Indian Students Abroad: ఐదేళ్లలో విదేశాల్లో 633 మంది భారత విద్యార్థుల మృతి

Indian Students Abroad: విదేశాల్లో విద్యనభ్యసించేందుకు వెళ్లిన వారిలో ఐదేళ్లలో 633 మంది విద్యార్థులు మరణించారని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది.

Update: 2024-07-27 15:09 GMT

Indian Students Abroad: ఐదేళ్లలో విదేశాల్లో 633 మంది భారత విద్యార్థుల మృతి

Indian Students Abroad: విదేశాల్లో విద్యనభ్యసించేందుకు వెళ్లిన వారిలో ఐదేళ్లలో 633 మంది విద్యార్థులు మరణించారని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. కెనడాలోనే అత్యధికంగా 172 మంది చనిపోయారని కేంద్ర విదేశీ వ్యవహరాల శాఖ సహాయ మంత్రి కీర్తివర్ధన్ సింగ్ తెలిపారు.

కేరళకు చెందిన ఎంపి కె. సురేష్ అడిగిన ప్రశ్నకు మంత్రి లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు. ఆరోగ్య పరిస్థితులు, రోడ్డు ప్రమాదాలు, మెడికల్ ఎమర్జెన్సీ కారణంగా ఈ మరణాలు జరిగాయని ఆ సమాధానంలో కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఐదేళ్లలో కెనడాలో 172 మంది చనిపోయారు. అమెరికాలో 108, యూకేలో 58, అస్ట్రేలియాలో 57, రష్యాలో 37, జర్మనీలో 24, పాకిస్తాన్ లో ఒక్కరు చనిపోయారు. విదేశాల్లో జరిగిన దాడులు, హింసల్లో 19 మంది మృతి చెందారు. ఇందులో కూడా కెనడా టాప్ లో నిలిచింది. ఇక్కడ 9 మంది విద్యార్థులు చనిపోయారు. ఆ తర్వాతి స్థానంలో అమెరికా నిలిచింది. ఇక్కడ ఆరుగురు మరణించారు. అస్ట్రేలియా, యూకే, చైనా, కిర్గిజిస్తాన్ లలో ఒక్కొక్కరు మృతి చెందారని కేంద్ర ప్రభుత్వ నివేదిక వెల్లడించింది.

విదేశాల్లో భారత విద్యార్థుల మృతికి కారణమైన వారికి శిక్షపడేలా చర్యలు

విదేశాల్లో భారతీయ విద్యార్థుల మృతికి కారణమైన దోషులను కఠినంగా శిక్షలు పడేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని విదేశీ వ్యవహరాల శాఖ తెలిపింది. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న పలు దేశాల్లోని రాయబార కార్యాలయాలు ఈ మేరకు పనిచేస్తాయని ప్రభుత్వం వివరించింది. అత్యవసర పరిస్థితుల్లో విదేశాల్లో చిక్కుకున్న విద్యార్థులను వందేభారత్ మిషన్, ఆపరేషన్ గంగా, ఆపరేషన్ అజయ్ చేపట్టిన విషయాన్ని కేంద్ర మంత్రి గుర్తు చేశారు. పలు దేశాల్లో 1.33 మిలియన్ల మంది విద్యార్థులు విద్యనభ్యసిస్తున్నారని ప్రభుత్వం తెలిపింది.

మూడేళ్లలో అమెరికా నుంచి 48 మంది భారత విద్యార్థుల బహిష్కరణ

అమెరికా నుంచి 48 మంది భారత విద్యార్ధులను మూడేళ్ల కాలంలో బహిష్కరించారు. అనధికారికంగా ఉపాధి పొందడం,ప్రాక్టికల్ ట్రైనింగ్ కు సంబంధించిన నిబంధనలు ఉల్లంఘిస్తే విద్యార్థులను బహిష్కరిస్తారు. అయితే ఈ 48 మంది విద్యార్థుల బహిష్కరణకు సంబంధించి యూఎస్ఏ అధికారికంగా ఎలాంటి ప్రకటన చేయలేదని కేంద్ర మంత్రి తెలిపారు.

విదేశాల్లో ఉన్నత విద్య కోసం వెళ్లే విద్యార్థుల సంఖ్య ప్రతి ఏటా పెరుగుతోంది. వారి భద్రత విషయంలో ప్రభుత్వం ఒక విధానాన్ని రూపొందిచాలని నిపుణులు కోరుతున్నారు.

Tags:    

Similar News