Agniban Rocket: విజయవంతంగా నింగిలోకి దూసుకెళ్లిన ప్రైవేట్ రాకెట్ అగ్నిబాన్
ISRO: శ్రీహరికోట నుంచి తొలిసారి ఓ ప్రైవేట్ రాకెట్ నింగిలోకి దూసుకెళ్లింది.
ISRO: శ్రీహరికోట నుంచి తొలిసారి ఓ ప్రైవేట్ రాకెట్ నింగిలోకి దూసుకెళ్లింది. అగ్నికుల్ కాస్మోస్ ఏరోస్పేస్ సంస్థ రూపొందించిన అగ్నిబాన్ రాకేట్ ప్రయోగం విజయవంతం అయ్యింది. ఈమేరకు ఇస్రో తన అధికారిక ఖాతా ట్విట్టర్‌లో పేర్కొంది. దేశంలోనే మొదటి సెమీ క్రయోజనిక్ ఇంజిన్ ఆధారిత రాకెట్‌గా అగ్నిబాణ్ రికార్డులకెక్కింది. దేశీయంగా రూపొందించిన 3డీ ప్రింటెడ్ ఇంజిన్‌ను ఇందులో ఉపయోగిస్తున్నారు. ఇస్రో అధిపతి డాక్టర్ సోమనాథ్ ప్రత్యేకంగా షార్‌కు చేరుకుని దగ్గరుండి పర్యవేక్షించారు.
సతీష్ ధవన్ స్పేస్ సెంటర్‌లోని ధనుష్ రాకెట్ కాంప్లెక్స్ నుంచి ఈ ఏడాది మార్చి 22న తొలిసారి దీనిని ప్రయోగానికి సిద్ధం చేశారు. చివర్లో సాంకేతిక లోపంతో వాయిదా వేశారు. మళ్లీ ఏప్రిల్ నెల 6న మరోసారి ప్రయోగానికి సిద్ధమైనప్పటికీ, సాంకేతికపరమైన కారణాలు, వాతావరణ పరిస్థితులు అనుకూలంగా లేకపోవడంతో వాయిదా పడింది. వీటిన్నింటినీ అధిగమించి మే 28వ తేదీ తెల్లవారుజామున 5.45 గంటలకు మరోసారి ప్రయోగానికి సిద్ధమయ్యారు. రాకెట్ లాంచ్‌కు సరిగ్గా 11 సెకన్లకు ముందు కమాండ్ కంట్రోల్ సిస్టంలో సాంకేతిక లోపం తలెత్తడంతో ప్రయోగాన్ని నిలిపివేశారు. అనేక ఆటాంకాలను అధిగమించి.. చివరగా ఈరోజు ఉదయం ఈ రాకేట్ సస్సెస్ ఫుల్‌గా నింగిలోకి దూసుకెళ్లింది.