ముంబైపై మాకు హక్కుంది..కర్ణాటక, మహారాష్ట్రల మధ్య ముదరుతోన్న సరిహద్దు వివాదం

*మైసూరులో కలిసిన బాంబే ప్రెసిడెన్సీలోని బెళగావి రాష్ట్రాలు *1956లో బాషా ప్రయుక్త రాష్ట్రాలు *మరాఠీ మాట్లాడే ప్రాంతాలను తమ రాష్ట్రంలో కలపాలని డిమాండ్‌

Update: 2021-01-28 16:30 GMT

ముంబైపై మాకు హక్కుంది..కర్ణాటక, మహారాష్ట్రల మధ్య ముదరుతోన్న సరిహద్దు వివాదం

కర్ణాటక, మహారాష్ట్రల మధ్య సరిహద్దు వివాదం మళ్లీ ముదరుతోంది. చాల రోజుల తర్వాత మహారాష్ట్ర సీఎం ఠాక్రే సరిహద్దు అంశంపై చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారడంతో మళ్లీ రెండు రాష్ట్రాల మధ్య సరిహద్దు వివాదం రాజుకుంటుంది. కర్ణాటక రాష్ట్రం ఆక్రమించిన మరాఠీ మాట్లాడే ప్రాంతాలన్నింటినీ తిరిగి మహారాష్ట్రలో కలుపుకుంటామని ఠాక్రే చేసిన వ్యాఖ్యలు వివాదానికి తెరతీశాయి.

ఒకప్పుడు బాంబే ప్రెసిడెన్సీలో ఉన్న బెళగావి తదితర రాష్ట్రాలు మైసూరు రాష్ట్రంలో కలిసాయి. 1956లో బాషా ప్రయుక్త రాష్ట్రాలు ఏర్పడినప్పుడు ఆప్రాంతాలను కర్ణాటక రాష్ట్రంలో కలిపారు. దీనిని మహారాష్ట్ర తీవ్రంగా వ్యతిరేకిస్తుంది. కర్ణాటక సరిహద్దులో ఉన్న మరాఠీ మాట్లాడే ప్రాంతాలన్నిటినీ తమ రాష్ట్రంలో కలపాలని డిమాండ్‌ చేస్తుంది. అందుకోసం 1948లో మహారాష్ట్ర ఏకీకరణ సమితి ఏర్పరిచి ఆప్రాంతాలను తమ రాష్ట్రంలో కలుపుకునేందుకు పోరాటం చేస్తుంది.

1881 గణాంకాల ప్రకారం బెల్గాం జిల్లాలో 64.05శాతం కన్నడ మాట్లాడేవారు ఉండగా.. 26.04శాతం మంది మరాఠి మాట్లాడేవారు ఉండేవారు. ఆతర్వాత నెలకొన్న పరిణామాలతో అక్కడ మరాఠీల వలసలు భారీగా పెరిగిపోయాయి. ఇక 1957 సంవత్సరానికి బెల్గాంలో మరాఠీ మాట్లాడేవారి సంఖ్య 60శాతానికి పెరిగిపోయింది. అయినా 1956లో బాషా ప్రయుక్త రాష్ట్రాలు ఏర్పడినా తర్వాత కూడా బెల్గాంను కర్ణాటకలోనే కొనసాగించారు. ఆనాటి నుంచే ఈ వివాదం పెరుగుతూ వచ్చింది.

1957లో మహారాష్ట్ర ప్రభుత్వం ఒత్తడితో నలుగురు సభ్యులతో కూడిన మహాజన్‌ కమిషన్‌ ఏర్పాటైంది. ఈ కమిటీ కూడా ఈ రాష్ట్రాల సమస్యను పరిష్కరించలేకపోయింది. 1967లో మహాజన్‌ కమిషన్‌ ఈ ప్రాంతాలు కర్ణాటకలోనే ఉండాలని సూచించింది. ఫలితంగా ఈ కమిషన్‌ సిఫారసును మహారాష్ట్ర తీవ్రంగా వ్యతిరేకిస్తుంది. 2006లో మహారాష్ట్ర ప్రభుత్వం ఈ వివాదంపై సుప్రీంకోర్టుకు వెళ్లింది. కానీ ఏళ్లుగా ఈ కేసు సుప్రీంలో నానుతూనే ఉంది.

ఇదిలా ఉంటే.. రానురాను బెల్గాంలో మరాఠీ మాట్లాడేవారి సంఖ్య పెరుగుతూ వచ్చింది. కానీ ఆ నగరానికి మూడు వైపులా ఉన్న ఊర్లలో కన్నడ మాట్లాడే వారే ఉంటారు. అయితే ఈ సమస్య పరిష్కారం దిశగా 2005లో కేంద్ర ప్రభుత్వం ఒక కదలికను తీసుకువచ్చింది. కర్ణాటక, మహారాష్ట్ర ముఖ్యమంత్రులే మాట్లాడుకుని ఈ సమస్యను పరిష్కరించుకోవాలని సూచించింది. కానీ ఇది ఇప్పటివరకు ముందుకువెళ్లలేదు. ఇక కొన్నేళ్లుగా ఈ వివాదం శాంతించినప్పటికీ ఇప్పుడు రాజకీయ నాయకుల వ్యాఖ్యలతో తిరిగి రాజుకుంటోంది.

Tags:    

Similar News