Modi Affidavit: నరేంద్ర మోదీ ఆస్తులు ఈ పదేళ్ళలో ఎంత పెరిగాయి? వారణాసిలో నామినేషన్‌కు తోడుగా వచ్చిన ఆ నలుగురు ఎవరు?
Narendra Modi Affidavit: ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ప్రస్తుత లోక్‌సభ ఎన్నికల్లో వారణాసి నుంచి పోటీ చేసేందుకు మే 14న నామినేషన్ పత్రాలు దాఖలు చేశారు.
Narendra Modi Affidavit: ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ప్రస్తుత లోక్‌సభ ఎన్నికల్లో వారణాసి నుంచి పోటీ చేసేందుకు మే 14న నామినేషన్ పత్రాలు దాఖలు చేశారు. ఏడో దశలో భాగంగా జూన్ 1న ఇక్కడ పోలింగ్ జరగబోతోంది. నామినేషన్ పత్రాల్లో ఆయన పేరిట ఎన్ని ఆస్తులు ఉన్నాయి, ఆయన బ్యాంకు ఖాతాలో ఎంత డబ్బుంది? ఆయనకు సొంత ఇల్లు లేదా కారు ఉన్నాయా? లాంటి వివరాలు ఉన్నాయి. వీటితోపాటు ఆయన అఫిడవిట్‌పై సంతకాలు పెట్టిన ప్రపోజర్ల గురించి మీడియాలో కథనాలు వస్తున్నాయి.
మోదీకి సొంత ఇల్లు ఉందా?
మొత్తంగా నరేంద్ర మోదీ పేరిట రూ.3.02 కోట్ల విలువైన చరాస్తులు ఉన్నట్లు పత్రాల్లో పేర్కొన్నారు. చేతిలో నగదు రూ.52,940 ఉన్నట్లు వెల్లడించారు.
తనకు సొంత ఇల్లు లేదా భూమి లేదా కారు కూడా లేవని అఫిడవిట్‌లో నరేంద్ర మోదీ పేర్కొన్నారు.
2018-19 నుంచి 2022-23 మధ్య మోదీ ట్యాక్సబుల్ ఇన్‌కమ్ (పన్ను చెల్లించాల్సిన ఆదాయం) రూ.11 లక్షల నుంచి రూ.23.5 లక్షలకు పెరిగింది.
ఫిక్సిడ్ డిపాజిట్ ఎంత?
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ పేరిట స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బీఐ)లో రెండు ఖాతాలు ఉన్నాయి. వీటిలో గుజరాత్ గాంధీనగర్ బ్రాంచ్ ఖాతాలో రూ.73,304 ఉన్నాయి. రెండో ఖాతా వారణాసి బ్రాంచ్‌లో ఉంది. దీనిలో రూ.7,000 మాత్రమే ఉన్నాయి.
మరోవైపు ఎస్‌బీఐలో నరేంద్ర మోదీకి ఫిక్సిడ్ డిపాజిట్ కూడా ఉంది. దీని మొత్తం విలువ రూ.2.85 కోట్లు.
ప్రధాని మోదీకి రూ.2.67 లక్షలు విలువైన నాలుగు బంగారు ఉంగరాలు (మొత్తంగా 45 గ్రాములు) కూడా ఉన్నాయి.
రూ.9.12 లక్షల విలువైన నేషనల్ సేవింగ్స్ సర్టిఫికేట్స్ (ఎన్ఎస్‌సీ) కూడా మోదీ పేరిట ఉన్నాయి.
ప్రధానంగా ప్రభుత్వం నుంచి వచ్చే జీతం, బ్యాంకుల నుంచి వచ్చే వడ్డీ ద్వారానే తనకు ఆదాయం వస్తోందని మోదీ వెల్లడించారు.
2019తో పోలిస్తే ఎంత పెరిగాయి?
వారణాసి నుంచి నరేంద్ర మోదీ పోటీ చేయడం ఇది మూడోసారి. గతసారి అంటే 2019లో సమర్పించిన అఫిడవిట్‌లో ఆయన 2.51 కోట్ల ఆస్తులు ఉన్నట్లు వెల్లడించారు.
2014లో తన ఆస్తులను 1.66 కోట్లుగా మోదీ పేర్కొన్నారు.
అంటే గత ఐదేళ్లలో మోదీ ఆస్తుల మొత్తం విలువ రూ.50 లక్షలు పెరిగింది. అదే పదేళ్లతో పోలిస్తే దాదాపు 1.5 కోట్లు పెరిగింది.
కేసులు ఏమైనా ఉన్నాయా?
