కర్ణాటక మాజీ సీఎం యడియూరప్పకు ఎందుకు నాన్ బెయిలబుల్ వారెంట్ ఇష్యూ అయింది?

BS Yediyurappa: కర్ణాటక రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి బీఎస్ యడియూరప్పపై నమోదైన ఫోక్సో కేసులో జూన్ 13న నాన్ బెయిలబుల్ వారంట్ జారీ అయింది.

Update: 2024-06-14 08:37 GMT

కర్ణాటక మాజీ సీఎం యడియూరప్పకు ఎందుకు నాన్ బెయిలబుల్ వారెంట్ ఇష్యూ అయింది?

BS Yediyurappa: కర్ణాటక రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి బీఎస్ యడియూరప్పపై నమోదైన ఫోక్సో కేసులో జూన్ 13న నాన్ బెయిలబుల్ వారంట్ జారీ అయింది. ఈ కేసులో ముందస్తు బెయిల్ కోరుతూ ఆయన హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.

యడియూరప్పపై ఫోక్సో కేసు ఎందుకు?

బీఎస్ యడియూరప్పపై ఫోక్సో చట్టం 534 సెక్షన్ కింద ఈ ఏడాది మార్చి 14న కేసు నమోదైంది. కర్ణాటక సదాశివనగర్ పోలీసులు నమోదు చేసిన ఎఫ్ఐఆర్ మేరకు ఈ ఏడాది ఫిబ్రవరి 2న తల్లీకూతుళ్ళు తమకు సాయం చేయాలని యడియూరప్ప ఇంటికి వెళ్లారు. బాధితురాలు ఇచ్చిన సమాచారం మేరకు పోలీస్ కమిషనర్ కు ఫోన్ చేసి సాయం చేయాలని సూచించినట్టుగా యడియూరప్ప ఎఎన్ఐ న్యూస్ ఏజెన్సీకి తెలిపారు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియదుని, ఆ మహిళ తనపై ఆరోపణలు చేస్తున్నారని, ఈ విషయాన్ని కూడా పోలీసుల దృష్టికి తెచ్చానని ఆయన ఎఎన్ఐ వార్తా సంస్థకు తెలిపారు. మైనర్ బాలికపై లైంగిక వేధింపులకు పాల్పడినట్టుగా తనపై వచ్చిన ఆరోపణలను ఆయన తోసిపుచ్చారు. అయితే, ఈ ఆరోపణలతో యడియూరప్పపై ఫోక్సో కేసు నమోదైంది. ఈ కేసు వెనుక రాజకీయ దురుద్దేశం ఉందా అన్న ప్రశ్నకు తానేమీ చెప్పలేనని అన్నారు. అయితే, అవన్న నిరాధార ఆరోపణలుగా ఆయన కొట్టిపారేశారు.

యడియూరప్పతో పాటు మరికొందరిపై కేసులు

బీఎస్ యడియూరప్పపై లైంగిక వేధింపుల ఫిర్యాదు చేసిన మహిళ మరో 53 మందిపై వివిధ కారణాలతో కేసులు పెట్టిన విషయాన్ని బీజేపీ నాయకులు గుర్తు చేస్తున్నారు. రాష్ట్రంలోని కొందరు ప్రముఖలపై రకరకాల ఆరోపణలతో ఆమె కేసులు పెట్టారని యడియూరప్ప కార్యాలయం మీడియాకు ఓ ప్రకటనను విడుదల చేసింది. 2015 నుండి ఆమె చాలా మందిపై కేసులు పెట్టారని ఆ ప్రకటనలో తెలిపింది.

విచారణలో అన్నీ తేలుతాయంటున్న కర్ణాటక హోం మంత్రి పరమేశ్వర

బీఎస్ యడియూరప్పపై నమోదైన ఫోక్సో కేసులో విచారణలో వాస్తవాలు బయటకు వస్తాయని కర్ణాటక హోం శాఖ మంత్రి పరమేశ్వర చెప్పారు. ఫిర్యాదు చేసిన మహిళ మానసిక పరిస్థితి సరిగా లేదనే ప్రచారంపై స్పందించేందుకు మంత్రి నిరాకరించారు. యడియూరప్పపై నమోదైన కేసులో రాజకీయ కుట్ర ఉందని తాను భావించడం లేదన్నారు. యడియూరప్పను అరెస్ట్ చేస్తారా అనే విషయమై సమాధానం చెప్పడానికి ఆయన ఆసక్తి చూపలేదు. దర్యాప్తుపై తాను ఏమీ మాట్లాడనని అన్నారు. పోలీసులు చట్టం ప్రకారం నడుచుకుంటారని కూడా హోం మంత్రి అన్నారు.

యడియూరప్పపై ఫిర్యాదు చేసిన మహిళ మృతి

బీఎస్ యడియూరప్పపై లైంగిక వేధింపుల ఫిర్యాదు చేసిన మహిళ కర్ణాటకలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో మరణించారు. ఊపిరితిత్తుల సమస్యతో ప్రైవేట్ ఆసుపత్రిలో చేరిన ఆమె చికిత్స పొందుతూ ఈ ఏడాది ఏప్రిల్ లో చనిపోయారు. అయితే, ఈ కేసును తాను చట్టపరంగా ఎదుర్కొంటానని యడియూరప్ప తెలిపారు. ఇదిలా ఉంటే ఈ కేసు విచారణను సీఐడీకి బదిలీ చేశారు డీజీపీ అలోక్ మోహన్. కేసు నమోదైన గంటల వ్యవధిలోనే డీజీపీ ఈ కేసు విచారణను సీఐడీకి బదిలీ చేశారు. సదాశివనగర్ పోలీస్ స్టేషన్ నుండి ఈ కేసు వివరాలు తీసుకొని విచారణను ప్రారంభించారు సీఐడీ అధికారులు.

యడియూరప్ప వాయిస్ శాంపిల్స్ సేకరించిన సీఐడీ

మైనర్ బాలికపై లైంగిక వేధింపుల కేసులో కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి బీఎస్ యడియూరప్ప వాయిస్ శాంపిల్స్ ను సీఐడీ అధికారులు ఈ ఏడాది ఏప్రిల్ లో సేకరించారు. ఈ కేసులో సీఐడీ తరపున పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఆశోక్ నాయక్ వాదిస్తున్నారు. ఈ కేసులో విచారణకు రావాలని సీఐడీ అధికారులు యడియూరప్పకు నోటీసులు జారీ చేస్తున్నారు. అయితే ఈ కేసులో విచారణకు హాజరు కానందున ఆయనకు నోటీసులు ఇచ్చారు. విచారణకు హాజరుకానందున యడియూరప్పపై చర్యలకు కోర్టును అభ్యర్ధించారు సీఐడీ తరపు న్యాయవాది. ఈ అభ్యర్ధనతో కోర్టు యడియూరప్పకు నాన్ బెయిలబుల్ వారంట్ జారీ చేసింది.

ఈ కేసులో యడియూరప్ప ఈ నెల 17న సీఐడీ విచారణకు హజరయ్యే అవకాశం ఉంది. ఈ లోపు హైకోర్టులో ఆయన దాఖలు చేసిన పిటిషన్ పై విచారణ జరుగుతుందా అన్నది ఉత్కంఠగా మారింది.

Tags:    

Similar News