Nitish Kumar: ఢిల్లీ పర్యటనలో బీహార్ సీఎం నితీశ్ బిజీ బిజీ
Nitish Kumar: విపక్ష పార్టీల అగ్ర నేతలతో నితీశ్ వరుస భేటీలు
Nitish Kumar: బీహార్ సీఎం నితీశ్ కుమార్ ఢిల్లీ పర్యటనలో ఉన్నారు. ఆయన ఇవాళ సీపీఎం నేత సీతారాం ఏచూరిని కలిశారు. రాబోయే ఎన్నికల్లో ప్రధాని అభ్యర్థిగా పోటీ చేస్తారా అని అడిగిన ప్రశ్నకు ఆయన బదులిస్తూ.. ఆ పోస్టును నేను కోరుకోవడం లేదని, నాకు ప్రధాని కావాలన్న ఆశ లేదని నితీశ్ అన్నారు. సీపీఎం తాము కలిసే ఉన్నామని, అందుకే ఇక్కడకు వచ్చినట్లు ఆయన చెప్పారు. విభిన్న పార్టీలు ఒకే దగ్గరకు వస్తే అది పెద్ద విషయం అవుతుందని ఆయన అన్నారు. లెఫ్ట్ పార్టీలు, ప్రాంతీయ పార్టీలు, కాంగ్రెస్ ఒక దగ్గరకు వస్తే అది భారీ విషయం అవుతుందని నితీశ్ అన్నారు.
2024 లోక్‌సభ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాంపై నితీశ్ పలు పార్టీ నేతల్ని కలుస్తున్నారు. రాహుల్‌ను కలిసిన నితీశ్.. బీహార్‌లో తమకు సపోర్ట్ ఇచ్చినందుకు కాంగ్రెస్ నేతకు థ్యాంక్స్ తెలిపారు. ఢిల్లీ టూర్‌లో కర్నాటక మాజీ సీఎం హెచ్‌డీ కుమారస్వామిని కూడా నితీశ్ కలిశారు. 2024 ఎన్నికల్లో ప్రధాని అభ్యర్థిగా నితీశ్ ఉంటారన్న ఊహాగానాలు వెల్లువెత్తుతున్న నేపథ్యంలో ఈ అంశం ప్రాచుర్యం సంతరించుకున్నది.
సెక్యులర్ డెమోక్రటిక్ పార్టీలు అన్నీ ఏకం అయ్యే సమయం ఆసన్నమైందని, లెఫ్ట్ పార్టీలు, ప్రాంతీయ పార్టీలు ఒక్కటై.. బీజేపీని ఓడించాలని సీపీఎం నేత డీ రాజా అన్నారు. దేశ ప్రయోజనాల కోసం, భవిష్యత్తు కోసం విపక్షాలు ఒక్కటి కావాలన్నారు. నితీశ్ దాని కోసమే ట్రై చేస్తున్నట్లు రాజా తెలిపారు.