Delhi Rains: ఢిల్లీలో మరో రెండ్రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం
Delhi Rains: ఇప్పటికే భారీ వర్షాలతో ఢిల్లీ వణికిపోతున్న ఢిల్లీ
Delhi Rains: నిన్న కురిసిన భారీ వర్షానికే తేరుకోని ఢిల్లీ వాసులకు భారత వాతావరణ శాఖ పిడుగులాంటి వార్త చెప్పింది. ఈ వారాంతంలో దేశ రాజధాని అంతటా భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది. ఇవాళ, రేపు ఉరుములు, మెరుపులు, ఈదురు గాలులతో కూడిన వర్షం కురిసే అవకాశం ఉందని తెలిపింది. గత మూడు నెలలుగా ఎండ తీవ్రతతో అల్లాడిపోయిన దేశరాజధాని ఢిల్లీ నగరం.. శుక్రవారం కురిసిన భారీ వర్షానికి చిగురుటాకులా వణికిపోయింది. శుక్రవారం తెల్లవారు జామున 3 గంటలకు మొదలైన వాన ఏకధాటిగా మూడు గంటలకు పైగా కురిసింది.
దీంతో రోడ్లన్నీ జలమయమయ్యాయి. వాహనాలు నీట మునిగాయి. అనేక ప్రాంతాల్లో ఇండ్లలోకి నీరు చేరింది. ఈ వర్షంతో రాజధాని మొత్తం జలదిగ్బంధంలోకి వెళ్లిపోయింది. 24 గంటల్లో ఢిల్లీలో 228.1 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదయ్యిందని వాతావరణ శాఖ ప్రకటించింది. సాధారణంగా ఢిల్లీలో జూన్ నెల మొత్తం కలిపి సగటున 74.1 ఎంఎం వర్షపాతం నమోదవుతుంది. మూడు నెలల్లో కురవాల్సిన వర్షం కంటే ఎక్కువ కేవలం 24 గంటలల్లోనే పడింది. 1936 తర్వాత జూన్‌లో అత్యధిక వర్షపాతం నమోదయ్యింది ఇప్పుడేనని వాతావరణ శాఖ వెల్లడించింది.