తాజ్ మహాల్ రహస్య గదులపై హైకోర్టు సంచలన తీర్పు
Taj Mahal: ఆగ్రాలోని తాజ్‌మహాల్‌లోని రహస్య గదులను తెరవాలన్న పిటిషనర్‌కు అలహాబాద్ హైకోర్ట్ షాక్ ఇచ్చింది.
Taj Mahal: ఆగ్రాలోని తాజ్‌మహాల్‌లోని రహస్య గదులను తెరవాలన్న పిటిషనర్‌కు అలహాబాద్ హైకోర్ట్ షాక్ ఇచ్చింది. అద్భుత కట్టడంపై పూర్తిస్థాయి పరిశోధన చేసిన తరువాతే పిల్ వేయాలని పిటిషనర్‌ను మందలించింది. పిల్‌ను ఎగతాళి చేయొద్దని.. కనీస అవగాహన లేకుండా పిల్ వేస్తే ఎలా అంటూ న్యాయస్థానం మండిపడింది. తాజ్‌మహాల్‌ను ఎవరు నిర్మించారు? ఎప్పుడ కట్టారన్న కనీస జ్ఞానం లేకుండా పిటిషన్ వేయడమేమిటంటూ నిలదీసింది. అయితే పరిశోధనకు ఎవరైనా అడ్డుకుంటే మాత్రం ధర్మాసనాన్ని ఆశ్రయించమని కోర్టు తెలిపింది. తాజ్‌మహాల్‌లో మూసి ఉన్న 22 గదుల తలుపుల విషయమై అలహాబాద్ కోర్టు మాత్రం స్పందించలేదు.
ఆగ్రాలోని తాజ్‌మహల్‌లో మూసి ఉన్న 22 తలుపులను తెరువాలని కోరుతూ అలహాబాద్ హైకోర్టు లక్నో బెంచ్‌లో పిటిషన్ దాఖలైంది. అయోధ్యకు చెందిన డాక్టర్ రజనీష్ సింగ్ ఈ పిటిషన్‌ను ఇటీవల దాఖలు చేశారు. అయితే చరిత్రకారుడు పీఎన్ ఓక్ రాసిన తాజ్‌మహల్ పుస్తకాన్ని ఉటంకిస్తూ ఈ కట్టడం వాస్తవానికి తేజో మహాలయ అనీ, దీన్ని క్రీస్తుశకం 1212లో రాజు పర్మర్ది దేవ్ నిర్మించారని పిటిషన్‌లో రజనీష్ తెలిపారు. తాజ్‌మహల్‌లో మూసివేసిన తలుపుల వెనుక శివుడి ఆలయం ఉందని పిటిషన్‌లో తెలిపారు. తాజ్‌మహల్‌కు సంబంధించి ఫ్యాక్ట్ ఫైండింగ్ కమిటీని ఏర్పాటు చేసి తాజ్‌మహల్‌లోని మూసి ఉన్న 22 గదుల తలుపులను తెరిచేలా ఆదేశాలు జారీ చేయాలని పటిషనర్ కోరారు.
రజనీష్ పిటిషన్‌ను జస్టిస్ దేవేంద్రకుమార్ ఉపాధ్యాయ్, జస్టిస్ సుభాష్ విద్యార్థి ధర్మాసనం విచారణ చేపట్టింది. పిటిషనర్ తరఫున న్యాయవాది మాట్లాడుతూ తాజ్‌మహల్ గురించి దేశ పౌరులు నిజానిజాలు తెసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. ఈ విషయమై పలు సార్లు ఆర్టీఐ కింద దాఖలు చేసినా.. భద్రతా కారణాల దృష్ట్యా తెరవడం కుదరని అధికారులు తెలిపినట్లు న్యాయవాది చెప్పారు. యూపీ ప్రభుత్వం తరఫున న్యాయవాది స్పందిస్తూ.. ఈ కేసులో ఇప్పటికే ఆగ్రాలో కేసు నమోదైందని, దీనిపై పిటిషనర్‌కు ఎలాంటి అధికార పరిధి లేదని స్పస్టం చేశారు. ఈ మేరకు వాదనలు విన్న ధర్మాసనం పిటిషన్‌ను మందలించింది.
ఇదిలా ఉంటే ఇప్పుడు రాజస్థాన్ భాజపా ఎంపీ, రాజ కుటుంబానికి చెందిన దియా కుమారి కీలక వ్యాఖ్యలు చేశారు. తాజ్‌మహల్ జైపుర్ రాయల్ ఫ్యామిలీకి చెందిన ఆస్తి అని, దాన్ని మొఘల్ చక్రవర్తి షాజహాన్ పాలనలో బలవంతంగా లాక్కున్నారని ఆరోపించారు. తాజ్‌మహల్ తమదే అని నిరూపించేందుకు అవసరమైన డాక్యుమెంట్లు కూడా తమ వద్ద ఉన్నాయని వెల్లడించారు. అయితే దీనిపై కోర్టును ఆశ్రయించే విషయంపై ప్రస్తుతానికి ఎలాంటి నిర్ణయం తీసుకోలేదన్నారు. తాజ్‌మహల్ ఉన్న చోటును తీసుకున్నందుకు షాజహాన్ కొంత పరిహారం ఇచ్చారని విన్నట్టు తెలిపారు. తాజ్‌మహల్ స్థలం మాదే అనేందుకు మా వద్ద పత్రాలున్నాయి. కోర్టు అడిగితే వాటిని సమర్పిస్తామని దియా కుమారి వ్యాఖ్యానించారు.