Samvidhan Hatya Diwas: ఎమర్జెన్సీ విధించిన రోజును రాజ్యాంగ హత్యా దినంగా ప్రకటించడంపై అధికార, విపక్షాల మధ్య మాటల యుద్ధం

ఇందిరాగాంధీ ఎమర్జెన్సీని విధించాలని తీసుకున్న నిర్ణయాన్ని అప్పట్లో శివసేన అధినేత బాల్ థాక్రే సమర్ధించారని శివసేన (ఉద్ధవ్ ) వర్గం నాయకులు సంజయ్ రౌత్ చెప్పారు. ఇందిరాగాంధీకి బాల్ థాక్రే బహిరంగంగానే మద్దతు పలికారని ఆయన గుర్తు చేశారు

Update: 2024-07-13 10:24 GMT

Samvidhan Hatya Diwas: ఎమర్జెన్సీ విధించిన రోజును రాజ్యాంగ హత్యా దినంగా ప్రకటించడంపై అధికార, విపక్షాల మధ్య మాటల యుద్ధం

Samvidhan Hatya Diwas: దేశంలో ఎమర్జెన్సీ విధించిన జూన్ 25వ తేదీని రాజ్యాంగ హత్యా దినంగా జరుపుకోవాలని కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై విపక్షాలు విమర్శలు చేస్తున్నాయి. 1975 జూన్ 25న అప్పటి ప్రధానమంత్రి ఇందిరా గాంధీ దేశంలో ఎమర్జెన్సీని విధించారు. ఆ చీకటి రోజులకు నిరసనగా ఇక నుంచి ప్రతి ఏటా జూన్ 25వ తేదీని సంవిధాన్ హత్యాదివస్ గా నిర్వహించాలని నిర్ణయించినట్టుగా కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా జూలై 12న సోషల్ మీడియా వేదికగా ప్రకటించారు.


 

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కూడా సంవిధాన్ హత్యాదివస్ అంశంపై స్పందించారు. ఎమర్జెన్సీ కారణంగా నష్టపోయిన ప్రతి ఒక్కరిని స్మరించుకొనే రోజు జూన్ 25 అని ఆయన అన్నారు.

ఈ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నామని జేడీ (యు) నేత కేసీ త్యాగి అన్నారు. భారత చరిత్రలో ఒక చీకటి రోజును ఇలా గుర్తు చేసుకోవడం సంతోషంగా ఉందని ఆయన ఏఎన్ఐతో అన్నారు.


 మోదీ పదేళ్ళ పాలనలో ప్రతి రోజూ రాజ్యాంగ హత్యాదినమే.. - ఖర్గే

ఎమర్జెన్సీ విధించిన జూన్ 25ను సంవిధాన్ హత్యాదివస్ గా మార్చడంపై కాంగ్రెస్ ఆగ్రహం వ్యక్తం చేసింది. మోదీ సర్కార్ 10 ఏళ్ళ పాలనలో ప్రతి రోజూ సంవిధాన్ హత్యాదినమేనని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే తీవ్రంగై విమర్శించారు.

మణిపూర్ లో జరిగిన హింసను కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ప్రస్తావించారు. రాజ్యాంగం హత్య అంటూ అంబేడ్కర్ ను అవమానిస్తున్నారని ఆయన బీజేపీపై మండిపడ్డారు.

మధ్యప్రదేశ్‌లో బీజేపీ నేత ఆదివాసీల పై మూత్ర విసర్జన చేసినప్పుడు, హాథ్రస్‌లో దళిత అమ్మాయిని విచారణ లేకుండానే పోలీసులు అంతిమ సంస్కారం చేసినప్పుడు... అదంతా రాజ్యాంగ హత్య కాకపోతే మరేమిటని ఖర్గే ప్రశ్నించారు.


 భారత రాజ్యాంగానికి బీజేపీయే వ్యతిరేకం

భారత రాజ్యాంగాన్ని వ్యతిరేకించింది బీజేపీయేనని కాంగ్రెస్ నాయకులు, మాజీ మంత్రి జైరాం రమేష్ గుర్తు చేశారు. మనుస్మృతికి విరుద్ధంగా ఉందని రాజ్యాంగాన్ని మోదీ పరివారమే వ్యతిరేకించిందని ఆయన ఆరోపించారు. 1949 నవంబర్ లో మోదీ బృందం భారత రాజ్యాంగాన్ని వ్యతిరేకించిందని ఆయన గుర్తు చేశారు.


