Art of Medical Clothing: కరోనా నుంచి కాపాడే చీరలు.. మద్యప్రదేశ్ లో అమ్మకాలు

Art of Medical Clothing:కరోనా పుణ్యమాని కొత్త కొత్త వింతలు, విడ్డూరాలు చోటుచేసుకుంటున్నాయి.

Update: 2020-08-15 04:19 GMT
Art of Medical Clothing

Art of Medical Clothing:కరోనా పుణ్యమాని కొత్త కొత్త వింతలు, విడ్డూరాలు చోటుచేసుకుంటున్నాయి. దీనిని ఎదుర్కొనేందుకు ఒక పక్క జాగ్రత్తలు తీసుకోవడంతో పాటు మరో పక్క వ్యాధి నిరోధక శక్తి పెంచుకునేందుకు నానా తంటాలు పడుతున్నారు. వీటిని ఆధారంగా చేసుకుని లెక్కలేనన్ని వ్యాపారాలు తెరపైకి వస్తున్నాయి. తాజాగా ఇమ్మూనిటీ పెంచే సుగంధ ద్రవ్యాలతో తయారు చేసిన చీరలంటూ ప్రత్యేకంగా అమ్మకాలు చేస్తున్నారు. వీటిని మధ్యప్రదేశ్ హ్యండ్లూమ్, అండ్ హ్యాండీ క్రాఫ్ట్స్ కార్పోరేషన్ మార్కెట్లోకి తీసుకురావడం విశేషం.

కరోనా వైరస్‌ వ్యాప్తి పెరుగుతుండటంతో ప్రస్తుతం దేశంలో ప్రతి ఒక్కరు రోగనిరోధక శక్తి(ఇమ్యూనిటీ) పెంచుకునే పనిలో ఉన్నారు. ఈ క్రమంలో మార్కెట్‌లోకి రకరకాల ఇమ్యూనిటీ బూస్టర్‌లు వచ్చాయి. అయితే మధ్యప్రదేశ్‌లో మాత్రం వెరైటీగా రోగనిరోధకత పెంచే చీరలు వచ్చాయి. మీరు చదివింది వాస్తవమే.. రోగనిరోధక శక్తి పెంచే చీరలను 'ఆయుర్‌వస్త్రా' పేరుతో మధ్యప్రదేశ్‌ హ్యాండ్లూమ్‌ అండ్‌ హ్యాండిక్రాఫ్ట్‌ కార్పొరేషన్‌ మార్కెట్‌లోకి తీసుకువచ్చింది. రకరకాల సుగంధ ద్రవ్యాలతో వీటిని తయారు చేశామని.. ఇవి రోగనిరోధక శక్తిని పెంచుతాయని కార్పొరేషన్‌ అధికారులు తెలుపుతున్నారు. చీరలు మాత్రమే కాక ఇతర దుస్తులను కూడా తయారు చేశామన్నారు. వీటిని ధరించడం ద్వారా రోగనిరోధక శక్తి పెరుగుతుందని. ఫలితంగా కరోనా వైరస్‌ మన దరిచేరదంటున్నారు కార్పొరేషన్‌ అధికారులు.

యాలకులు, లవంగాలు వంటి సుగంధ ద్రవ్యాలతో

రోగ నిరోధక శక్తిని పెంచే చీరల తయారిని మధ్యప్రదేశ్‌ ప్రభుత్వం భోపాల్‌కు చెందిన వస్త్ర నిపుణుడు వినోద్‌ మాలేవర్‌కి అప్పగించింది. ఈ చీరలు తయారు చేయడానికి ఎక్కువ సమయం తీసుకోవడమే కాక ఎంతో నైపుణ్యం అవసరమన్నారు మాలేవర్‌. లవంగాలు, యాలకులు, జాపత్రి, దాల్చిన చెక్క, నల్ల మిరియాలు, రాయల్‌ జీలకర్ర, బే ఆకు వంటి సుగంధ ద్రవ్యాలను ఈ దుస్తుల తయారికి వాడినట్లు వెల్లడించారు. వీటన్నింటిని పొడి చేసి 48 గంటల పాటు నీటిలో నానబెడతారు. తరువాత దీన్ని మరగబెట్టి.. దాని నుంచి వచ్చిన ఆవిరిని చీర, మాస్క్‌ లేదా ఇతర దుస్తులు తయారు చేసే వస్త్రానికి పట్టిస్తారు. ఇది కొన్ని గంటలపాటు జరుగుతుంది. తర్వాత ఆవిరి పట్టించిన వస్త్రంతో చీర, మాస్క్‌, ఇతర దుస్తులు తయారు చేస్తారు. ఈ పద్దతిలో ఒక చీర తయారు చేయడానికి 5-6రోజులు పడుతుందని తెలిపారు

రెండు నెలలు శ్రమించి ఈ పద్దతి కనుగొన్నాం..

ఈ సందర్భంగా వినోద్‌ మాలేవర్‌ మాట్లాడుతూ.. 'ఇది వందల ఏళ్ల నాటి పురాతన పద్దతి. ఈ బట్టల వల్ల వైరస్‌ వ్యాప్తి తగ్గిపోతుంది. ఈ దుస్తులను ధరించడం వల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుంది. ఈ రకం దుస్తులను తయారు చేయడానికి దాదాపు రెండు నెలల పాటు శ్రమించి ఈ పద్దతిని కనుగొన్నాము. ఈ దుస్తులలో​ రోగనిరోధక శక్తి పెంచే ప్రభావం నాలుగైదు ఉతుకుల వరకు ఉంటుంది' అని తెలిపారు మాలేవర్‌. మధ్యప్రదేశ్‌ హ్యాండ్లూమ్ అండ్ హ్యాండిక్రాఫ్ట్‌ కార్పొరేషన్ కమిషనర్ రాజీవ్ శర్మ మాట్లాడుతూ..'ఆరోగ్యం, రోగనిరోధక శక్తిని పెంచే పురాతన వస్త్రాల తయారీ విధానాన్ని పునరుద్ధరించడానికి మాకు అవకాశం లభించింది. కరోనా ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తోంది. ఇలాంటి సమయంలో మేం జనాలకు మేలు చేసే హెర్బల్‌ దుస్తులను మార్కెట్‌లోకి తెచ్చాం. ప్రస్తుతం రోగనిరోధకత పెంచే ఈ చీర ధర త్రీ వేల రూపాయలు' అన్నారు.

అంతేకాక 'ప్రస్తుతం మేము ఈ చీరలను భోపాల్, ఇండోర్లలో విక్రయిస్తున్నాము. రాబోయే రోజుల్లో, ఈ చీరలను దేశవ్యాప్తంగా ఉన్న మా 36 షోరూమ్‌లలో విక్రయిస్తాము' అని తెలిపారు రాజీవ్‌ శర్మ. అయితే ఈ చీరలు, మాస్క్‌లు ధరించడం వల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుందని నిరూపించడానికి ఎలాంటి వైద్య ఆధారాలు లేవు. ముఖ్యంగా ఈ దుస్తులు కరోనా వైరస్‌ సంక్రమించకుండా కాపాడతాయని చెప్పడానికి ఎలాంటి ఆధాలు లేకపోవడం గమనార్హం.

Tags:    

Similar News