగింది. రావత్ దంపతుల భౌతిక కాయాలపై పూలు చల్లి నివాళులర్పించారు. అంతకు ముందు రావత్, మధులికకు రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్, ఢిల్లీ సీఎం కేజ్రీవాల్, కేంద్ర మంత్రులు, ఫ్రాన్స్ రాయబారి ఇమ్మానుయేల్, బ్రిటష్ హైకమిషనర్ అలెక్స్ ఎల్లిస్‌తోపాటు పలు దేశాల రక్షణశాఖ అధికారులు, రాజకీయ ప్రముఖులు రావత్ దంపతుల పార్ధీవ దేహాల వద్ద పుష్పగుచ్చాలు ఉంచి నివాళులర్పించారు.
రావత్‌కు సైనికులు 17 శతఘ్నులతో గన్ సెల్యూట్ సమర్పించారు. రావత్ దంపతుల చితాభస్మాన్ని ఇవాళ ఉత్తరాఖండ్ రాష్ట్రం హరిద్వార్‌కు తీసుకెళ్లనున్నారు. చితాభస్మాన్ని హరిద్వార్‌లో గంగానదిలో నిమజ్జనం చేయనున్నారు.