Bihar Floods: తెగిన నది ఆనకట్ట.. 1000కి పైగా గ్రామాలోకి వరద నీరు..
Bihar Floods: గత నాలుగు రోజులుగా నేపాల్, ఉత్తర బీహార్లలో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా గండక్ నది ప్రమాదస్థాయిలో పొంగిపొర్లుతోంది.
Bihar Floods: గత నాలుగు రోజులుగా నేపాల్, ఉత్తర బీహార్ లో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా గండక్ నది ప్రమాదస్థాయిలో పొంగిపొర్లుతోంది. గోపాల్‌గంజ్, తూర్పు చంపారన్‌లో గండక్ ఆనకట్ట శుక్రవారం మూడు చోట్ల తెగింది. ఆనకట్ట తెగడంతో 1000 కి పైగా గ్రామాల్లో నీరు చేరింది. దాంతో ప్రాణాలను కాపాడుకునేందుకు ప్రజలు ఎత్తైన ప్రదేశాలకు వెళ్తున్నారు. జిల్లాలో లక్ష మందికి పైగా వరద భారిన పడ్డారు. చిక్కుకుపోయిన ప్రజలను సురక్షిత ప్రాంతాలకు జిల్లా యంత్రాంగం, ఎన్‌డిఆర్‌ఎఫ్ బృందం తీవ్రంగా శ్రమిస్తోంది. కాగా గండక్ నదిలో ప్రస్తుతం 3.5 లక్షల క్యూసెక్కుల నీరు ప్రవహిస్తోంది , ఈ కారణంగా గోపాల్‌గంజ్, తూర్పు చంపారన్ లోని ఆనకట్ట విరిగిపోయింది. అలాగే సరన్, సివాన్ జిల్లాల్లో కూడా వరద ముప్పు మొదలైంది.
దాంతో ముందస్తు చర్యగా ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. గోపాల్‌గంజ్ జిల్లాలోని దేవపూర్ సమీపంలో సరన్ మెయిన్ డ్యామ్ కు రంద్రం ఏర్పడింది. దీంతో NH 28 వైపు నీరు వేగంగా ప్రవహిస్తోంది. అక్కడక్కడా రహదారి కోతకు గురైంది. ప్రమాదాలను నివారించడానికి చాలా చోట్ల బారికేడింగ్ ఏర్పాటు చేశారు. 2001, 2010 మరియు 2017 లో కూడా సరన్ ఆనకట్ట తెగిపోయింది. ఇదిలావుంటే దేవపూర్‌లో, 12 ఏళ్ల చిన్నారి నీటిలో కొట్టుకుపోయింది. ప్రస్తుతం చిన్నారి కోసం అన్వేషణ జరుగుతోంది.