విద్యార్హతల విషయానికి వస్తే, 1978లో దిల్లీ యూనివర్సిటీ నుంచి బ్యాచెలర్ ఆఫ్ ఆర్ట్స్ (బీఏ) పూర్తిచేశానని తెలిపారు. 1983లో గుజరాత్ యూనివర్సిటీ నుంచి ఎంఏ పూర్తిచేశానని వెల్లడించారు.
అయితే, తనపై ఎలాంటి క్రిమినల్ కేసులూ లేవని అఫిడవిట్‌లో మోదీ స్పష్టంచేశారు.
భార్య వివరాలకు వస్తే, ఆమె ఆదాయం దగ్గర నాట్ నోన్ (తెలియదు) అని పేర్కొన్నారు. ఆమె వృత్తి వివరాల్లోనూ నాట్ నోన్ అనే రాశారు.
నామినేషన్‌కు వెంట వచ్చిన ఆ నలుగురు ఎవరు?
నామినేషన్ పత్రాల్లో సంతకాలు పెట్టే నలుగురు ప్రపోజర్లను వెంటపెట్టుకుని వచ్చి నరేంద్ర మోదీ ఆ పత్రాలను సమర్పించారు.
ఇంతకీ ఆ నలుగురూ ఎవరు, వారి సామాజిక నేపథ్యం ఏమిటని కూడా చర్చ జరుగుతోంది.
ఆ నలుగురూ.. పండిట్ జ్ఞానేశ్వర్ శాస్త్రి, లాల్‌చంద్ కుశ్వాహా, బైజ్‌నాథ్ పటేల్, సంజయ్ సోంకర్. వీరంతా వారణాసి ఓటర్లే. సాధారణంగా ప్రపోజర్లు సదరు నియోజకవర్గానికి చెందినవారై ఉండాలి.
2014, 2019 తరహాలోనే ఈ నలుగురూ నాలుగు భిన్న సామాజిక వర్గాలకు చెందినవారిని ఎంచుకున్నారు.
బ్రాహ్మణుడు, ఓబీసీ, దళితుడు...
వీరిలో పండిట్ జ్ఞానేశ్వర్ బ్రాహ్మణ వర్గానికి చెందినవారు. అయోధ్య రామ మందిర ప్రాణప్రతిష్ఠకు ముహూర్తం ఖరారు చేసేందుకు పనిచేసిన పండితుల్లో ఈయన కూడా ఒకరు.
లాల్‌చంద్ కుశ్వాహా ఓబీసీ వర్గానికి చెందిన వారు. ఆయన ఏఎన్ఐ వార్త సంస్థతో మాట్లాడారు. ‘‘నేను క్షేత్రస్థాయిలో పనిచేసే కార్యకర్తను. ఇలాంటి అవకాశం నాకు ఇచ్చినందుకు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి, భారతీయ జనతా పార్టీ (బీజేపీ)కి నేను ధన్యవాదాలు చెబుతున్నాను. పార్టీ నాపై విశ్వాసం ఉంచింది. నాకు చాలా సంతోషంగా అనిపిస్తోంది’’ అని ఆయన చెప్పారు.
మూడో ప్రపోజర్ బైజ్‌నాథ్ పటేల్ కూడా ఓబీసీ వర్గానికే చెందినవారు. ఈయనకు రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ (ఆర్‌ఎస్ఎస్) నేపథ్యముంది.
నాలుగో ప్రపోజర్ సంజయ్ దళిత వర్గానికి చెందినవారు. ఈయన కూడా బీజేపీ కార్యకర్తే.
మోదీ ఏం చెప్పారు?
నామినేషన్ పత్రాలు సమర్పించిన తర్వాత ట్విటర్ (ఎక్స్) వేదికగా నరేంద్ర మోదీ ట్వీట్ చేశారు.
‘‘వారణాసి ప్రజలకు సేవ చేసే అవకాశం రావడం నిజంగా నా అదృష్టం. ఇక్కడి ప్రజల ఆశీస్సులతో గత పదేళ్లలో చాలా అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాం. రానున్న రోజుల్లో మరింత వేగంగా పనులు జరిగేలా చూస్తాం’’ అని మోదీ అన్నారు.
‘‘నేను చాలా భావోద్వేగానికి గురయ్యాను. అసలు మీ ప్రేమలో పదేళ్లు ఎలా గడిచిపోయాయో తెలియడం లేదు. గంగమ్మ నన్ను దత్తత తీసుకున్నట్లుగా అనిపిస్తోంది’’ అని మోదీ వ్యాఖ్యలు చేశారు.