Indian Railway: రైల్వే ప్రయాణికులకు చేదు వార్త.. మళ్లీ అదనపు ఛార్జీలు వసూలు..!
Indian Railway: డీజిల్ ఇంజన్లతో నడిచే రైళ్లలో ఎక్కువ దూరం వెళ్లే ప్రయాణికుల నుంచి ఇప్పుడు ఎక్కువ ఛార్జీలు వసూలు...
Indian Railway: డీజిల్ ఇంజన్లతో నడిచే రైళ్లలో ఎక్కువ దూరం వెళ్లే ప్రయాణికుల నుంచి ఇప్పుడు ఎక్కువ ఛార్జీలు వసూలు చేసే అవకాశం ఉంది. టికెట్ బుకింగ్ సమయంలో ఏప్రిల్ 15 నుంచి అదనపు ఛార్జీ వసూలుచేస్తారు. వాస్తవానికి డీజిల్ ఇంజిన్‌లతో నడిచే రైళ్లలో వెళ్లే ప్రయాణికులపై రూ.10 నుంచి రూ.50 మధ్య హైడ్రోకార్బన్ సర్‌ఛార్జ్ (హెచ్‌సిఎస్) లేదా డీజిల్ పన్ను విధించాలని రైల్వే బోర్డు యోచిస్తోంది. డీజిల్ లోకోమోటివ్‌లను ఉపయోగించి సగం కంటే ఎక్కువ దూరం ప్రయాణించే రైళ్లకు ఈ సర్‌ఛార్జ్ వర్తిస్తుంది. చమురు ధరల పెరుగుదలతో ఇంధన దిగుమతుల ప్రభావాన్ని తగ్గించడానికి ఇలా చేస్తుంది.
50 రూపాయల వరకు పెరుగుతుంది
మూడు కేటగిరీల కింద ఏసీ క్లాస్‌కు రూ.50, స్లీపర్ క్లాస్‌కు రూ.25, జనరల్ క్లాస్‌కు రూ.10 వసూలు చేస్తారు. సబర్బన్ రైలు ప్రయాణ టిక్కెట్లపై ఎటువంటి సర్‌ఛార్జ్ ఉండదు. ఇప్పటికే నిర్ణీత దూరం కంటే 50 శాతం డీజిల్‌తో నడిచే రైళ్లను గుర్తించాలని రైల్వే బోర్డు అన్ని జోన్‌లను ఆదేశించింది. ప్రతి మూడు నెలలకోసారి ఈ జాబితాను సవరించాల్సి ఉంటుంది. అయితే ఏప్రిల్ 15లోపు బుక్ చేసుకున్న టిక్కెట్లపై సర్‌చార్జి విధించడంపై ఇంకా స్పష్టత లేదు.
డీజిల్ ధరల పెరుగుదల నేపథ్యంలో ఈ నిర్ణయం
రష్యా, ఉక్రెయిన్ మధ్య కొనసాగుతున్న వివాదం అలాగే సౌదీ అరేబియా, యెమెన్ మధ్య ఘర్షణల కారణంగా గ్లోబల్ చమురు ధరలు ప్రస్తుతం రికార్డు స్థాయిలను తాకుతున్నాయి. రష్యా నుంచి సబ్సిడీ ధరలకు భారత్ చమురును దిగుమతి చేసుకుంటున్నప్పటికీ యుద్దం వల్ల సంక్షోభం నెలకొంది. దేశంలో వరుసగా 12 రోజులుగా పెరుగుతున్న ఇంధన ధరలు రికార్డు స్థాయికి చేరుకున్నాయి.