 గాంధీ హత్య జరిగిన రోజును గాంధీ హత్యాదివస్ గా ప్రకటించాలి

మహాత్మాగాంధీ హత్య జరిగిన జనవరి 30న గాంధీ హత్యాదివస్ గా ప్రకటించాలని ఆర్ జేడీ ఎంపీ మనోజ్ ఝా కోరారు. బీజేపీ ద్వంద్వ విధానాలు పాటిస్తుందని ఆయన విమర్శించారు. ఎమర్జెన్సీ విధించిన రోజును సంవిధాన్ హత్యాదివస్ గా మార్చడాన్ని ఆయన తప్పుబట్టారు.


 ఎమర్జెన్సీని సమర్ధించిన బాల్ థాక్రే: శివసేన నాయకులు సంజయ్ రౌత్

ఇందిరాగాంధీ ఎమర్జెన్సీని విధించాలని తీసుకున్న నిర్ణయాన్ని అప్పట్లో శివసేన అధినేత బాల్ థాక్రే సమర్ధించారని శివసేన (ఉద్ధవ్ ) వర్గం నాయకులు సంజయ్ రౌత్ చెప్పారు. ఇందిరాగాంధీకి బాల్ థాక్రే బహిరంగంగానే మద్దతు పలికారని ఆయన గుర్తు చేశారు. ముంబైకి ఇందిరాగాంధీ అప్పట్లో వచ్చిన ఆయన ప్రస్తావించారు.


 ఎమర్జెన్సీ ఎప్పుడు.. ఎలా?

ఇందిరాగాంధీ 1971లో రాయ్ బరేలీ నుండి ఇందిరాగాంధీకి వ్యతిరేకంగా యునైటెడ్ సోషలిస్ట్ పార్టీ అభ్యర్ధిగా రాజ్ నారాయణ్ బరిలో దిగారు. ఈ ఎన్నికల్లో ఇందిరాగాంధీ అక్రమాలకు పాల్పడి విజయం సాధించారని ఆయన అలహాబాద్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ పై విచారణ నిర్వహించిన అలహాబాద్ హైకోర్టు ఇందిరాగాంధీ ఎన్నిక రద్దు చేసింది.

అంతేకాదు ఆరేళ్ల పాటు ఆమె ఎన్నికల్లో పోటీ చేయడంపై నిషేధం విధించారు. అయితే ఈ తీర్పును ఆమె సుప్రీంకోర్టులో సవాల్ చేశారు. ప్రధానమంత్రిగా ఇందిరా గాంధీ కొనసాగవచ్చని... ఎంపీగా మాత్రం ఆమె ఎన్నిక చెల్లదని సుప్రీంకోర్టు తీర్పు వెల్లడించింది. ఆ తీర్పుతో ఇందిర రాజీనామా చేయాలంటూ నిరసనలు కొనసాగాయి. ఆ పరిస్థితుల్లో ఇందిరా గాంధీ 1975 జూన్ 25న ఎమర్జెన్సీ డిక్లర్ చేశారు. ఎమర్జెన్సీ కాలంలో ఇందిర వ్యతిరేకులు చాలా మందిని అరెస్ట్ చేసి జైల్లో పెట్టారు. ప్రతిపక్షాల నుంచి తీవ్ర స్థాయిలో నిరసనలు వ్యక్తమయ్యాయ. దాదాపు రెండేళ్ళ తరువాత 1977 మార్చి 21న ఎమర్జెన్సీని ఎత్తివేశారు.

ఇప్పుడు మోదీ ప్రభుత్వం.. ఎమర్జెన్సీ విధించిన రోజున సంవిధాన్ హత్యాదివస్ గా పాటించాలని నిర్ణయం తీసుకోవడం కొత్త వివాదానికి తెరలేపింది. ఈ నిర్ణయాన్ని కాంగ్రెస్ సహా ఇండియా కూటమి పక్షాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి.

Tags:    

Similar News